Begin typing your search above and press return to search.

ఆ ఒక్క పరీక్ష తో గుండె జబ్బుకు మూడేళ్ల ముందే చెక్..!

By:  Tupaki Desk   |   26 Feb 2022 6:30 AM GMT
ఆ ఒక్క పరీక్ష తో గుండె జబ్బుకు మూడేళ్ల ముందే చెక్..!
X
మన దేశంలో గుండె జబ్బు బారిన పడే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా.. అనేక మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. చిన్న వయసులోనే దీని బారిన పడి మరణిస్తున్నారు. అలా చనిపోతున్న వారి సంఖ్య ఇటీవల కాలంలో మరింత పెరిగింది. ఇలా గుండెపోటుకు గురై ప్రాణాలు వదిలేస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరగడం ప్రస్తుతం వైద్యులను కూడా కలవర పెడుతుంది.

భారత్ లో అనేక మంది గుండె జబ్బు బారిన పడటం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే మన జీవన శైలి అనేది మనల్ని చాలా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే ఈ జీవన శైలి తోనే సరైన సమయానికి చేయాల్సిన పనులు వాయిదా వేసుకుని పోతాం. దీని వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ ప్రస్తావించ దగిన మరో అంశం ఏమిటంటే మనం తీసుకునే ఆహారం.

భారతీయులు ఎక్కువగా తీసుకునే ఆహారంలో ఆయిల్ శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో కుర్ర వయసులో ఉన్న వారిలో కూడా గుండె పోటు వస్తుంది. ఇదే విషయాన్ని చాలా మంది శాస్త్రవేత్తలు వారి అధ్యయనాల్లో పేర్కొన్నారు. అయితే ఇలా గుండె పోటుకు గురి అవుతారు అనే విషయాన్ని ముందుగా మనం గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే మూడేళ్ల ముందుగానే అంచనా వేయొచ్చని అంటున్నారు. అది ఎలానో ఓ సారి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఓ వ్యక్తి గుండె పోటుకు గురయ్యే విషయాన్ని కనీసం మూడేళ్ల ముందే కనుగొనవచ్చు అనే అంశాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనికి ఓ పరీక్ష కూడా ఉందని చెబుతున్నారు. దీన్ని ఫాలో అయితే ఈ వ్యాధి బారిన పడి చనిపోయే వారి సంఖ్య ను గణనీయంగా తగ్గించవచ్చని చెప్తున్నారు. అది ఎలా అంటే కొంత మందిలో చాలా రోజుల పాటు గుండె పోటుకు సంబంధించిన ప్రోటీన్ లు ఉంటాయని వారు కనుగొన్నారు. అవే సి-రియాక్టివ్ ప్రోటీన్‌లు. వాటిని పూర్తి స్థాయిలో పరీక్షించిన తరువాత అందులో వారు వాపుని కనుగొన్నట్లు చెప్తున్నారు. అంతేగాకుండా మరో పరీక్ష గురించి కూడా వారు చెప్పుకొచ్చారు. అదే ట్రోపోనిన్ ప్రామాణిక పరీక్ష.

ఈ ట్రోపోనిన్ అనేది ఓ ప్రోటీన్. ఇది మన హృదయం ఒత్తిడికి లోనయినప్పుడు లేకపోతే దెబ్బతిన్నప్పుడు రక్తం నుంచి ఇది విడుదల అవుతుంది. దీని ప్రకారం ట్రోపోనాన్ పరీక్ష చేసిన తర్వాత.. అందులో పాజిటివ్ అని వస్తే వారికి గుండె జబ్బులు వచ్చే మూడేళ్లలో ప్రమాదం ఉంటుందని కనుగొన్నారు. అయితే ఇలా పరీక్షించిన వారిలో సుమారు 35 శాతం మంది ఇలాంటి మరణ ప్రమాదాన్ని ఎదుర్కొన్నట్లు గుర్తించారు.

ఇలాంటి పరీక్ష లతో మాత్రమే కాకుండా సరైన సమయానికి వ్యాధికి సంబంధించిన మందులు వాడితే వాటి నుంచి గుండె జబ్బు నుంచి దూరంగా ఉండవచ్చని తెలిపారు. అందుకుగాను వీలైనంత వరకు వైద్యుల పర్యవేక్షణ ఎప్పటికప్పుడు వారు సూచించిన మందులు వాడటం తో పాటు వారు చెప్పిన విధంగా జీవన శైలిని మార్చుకోవాలని చెప్తున్నారు.

గుండె పోటుకు సంబంధించిన కొన్ని కీలక లక్షణాలను అమెరికాలో సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అనే సంస్థ గుర్తించింది. అందులో ముఖ్యంగా గుండె పోటును ముందుగా ఈ లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. గుండె పోటు వచ్చేటప్పుడు ముందు ఛాతీ నొప్పి అనిపిస్తుందని కనుగొన్నారు. అంతేగాకుండా అదే సమయంలో శరీరం చాలా అసౌకర్యంగా ఉన్నట్లు అనిపిస్తుందని చెప్పారు. భుజం లాగేసినట్లు ఉంటుందని పేర్కొన్నారు. ఇలాంటి వాటిని గుర్తిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.

ఇటీవల ఆంధ్రప్రదేశ్ కు చెందిన మేకపాటి గౌతమ్ రెడ్డి అనే మంత్రి కూడా గుండెపోటు కారణంగా చనిపోయారు. నిత్యం వ్యాయామం చేసే వారైనప్పటికీ... సడన్ గా వచ్చిన గుండె నొప్పిని ఎదుర్కొలేక మరణించారు.