Begin typing your search above and press return to search.

పండగ చేసుకోనున్న కేసీఆర్

By:  Tupaki Desk   |   1 Nov 2015 5:30 PM GMT
పండగ చేసుకోనున్న కేసీఆర్
X
తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరావుపై ప్రజల్లో అవిశ్వాసం, అసమ్మతి పెరుగుతున్నప్పటికీ బలహీన ప్రతిపక్షం కారణంగా వరంగల్ లోక్ సభ ఉపఎన్నికలో టీఆరెస్ పని నల్లేరు మీద నడక చందాన ఉండబోతున్నట్లు సూచనలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గంలో తెరాస అభ్యర్థిపై 3.5 లక్షల ఓట్ల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యనే కాంగ్రెస్ మరోసారి అభ్యర్థిగా నిలిపింది. ఎంపీగా ఉన్న కాలంలో కూడా రాజయ్య బాగా చెడ్డపేరు సంపాదించుకున్నందున అలాంటి వ్యక్తిని ప్రజలు మళ్లీ అందలమెక్కించబోరని భావిస్తున్నారు.

బీజేపీ ఇంతవరకూ తన అభ్యర్థినే నిలబెట్టలేకపోగా, వరంగల్ లోక్ సభ స్థానాన్ని బీజేపీకి కట్టబెట్టినందుకు పార్టీ నాయకత్వంపై తీవ్ర అసమ్మతితో ఉన్న తెలుగు దేశం స్థానిక నేతలు తమ మిత్ర పక్షమైన బీజేపీకి సహకారం అందించే విషయం కూడా ప్రశ్నార్థకమైంది. పైగా అధినాయకులు ఎలా కలిసి మెలిసి వ్యవహరిస్తున్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర శాఖలకు సంబంధించినంత వరకు ఈ రెండు పార్టీలు కొట్టుకోవడం ఒక్కటే తక్కువ.. శత్రువుల్లాగా వ్యవహరిస్తున్న మిత్రపక్షాలుగా కొనసాగుతున్నారు.

పోతే, మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా తన అభ్యర్థిని నిలబెడుతోంది కానీ అది టీఆరెస్ వ్యతిరేక ఓట్లను చీల్చడానికే తోడ్పడతాయని పరిశీలకులంటున్నారు. తద్వారా టీఆరెస్‌కే ఆ పార్టీ పరోక్షంగా సహకరించబోతోంది. ఇక బరిలో నిలబడుతున్న వామపక్షాలదీ ఇదే దారే. వీరి ఓట్లు కాంగ్రెస్ అవకాశాలనే దెబ్బతీస్తాయి.

ఏరకంగా చూసినా టీఆరెస్ అభ్యర్థికి గతంలో వచ్చినన్ని ఓట్లు రాకున్నా వరంగల్ ఉప ఎన్నికలో మాత్రం విజయం సాధించడం ఖాయమని తెలుతోంది.