Begin typing your search above and press return to search.

సంచ‌ల‌నంగా మారిన శిరీష భ‌ర్త స‌వాలు

By:  Tupaki Desk   |   30 Jun 2017 5:53 PM GMT
సంచ‌ల‌నంగా మారిన శిరీష భ‌ర్త స‌వాలు
X
బ్యూటీషియ‌న్ శిరీష మ‌ర‌ణానికి సంబంధించి నాట‌కీయ ప‌రిణామాలు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. తొలుత అనుమానాస్ప‌ద మృతిగా పేర్కొన్న పోలీసులు.. త‌ర్వాత ఆత్మ‌హ‌త్య‌గా పేర్కొన్నారు. అయితే.. శిరీష మ‌ర‌ణంపై ఆమె బంధువులు ప‌లు సందేహాలు వ్య‌క్తం చేశారు. ఇలాంటి వేళ‌లోనే ఆమె లోదుస్తుల మీద మ‌ర‌క‌లు ఉన్న‌ట్లుగా పేర్కొన్న నివేదిక శిరీష మ‌ర‌ణంపై మ‌రిన్ని అనుమానాలకు గురి చేసేలా చేశాయి. మ‌రోవైపు.. శిరీష‌ది ఆత్మ‌హ‌త్యేన‌ని పోలీసులు చెబుతున్నారు.

ఆమె మ‌ర‌ణంపై ఎవ‌రికైనా సందేహాలు ఉంటే.. త‌మ వ‌ద్ద‌కు రావాల‌ని.. నివృతి చేస్తామ‌ని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా శిరీష భ‌ర్త సీన్లోకి వ‌చ్చారు. ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకునేంత పిరికిది కాద‌ని భ‌ర్త స‌తీష్ చంద్ర అభిప్రాయ‌ప‌డుతున్నారు. శిరీష మ‌ర‌ణం నుంచి బ‌య‌ట‌కు రాని ఆయ‌న‌.. తాజాగా మాత్రం పోలీసుల తీరుపై ప‌లు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. పోలీసుల ద‌ర్యాప్తును త‌ప్పు ప‌డుతున్నారు. శిరీష‌ను హ‌త్య చేసి స్టూడియోకి తెచ్చి ఉంటార‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.

పోలీసులు చెబుతున్న వాద‌న‌లో నిజం లేద‌ని.. శిరీష‌ను చంపిన త‌ర్వాతే హైద‌రాబాద్ కు తీసుకొచ్చి ఉంటార‌న్నారు. ఆప‌ద‌లో ఉన్నందునే తాను ఎక్క‌డ ఉన్నాన‌నో తెలిపేందుకే లొకేష‌న్ షేర్ చేసి ఉంద‌న్నారు. శిరీష లొకేష‌న్ షేర్ చేసిన త‌ర్వాత కూడా బ‌తికి ఉంద‌ని పోలీసులు చెప్ప‌గ‌ల‌రా? ఆధారాలు చూపించ‌గ‌ల‌రా? అని ప్ర‌శ్నిస్తున్నారు. రాత్రి 1.40 గంట‌ల త‌ర్వాత శిరీష బ‌తికి ఉంద‌న్న ఆధారాలు చూపిస్తారా? అని అడుగుతున్న ఆయ‌న‌.. కుకునూరుప‌ల్లి పోలీస్ స్టేష‌న్ వ‌ద్దా.. ఆర్ జే స్టూడియో వ‌ద్ద ఉన్న సీసీ కెమేరాలు ఎందుకు ప‌ని చేయ‌టం లేద‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

సీసీ కెమేరాలు ప‌ని చేస్తే వాస్త‌వాలు వెలుగుచూసే అవ‌కాశం ఉంద‌న్నారు. శిరీష మ‌ర‌ణానికి సంబంధించి కీల‌క స‌మాచారాన్ని అందించే రెండు ప్ర‌దేశాల్లోనూ కెమేరాలు ప‌ని చేయ‌క‌పోవ‌టం యాదృశ్చికంగా జ‌రిగిందా? ఉద్దేశ్య‌పూర్వ‌కంగా జ‌రిగిందా అన్న కూడా తేలాల్సి ఉంద‌న్నారు. కేసును ద‌ర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు వాస్త‌వాలు చెప్ప‌కుండా.. శిరీష క్యారెక్ట‌ర్ మీదే ఎక్కువ ఫోక‌స్ ఎందుకు చేస్తున్నార‌న్న సందేహాన్ని వ్య‌క్తం చేశారు. శిరీష మీద బుర‌ద చ‌ల్లేందుకే ప్ర‌య‌త్నిస్తున్నార‌ని వాపోయారు. మ‌రి.. శిరీష భ‌ర్త సందేహాల‌కు స‌మాధానాలు చెప్పే వారెవ‌రు? ఆయ‌న‌కున్న అనుమానాల్ని తీర్చేవారెవ‌రు? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/