Begin typing your search above and press return to search.

ఇలాంటి అక్కాచెల్లెల్లు సో స్పెషల్.. తెలిసినంతనే షాక్

By:  Tupaki Desk   |   22 Aug 2021 4:03 AM GMT
ఇలాంటి అక్కాచెల్లెల్లు సో స్పెషల్.. తెలిసినంతనే షాక్
X
అవును.. ఈ అక్కాచెల్లెళ్లు చాలా ప్రత్యేకం. ఇలాంటివి దేశం కాని దేశాల్లో ఎక్కడో జరుగుతుంటాయని వార్తాపత్రికల్లో చదువుతుంటాం. ఈసారి మాత్రం తెలంగాణలోని కరీంనగర్ పట్టణంలో చోటు చేసుకుంది. మూడు నెలల వ్యవధిలోనే అక్కా.. చెల్లెళ్లు ఇద్దరికి తొలి కాన్పు కావటం.. ఆ సందర్భంగా ఇద్దరికి కలిపి ఏడుగురు సంతానం జన్మించటం ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ కారణంగా వారి పుట్టింట్లో మూడు నెలల వ్యవధిలో ఏడు ఊయలలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి చోటు చేసుకుంది. చాలా చాలా అరుదుగా మాత్రమే చోటు చేసుకునే ఈ ఉదంతంలోకి వెళితే..

కరీంనగర్ కు చెందిన నిఖిత.. లిఖిత ఇద్దరు కవల పిల్లలు. ఈ ఇద్దరికి మూడు నెలల తేడాతో ప్రసవాలు అయ్యాయి. ఈ సందర్భంగా లిఖతకు ముగ్గురు కవలలు పుడితే.. తాజాగా నిఖితకు ఏకంగా నలుగురు కవలలు పుట్టటం విశేషం. కరీంనగర్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రి ఇందుకు వేదికైంది. వారం క్రితం నిండు గర్భంతో చేరిన నిఖితకు కవలలు జన్మిస్తారన్న అవగాహన ఉండటం.. మామూలు కంటే ఎక్కువ సైజులో గర్భం ఉండటంతో ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచారు.

తాజాగా ఆమె నలుగురు బిడ్డలకు జన్మనిచ్చింది. వీరిలో ఇద్దరు మగ పిల్లలు అయితే.. ఇద్దరు ఆడపిల్లలు. పుట్టిన నలుగురిలో ముగ్గురు శిశువులు కిలో బరువుకు మించి ఉంటే.. ఒక శిశువు మాత్రం 700 గ్రాముల బరువుతోనే ఉన్నారు. దీంతో.. మరింత శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రస్తుతం శిశువులంతా ఆరోగ్యంగా ఉన్నట్లు చెబుతున్నారు. తక్కువ బరువుతో పుట్టటం వల్ల ఇంక్యుబేటర్ లో ఉంచి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే..ఈ కవలల అక్కాచెల్లెళ్లకు ఇదే తొలి కాన్పు కావటం. వినేందుకు విచిత్రంగా ఉన్నప్పటికి.. ప్రాక్టికల్ గా చూస్తే.. ఎంత కష్టమో? పుట్టింటి వారికి ఒక పాపాయికి బదులు ఏకంగా ఏడుగురు మనమళ్లు.. మనమరాళ్లుపుట్టటం.. వారిని సాకటం అంత తేలికైన వ్యవహారం కాదు. ఓవైపు సంతోషం.. మరోవైపు షాక్ అంటే ఇదేనేమో కదూ?