Begin typing your search above and press return to search.

జగన్‌ సార్‌.. జనాలకు కావాల్సింది చిల్లర కాదు అర్థమైందా?

By:  Tupaki Desk   |   18 March 2023 9:41 AM GMT
జగన్‌ సార్‌.. జనాలకు కావాల్సింది చిల్లర కాదు అర్థమైందా?
X
ఆంధ్రప్రదేశ్‌ లో మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అధికార వైసీపీకి దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చాయి. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమల పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ విజయ ఢంకా మోగించింది. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానంలో వైసీపీ స్వల్ప ఆధిక్యంలో ఉన్నా ఇక్కడ కూడా టీడీపీ అభ్యర్థి రాంగోపాల్‌ రెడ్డి విజయం సాధిస్తారనే అంచనాలు ఉన్నాయి.

కాగా తాము అమలు చేస్తున్న నవరత్న పథకాలు, ఇతర సంక్షేమ పథకాలతో సులువుగా మరోసారి అధికారంలోకి వచ్చేస్తామని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్, ఆ పార్టీ నేతలు పెద్ద లెక్కలే వేసుకుంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175కి 175 సాధిస్తామని.. ప్రతిపక్షాలకు ఒక్కసీటు దక్కదని సమరోత్సాహం ప్రకటించారు. అయితే వైసీపీ నేతల చెప్పే మాటలకు, క్షేత్ర స్థాయి పరిస్థితులకు హస్తిమశకాంతరం తేడా ఉందని పట్టభద్రుల ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ముఖ్యంగా పట్టభద్రుల ఎన్నికల్లో ఓట్లేసినవారిలో 20 ఏళ్ల యువత నుంచి వృద్ధుల వరకు ఉన్నారు. డిగ్రీ ఉత్తీర్ణులై ఓటు హక్కు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరూ పట్టభద్రుల ఎన్నికల్లో ఓటేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా యువత అధికార వైసీపీపై ఆగ్రహంగా ఉన్నట్టు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలు స్పష్టం చేశాయి.

'ఏదో పథకం కింద మీ ఖాతాలో చిల్లర పడేశాం.. సంతోషించండి'.. టైపు రాజకీయాలు తమకొద్దు అని యువత తిరస్కరించిందని విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తమకు కావాల్సింది రాష్ట్రాభివృద్ధి, ఉద్యోగాలు మాత్రమేనని యువత ఈ ఫలితాల ద్వారా అధికార వైసీపీకి చాటి చెప్పిందని అంటున్నారు. జనాల ఖాతాల్లో డబ్బులు వేయడమే అభివృద్ధి అని, అదే సంక్షేమమని వైసీపీ చెప్పుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే.

అయితే పట్టభద్రులు మాత్రం తమకు చిల్లర వద్దని.. కావాల్సింది రాష్ట్రానికి పెద్ద కంపెనీలు అని, తమ కాళ్లపైన తాము నిలబడేలా ఉద్యోగాలు కావాలని, ఆత్మగౌరవంతో మాత్రమే తాము బతకాలనుకుంటున్నామని వైసీపీ ప్రభుత్వానికి తేల్చిచెప్పారని అంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే పథకాల కోసం తాము చేయి చాచి బతకాలని అనుకోవడం లేదని.. తాము కోరుకుంటోంది గౌరవప్రదమైన జీవితం మాత్రమేనని చాటి చెప్పినట్టయిందని అంటున్నారు.

అలాగే రాష్ట్రంలో అభివృద్ధి.. ముఖ్యంగా రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ సౌకర్యాలు ఇలాంటి మౌలిక వసతులనే యువత కోరుకుంటోందని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రుజువు చేశాయని అంటున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మౌలిక వసతులు పడకేశాయనే తీవ్ర విమర్శలు ఉన్నాయి.

అదేవిధంగా పెట్టుబడులు పెట్టే కంపెనీలను కొంతమంది వైసీపీ నేతలు కమీషన్ల కోసం వేధించడంతో రాష్ట్రం నుంచి అవి వెళ్లిపోయాయని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమలో జాకీ పరిశ్రమ, అనంతపురంలో కియా పరిశ్రమ విస్తరణ ప్లాంట్‌ ఇలా పక్క రాష్ట్రాలకు తరలిపోయాయని గుర్తు చేస్తున్నారు. ఇక అమరరాజా బ్యాటరీస్‌ వంటి ప్రతిపక్ష నేతలకు చెందిన కంపెనీలను వివిధ సాకులతో ప్రభుత్వం వేధించడంతో ఆ సంస్థ తెలంగాణకు వెళ్లిపోయి రూ.వేల కోట్ల పెట్టుబడులు పెట్టిందని చెబుతున్నారు.

సచివాలయ ఉద్యోగాలు తప్ప వైసీపీ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో భర్తీ చేసిన భారీ రిక్రూట్‌ మెంట్‌ మరేదీ లేదని గుర్తు చేస్తున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం యువత కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం ప్రజల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం.. ఇదే సంక్షేమం, అభివృద్ధి అని భావించడంతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో చావుదెబ్బ తిందని అంటున్నారు. అభివృద్ధి, సంక్షేమం అంటే జనాల ఖాతాల్లో చిల్లర వేయడం కాదు.. అభివృద్ధి, యువతకు ఉద్యోగాలు మాత్రమేనని ఈ ఎన్నికల ద్వారా పట్టభద్రులు వైసీపీ ప్రభుత్వానికి గుర్తు చేశారని చెబుతున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.