Begin typing your search above and press return to search.

నాట‌కం వేసిన ఎమ్మెల్యే అడ్డంగా బుక్క‌య్యాడుగా

By:  Tupaki Desk   |   2 Oct 2019 4:47 PM GMT
నాట‌కం వేసిన ఎమ్మెల్యే అడ్డంగా బుక్క‌య్యాడుగా
X
ఉన్న‌త స్థానంలో ఉన్న‌వారు ఉద్దేశ‌పూర్వ‌కంగా చేసినా....అనుకోకుండా చేసిన ఆ పొర‌పాటు వారిప‌ట్ల గ్ర‌హ‌పాటుగా మారుతుంది!. చిక్కుల్లో ప‌డేస్తుంది!! ఇక రాజకీయాల్లో ఉన్న‌వారు ఇబ్బందిక‌రంగా ప్ర‌వ‌ర్తిస్తే...వారిని ప్ర‌త్య‌ర్థులు స‌హ‌జంగానే ఓ రేంజ్‌లో ఆడుకుంటారు. ఉత్తరాఖండ్‌ లోని రుద్రాపూర్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజ్‌ కుమార్‌ తుక్రాల్ ఇలా ఊహించ‌ని రీతిలో వివాదంలో చిక్కుకున్నారు. దసరా నేప‌థ్యంలో వేసిన రామ్‌ లీలా నాట‌కంలో భాగంగా సీతాదేవిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. `సీతా మేరీ జాన్‌` అని వ్యాఖ్యానించి చిక్కుల్లో ప‌డ్డారు.

సీతారాముల గొప్పతనం నేటి తరానికే తెలియజేసేందుకు ద‌స‌రాను పుర‌స్క‌రించుకొని ఉత్తర భారతదేశంలోని అన్ని గ్రామాల్లోనూ దాదాపు రామ్‌ లీలా నాటకం వేస్తారు. ఈ ఒర‌వ‌డిలోనే...రుద్రాపూర్ నియోజకవర్గంలో రామ్‌ లీలా నాటకం ప్రదర్శించారు. ఇందులో బీజేపీ ఎమ్మెల్యే రాజ్‌ కుమార్‌ తుక్రాల్ రావణాసురుడి పాత్ర వేశారు. పాత్ర‌దారుల మ‌ధ్య సంభాష‌ణ‌ల్లో భాగంగా - సీతాదేవి- రావణునికి మధ్య వచ్చే సన్నివేశంలో బీజేపీ ఎమ్మెల్యే నోరుజారారు. ‘ సీతా మేరీ జాన్‌’ అంటూ సీతాదేవిని బీజేపీ ఎమ్మెల్యే సంభోదించారు. దీంతో నాట‌కం జ‌రుగుతున్న చోట క‌ల‌క‌లం రేగింది. కొంద‌రు న‌వ్వ‌గా...మ‌రికొంద‌రు అభ్యంత‌రం చెప్పారు. ఈ క‌ల‌క‌లాన్ని గ‌మ‌నించిన నిర్వాహ‌కులు ఎమ్మెల్యేగారి మాట‌ల‌కు అడ్డుచెప్పారు. అయిన‌ప్ప‌టికీ...ఆయ‌న అలాగే సంభోదించారు.

గ‌త ఆదివారం జ‌రిగిన ఈ ఉదంతం సోష‌ల్ మీడియాలో స‌హ‌జంగానే వైర‌ల్ అయింది. ఎమ్మెల్యే తీరుపై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ సైతం ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. రావణుడు కూడా సీతమ్మను ఎప్పడూ ‘ సీతా దేవి’ అని సంభోదించేవాడని - కానీ తాజాగా ఎమ్మెల్యే వ్య‌వ‌హార‌శైలితో ఆయ‌న‌కు సీత‌మ్మ‌పై ఉన్న గౌర‌వం స్ప‌ష్ట‌మైంద‌ని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు సూర్యకాంత్‌ మండిప‌డ్డారు. బీజేపీ నేత క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. అయితే, బీజేపీ ఎమ్మెల్యే మాత్రం త‌న వైఖ‌రిని స‌మ‌ర్థించుకున్నారు. అక్కడ మాట్లాడింది కేవలం రావణాసుర పాత్రదారే తప్ప రాజ్‌ కుమార్‌ కాదని గ‌మ‌నించాల‌ని కోరారు. పైగా, తాను సీతాదేవిని ‘మేరీ జాన్‌’ అని నాటకంలో భాగంగానే సంభోదించానే త‌ప్ప వేరే ఉద్దేశంతో కాదని...దీనిని రాజ‌కీయం చేయ‌వ‌ద్ద‌ని విజ్ఞ‌ప్తి చేశారు.