Begin typing your search above and press return to search.

ఆస్తి కోసం సొంత అక్కపై చెల్లెలి దారుణం

By:  Tupaki Desk   |   1 Feb 2022 2:31 PM GMT
ఆస్తి కోసం సొంత అక్కపై చెల్లెలి దారుణం
X
సమాజంలో బంధాలు మాయమవుతున్నాయి. ఆస్తుల కోసం కొడుకులే కాదు.. కూతుళ్లు కూడా చంపుకుంటున్న దారుణం కనిపిస్తోంది. తాజాగా ఆస్తి కోసం అక్కనే చంపేసింది ఓ కసాయి చెల్లెలు. పుట్టింటి తరుఫు ఆస్తి కోసం అక్కపై చెల్లెలు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామంలో తీవ్ర విషాదం నింపింది.

కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డికి చెందిన ధర్మగౌని రాజాగౌడ్ కు నలుగురు కుమార్తెలు. వీరందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. వీరిలో ఒకరైన వరలక్ష్మీ వడియారం గ్రామంలో అద్దె ఇంట్లో ఉంటోంది. పుట్టింటికి చెందిన ఐదు ఎకరాల పంపకం విషయంలో అక్కాచెల్లెల్ల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది.

ఈ క్రమంలోనే వరలక్ష్మీ సోదరి రాజేశ్వరి వడియారంలోని ఆమె ఇంటికి వచ్చారు. వారిద్దరి మధ్య ఆస్తి విషయమై వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి గురైన రాజేశ్వరి తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను పకడ్ందీగా వరలక్ష్మీ పై పోసి నిప్పంటించింది.

మంటలతోనే ఉన్న వరలక్ష్మీ వెళ్లి చెల్లెలు రాజేశ్వరిని గట్టిగా పట్టుకుంది. దీంతో ఇద్దరూ గాయపడ్డారు. ఇంట్లోనే ఉన్న వరలక్ష్మీ పిల్లలు కేకలు వేయడంతో స్థానికులు వచ్చి మంటలు ఆర్పివేశారు.

వెంటనే 108 సిబ్బంది ద్వారా తీవ్రంగా గాయపడిన వరలక్ష్మీని హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. మరో ప్రైవేటు అంబులెన్స్ లో రాజేశ్వరిని తుఫ్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇలా ఆస్తి కోసం సొంత అక్కాచెల్లెల్లు మధ్య వివాదం రావడం.. అక్కపై పెట్రోల్ పోసిన వైనం చర్చనీయాంశమైంది. ఆస్తి కోసం కొడుకులు కొట్టుకుంటున్న వైనం చూసిన జనం.. ఇలా కూతుళ్లు ప్రాణాలు తీసుకోవడం చూసి విస్మయం చెందారు.