Begin typing your search above and press return to search.

సింగర్ మధుప్రియ ఇష్యూలో సినిమాటిక్ మలుపులు

By:  Tupaki Desk   |   13 March 2016 10:15 AM GMT
సింగర్ మధుప్రియ ఇష్యూలో సినిమాటిక్ మలుపులు
X
సింగర్ మధుప్రియ వ్యవహారం ఇప్పుడు అందరికి తెలిసిందే. ఆర్నెల్ల క్రితం తల్లిదండ్రుల్ని కాదని.. వారిని ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్న ఆమె.. తన భర్త శ్రీకాంత్ తనను వేధిస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటం.. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తాను మోసపోయినట్లుగా ఆరోపిస్తూ.. ప్రేమించినా.. పెద్దల అనుమతితోనే పెళ్లి చేసుకోవాలంటూ చెబుతూ స్పృహ తప్పిపోవటం.. ఆమెకు ఆసుపత్రిలో చికిత్స చేయటం తెలిసిందే.

ఇదిలా ఉంటే ఈ ఉదంతానికి సంబంధించి పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. శనివారం మధుప్రియ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వెంటనే ఆమె భర్త శ్రీకాంత్ కు.. మధుప్రియ తల్లిదండ్రుల మధ్య పలు పరిణామాలు చోటు చేసుకోగా.. వీటికి సంబంధించి ఇరు వర్గాల వాదన భిన్నంగా ఉండటం గమనార్హం. తొలుత మధుప్రియ తల్లిదండ్రులు.. బంధువర్గం వాదన చూస్తే..

1. మధుప్రియ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తర్వాత.. ఆమె భర్త శ్రీకాంత్ తన స్నేహితుల్ని వెంట పెట్టుకొని వచ్చి దాడి చేశారు. దారుణంగా వ్యవహరించారు. నానా హంగామా సృష్టించారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తుందా? అంటూ దాడికి పాల్పడ్డారు.

2. అసభ్య పదజాలంతో దూషిస్తూ కొట్టే ప్రయత్నం చేశారంటూ మధుప్రియ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

భర్త శ్రీకాంత్ చేస్తున్న వాదన

1. తనపై శనివారం అర్థరాత్రి దాడి జరిగిందని పేర్కొన్నారు. తలకు.. ముక్కుకు.. చేతి వేళ్లకు గాయాలు కావటం.. అనంతరం యశోద ఆసుపత్రిలో చికిత్స పొందటం జరిగింది.

2. తనను మదుప్రియ బంధువులు దాడి చేశారు. మధుప్రియతో మాట్లాడి ఇంటికి తీసుకొద్దామని.. ఆమె బావకు ఫోన్ చేశాను. ఇంటికి వస్తే మాట్లాడదామని చెప్పారు.

3. సరేనని చెప్పి బైక్ మీద ఇంటికి వెళ్లాను. ఇంట్లోకి అడుగు పెట్టిన వెంటనే కర్రతో దాడి చేశారు. తలపై గాయాలయ్యాయి.

4. దీన్ని చూసిన ఫ్రెండ్ బైక్ తీసుకొని వస్తే.. ఇంట్లో నుంచి బయటకు వచ్చేశా. మధుప్రియే నన్ను శారీరకంగా.. మానసికంగా వేధించింది.

ఇదిలా ఉంటే.. ఆసుపత్రికి వెళ్లిన శ్రీకాంత్ చికిత్స చేయించుకున్నాడు. యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మధ్యలోనే వెళ్లిపోయినట్లుగా ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు.. కొన్ని ఛానల్ కార్యాలయానికి వెళ్లిన శ్రీకాంత్ తనకు ప్రాణహాని ఉందని.. తనను రక్షించాలని.. మధుప్రియ తరఫు వారు భౌతికదాడికి పాల్పడ్డారని ఆరోపించి.. తనకు సాయం చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఇరు వర్గాల వారిని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. ఏమైనా.. ప్రేమ.. పెళ్లి లాంటి విషయాల్లో తొందరపాటు ఒకటైతే.. మనస్పర్థలు వచ్చిన తర్వాత శాంతియుతంగా పరిష్కరించుకోవాల్సింది పోయి..దాడులకు దిగటం ఏమిటో..?