Begin typing your search above and press return to search.

రాజధాని నిర్మాణం మరింత ఆలస్యం

By:  Tupaki Desk   |   26 Dec 2015 11:34 AM GMT
రాజధాని నిర్మాణం మరింత ఆలస్యం
X
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం మరింత ఆలస్యం కానుందా? నిర్మాణం ప్రారంభించడానికే మరో ఆరు నెలలు సమయం తీసుకోనున్నారా? అత్యంత విశ్వసనీయ వర్గాలు ఇదే చెబుతున్నాయి.

అమరావతి నిర్మాణానికి సింగపూర్ కంపెనీలు రకరకాల షరతులు విధిస్తున్నాయి. సింగపూర్ ముందుకు వస్తే తప్పితే జపాన్ కంపెనీలు ముందుకు అడుగులు వేసే అవకాశం లేదు. మరోపక్క, సింగపూర్ కంపెనీలు అమరావతిలో పెట్టుబడులు పెట్టాలంటే ముందుగా ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఇందుకు భారీగా నిధులు కావాలి. ఈ నేపథ్యంలోనే అమరావతి కార్యకలాపాలను హడావుడి ఏమాత్రం లేకుండా నెమ్మదిగా చేపట్టాలని చంద్రబాబు భావిస్తున్నారని చెబుతున్నారు.

అమరావతి నిర్మాణంపై నిన్న మొన్నటి వరకూ తీవ్రస్థాయిలో ప్రచారం చేసిన చంద్రబాబు.. కొద్ది రోజుల కిందట అమరావతికి సంబంధించి హడావుడి చేయవద్దని, చేసే దాని గురించి ఎక్కువ చెప్పవద్దని మంత్రులు, అధికారులకు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఆయన ప్రకటన ఇందులో భాగమేనని అంటున్నారు.

అమరావతి మాస్టర్ ప్లాన్ ను శనివారం విడుదల చేయనున్నారు. మాస్టర్ ప్లాన్ను విడుదల చేసిన తర్వాత ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఇందుక నెల రోజుల సమయం తీసుకుంటారు. అనంతరం జనవరి 26వ తేదీన తుది మాస్టర్ ప్లాన్ ను విడుదల చేస్తారు. ఆ తర్వాత జనవరి 30వ తేదీన రైతులకు ప్లాట్లను కేటాయించాలని భావిస్తున్నారు. వాస్తవానికి, రైతులకు ప్లాట్లను ఇచ్చినా అది భూమి మీద ఎక్కడా ఉండవు. కేవలం కాగితాల్లోనే ఉంటాయి. ఫలానా ఫేజు లో ఫలానా రైతుకు ఇన్ని గజాల భూమి అని మాత్రమే ఉంటుంది. రైతు చేతికి భూమి వచ్చేసరికి మరో ఆరు నెలలు పడుతుందని భావిస్తున్నారు. ఇక డిజైన్ల పేరిట ఏడాది నుంచి అంతకుపైగానే జాప్యం చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తోందని చెబుతున్నారు. మొత్తంమీద సింగపూర్ దిగి వచ్చే వరకు లేదా డబ్బులు సమకూరే వరకూ డిజైన్లు, తదితరాల పేరిట జాప్యం చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది.