Begin typing your search above and press return to search.

మా దేశం విడిచిపోండి.. ఆ దేశ అధ్య‌క్షుడికి సింగ‌పూర్ షాక్!

By:  Tupaki Desk   |   18 July 2022 10:30 AM GMT
మా దేశం విడిచిపోండి.. ఆ దేశ అధ్య‌క్షుడికి సింగ‌పూర్ షాక్!
X
రుణాల పెనుభారం, అడుగంటిన ఆర్థిక నిల్వ‌లు, విదేశీ మార‌క ద్ర‌వ్యం కొర‌త ఇలా అల్ల‌క‌ల్లోల‌మై ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక చిక్కుకున్న సంగ‌తి తెలిసిందే. గ‌త నాలుగు నెల‌లుగా అక్క‌డ ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. నిత్యావ‌స‌ర వ‌స్తువులు, మందులు, చ‌మురుకు తీవ్ర కొర‌త ఉంది. పెట్రోలు, డీజిల్ లీట‌ర్ ధ‌ర రూ.500 పైన ప‌లుకుతున్నాయి. గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర రూ.5500 కు చేరుకుంది. కిలో క్యారెట్ రూ.500 ప‌లుకుతోంది. మిగతా కూర‌గాయలు, ఉల్లిపాయలు కిలో 200 రూపాయ‌ల‌పైనే ఉన్నాయి.

ఈ నేప‌థ్యంలో నిర‌స‌న‌కారులు శ్రీలంక‌ దేశాధ్య‌క్షుడిన భ‌వ‌నాన్ని ముట్ట‌డించ‌డంతో దేశం వ‌దిలి మాజీ అధ్య‌క్షుడు గొట‌బాయ రాజ‌ప‌క్ష మాల్దీవుల‌కు పారిపోయిన సంగ‌తి తెలిసిందే. మాల్దీవుల్లో నిర‌స‌న‌లు రేగ‌డంతో ఆయ‌న అక్క‌డ నుంచి సింగ‌పూర్ కు ప‌లాయ‌నం చిత్త‌గించాడు. అక్క‌డ నుంచే దేశాధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. దీంతో తాత్కాలిక అధ్యక్షుడిగా ర‌ణిల్ విక్ర‌మ్ సింఘే బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

అయితే ఇప్పుడు గొట‌బాయ రాజ‌ప‌క్ష‌ను దేశం విడిచిపోవాల‌ని సింగ‌పూర్ కూడా కోరుకుంటోంది. ఆయన తమ దేశంలో ఉండేందుకు గడువును పొడిగించలేమని ఆ దేశ అధికారులు గొటబాయకు తేల్చిచెప్పినట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

జూలై 14న ఆయ‌న భార్య‌తో క‌లిసి సింగపూర్ చేరుకున్నారు. ఆ దేశంలో దిగే సమయానికి ఆయన అధ్యక్ష పదవికి రాజీనామా చేయలేదు. ఆయన అధ్యక్ష హోదాలో వ్యక్తిగత పర్యటనకు వచ్చారని అప్పుడు సింగపూర్ ప్రభుత్వం చెప్పింది. ఆ త‌ర్వాత అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో గొట‌బాయ మరికొన్ని రోజులు తమ దేశంలో ఉండేందుకు సింగ‌పూర్ నిరాకరించినట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ మేర‌కు గొట‌బాయ రాజ‌ప‌క్ష త‌మ‌ ఆశ్రయం కోరలేదని, తాము కూడా ఆయ‌న‌కు ఎలాంటి ఆశ్రయం ఇవ్వలేదని సింగపూర్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

కాగా శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే జూలై 18న మ‌రోసారి దేశంలో అత్యయిక పరిస్థితిని ప్రకటించారు. శాంతి భద్రతల పరిరక్షణ నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయ‌న తెలిపారు. ప్రస్తుతం శ్రీలంక‌ నిత్యావసరాలు అందుబాటులేక అల్లాడుతోంది. దాంతో ప్రజలు తమ నిరసనలు కొనసాగిస్తున్నారు.

మ‌రోవైపు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే నిమిత్తం శ్రీలంక పార్లమెంట్ సమావేశం కానుంది. ఆ నేపథ్యంలోనే ఈ అత్య‌వ‌స‌ర‌ పరిస్థితి విధించినట్లు శ్రీలంక అధికార వ‌ర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు అంత‌ర్జాతీయ ద్ర‌వ్య‌నిధి సంస్థ (ఐఎంఎఫ్‌)తో శ్రీలంక చర్చలు జరుపుతోంది.