Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబును హెచ్చ‌రించిన సింగ‌పూర్

By:  Tupaki Desk   |   24 Sep 2015 7:30 AM GMT
చంద్ర‌బాబును హెచ్చ‌రించిన సింగ‌పూర్
X
తెలుగుదేశం అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు తీరు ప‌ట్ల సింగ‌పూర్ ప్ర‌భుత్వం అభ్యంత‌రం చెప్పిందా? బాబు తీరును స‌రిదిద్దుకోవాలంటూ ఆ దేశ‌ప్ర‌తినిధులు స్ప‌ష్టంచేశారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని నిర్మాణంలో భాగ‌స్వామ్యం అవుతున్న సింగ‌పూర్ ప్ర‌భుత్వం బాబు స‌ర్కారు అవ‌లంభిస్తున్న విధానాల‌ను మార్చుకోవాలంటూ సూచించిన‌ట్లుగా స‌మాచారం.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం రాజ‌ధాని నిర్మాణం, ఆ ప‌రిస‌ర ప్రాంతాల సుంద‌రీకర‌ణ‌, త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే రాజ‌ధాని శంఖుస్థాప‌న కోసం దాదాపు 30 మంది క‌న్స‌ల్ టెంట్ ల‌ను నియ‌మించింది. దీంతో పాటు గ‌తంలో ఉన్న విజ‌య‌వాడ‌-గుంటూరు-మంగ‌ళ‌గిరి-తెనాలి అర్బ‌న్ డెవ‌ల‌ప్‌ మెంట్ అథారిటీని ర‌ద్దుచేస్తూ ప్ర‌స్తుత అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్లు రూపొందించిన కాపిట‌ల్ రీజియ‌న్ డెవ‌ల‌ప్‌ మెంట్ అథారిటీ(సీఆర్‌ డీఏ)లోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొని ఉంది. సీఆర్‌ డీఏకు 800 పోస్టులు మంజూరు చేసిన‌ప్ప‌టికీ ఇప్ప‌టికీ అతి త‌క్కువ పోస్టులు భ‌ర్తీ అయ్యాయి. మ‌రోవైపు డిప్యూటేష‌న్‌ పై వ‌చ్చిన కొద్దిమంది సిబ్బంది మాత్ర‌మే ఉన్నారు. ఇలా శాశ్వ‌త సిబ్బంది లేకుండా సీఆర్‌ డీఏ బొటాబొటిగా న‌డుస్తోంది.

ఈ నేప‌థ్యంలో అమ‌రావ‌తి మాస్ట‌ర్‌ ప్లాన్ నిర్మాణం కోసం స‌హ‌క‌రిస్తున్న సింగ‌పూర్ బృందం వీట‌న్నింటిపై బాబు వ‌ద్ద అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం. రాజ‌ధాని నిర్మాణం అనేది సుదీర్ఘంగా సాగే ప్ర‌క్రియ అని, దీంతోపాటు కీల‌క‌, ర‌హ‌స్య స‌మాచారం ఉంటున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వ సిబ్బందిలేకుండా అన్ని ప్రైవేటు వ్య‌క్తుల ద్వారా చేయ‌డం స‌రికాద‌ని వారు బాబుకు సూచించ‌న‌ట్లుగా తెలుస్తోంది. అయితే చంద్ర‌బాబు ప్ర‌భుత్వం మాత్రం ప్రైవేటుకే పెద్ద‌పీట వేస్తోంది. అక్టోబ‌రు 22న జ‌ర‌గ‌నున్న శంఖుస్తాప‌న కార్య‌క్ర‌మానికి సంబంధించిన పైలాన్ నిర్మాణాన్ని సైతం ప్రైవేటు కంపెనీల‌కు అప్ప‌గించిన‌ట్లు స‌మాచారం. క‌న్స‌ల్ టెంట్ ల‌తో పాటు భారీస్థాయిలో ఇప్ప‌టికే ప్రైవేటు సంస్థ‌లు రాజ‌ధాని నిర్మాణం పురోగ‌తిలో భాగ‌స్వామ్యం అవుతున్నాయి. మొత్తంగా క‌న్స‌ల్ టెంట్ ల‌కు పెద్ద‌పీట వేస్తున్న బాబు ఆలోచ‌న పునః స‌మీక్షించుకోవాల్సిన అవ‌స‌రం ఉందేమో.