Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో ఒకరోజు.. నాలుగు హత్యలు

By:  Tupaki Desk   |   6 Jun 2020 5:15 AM GMT
హైదరాబాద్ లో ఒకరోజు.. నాలుగు హత్యలు
X
లాక్ డౌన్ వేళ.. నేరాలు.. ఘోరాలకు పడిన బ్రేక్.. సడలింపులకు తగ్గట్లే క్రైం రేట్ అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన వారంలో హైదరాబాద్ మహానగరంలో పది హత్యలు జరిగితే.. శుక్రవారం ఒక్కరోజులోనే నాలుగు హత్యలు జరగటం గమనార్హం. ఈ నాలుగింటిలో శుక్రవారం అర్థరాత్రి సమయంలో జరిగిన డబుల్ మర్డర్ మరింత సంచలనంగా మారింది. ఆందోళన కలిగించే అంశం ఏమంటే.. ఈ హత్యల్లోచాలావరకు నమ్మించి చంపేసిన వైనాలే ఎక్కువ. అదే సమయంలో ఈ హత్యల్లో అత్యధికం ‘మహిళలు’.. ‘ఆర్థిక అంశాల’ చుట్టూనే తిరుగుతున్నాయి.

శుక్రవారం అర్థరాత్రి లంగర్ హౌస్ (గొల్కొండ పోలీస్ స్టేషన్ పరిధి) లో చోటు చేసుకున్న డబుల్ మర్డర్ సంగతే చూస్తే.. ఆర్థిక లావాదేవీల విషయంలో చోటుచేసుకున్న మనస్పర్థలే కారణంగా చెబుతున్నారు. రౌడీషీటర్ మహ్మద్ చాంద్ (52).. అతనితో పాటు హుమాయున్ నగర్ కుచెందిన ఫయాజుద్దీన్ (38)ను వెంటాడి వేటాడి మరి హత్య చేశారు. గొల్కొండ ప్రాంతానికి చెందిన మహ్మద్ అష్రఫ్ తో పాటు మరో ఐదుగురు ఈ దారుణానికి తెగబడినట్లుగా చెబుతున్నారు.

శుక్రవారం తెల్లవారుజామున మెడికల్ రిప్రజెంటిటీవ్ రాహుల్ అగర్వాల్ హత్య జరిగింది. మద్యం తాగించిన స్నేహితులే అతడ్ని హతమార్చారు. లాక్ డౌన్ వేళ.. తన ఇంటికి తరచూ రాకపోకలు సాగించిన మిత్రుడు.. తమ సోదరితో అసభ్యంగా ప్రవర్తించారన్నకారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం సాయంత్రం రెయిన్ బజార్ లో నడిరోడ్డు మీద తల్వార్లతో దాడి చేసి మరీ హతమార్చారు. మొత్తంగా నగరంలొ హత్యలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ హత్యలన్ని హైదరాబాద్ పాతబస్తీ పరిధితో పాటు.. ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లోనే చోటు చేసుకోవటం గమనార్హం.

గడిచిన వారంలో చోటు చేసుకున్న హత్యల్ని చూస్తే.. మే 30న జరిగిన హత్య విషయానికి వస్తే.. పాత కక్షలు కారణమైతే.. అదేరోజు రాత్రి అదనపు కట్నం కోసం కట్టుకున్న భార్యను హతమార్చాడు. మే 31 సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు ఒక వ్యక్తిని హత్య చేసి.. డెడ్ బాడీని తగులబెట్టారు. అదే రోజు అర్థరాత్రి ఒక మహిళ విషయంలో చోటు చేసుకున్న వివాదం హత్యకు దారి తీసింది. ఆ రోజే తన భార్యతో జరిగిన గొడవలో భాగంగా కత్తితో చంపేశాడు. మరో ఉదంతంలోనూ స్నేహితుడే హత్య చేసిన వైనం గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.