Begin typing your search above and press return to search.

సింగపూర్ కు ఇది సవాలే...

By:  Tupaki Desk   |   27 July 2015 3:00 PM GMT
సింగపూర్ కు ఇది సవాలే...
X
ఆగ్నేయాసియా దేశాలు ఆర్థికాభివృద్ధిలో పరుగులు తీస్తున్నాయి... వందల ఏళ్ల కిందటే అభివృద్ధి చెందిన దేశాలైన బ్రిటన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్సు వంటి దేశాలను వెనక్కు నెట్టేసి సింగపూర్ దూసుకెళ్తోంది. ప్రపంచంలో వ్యాపారం చేయడానికి అత్యంత అనుకూలమైన దేశాల్లో సింగపూర్ దే అగ్రస్థానం.. తక్కువ కాలంలోనే అలాంటి అత్యున్నత స్థానానికి చేరిన సింగపూర్ ఎన్ని ప్రణాళికలు రచించిందో... ఎన్ని వ్యూహాలు అమలు చేసిందో... ఎంత అనుభవాన్ని రంగరించిందో.. ఎన్ని కష్టాలు పడిందో ఊహించుకోవచ్చు. అలాంటి సింగపూర్ తనకంటే పదింతలు పెద్దదైన.... తనకంటే పది రెట్లు అత్యాధునికమైన... ఒక్కమాటలో చెప్పాలంటే తననే తలదన్నేలాంటి నగరాన్ని నిర్మించబోతోంది.. ఆ నగరం నిర్మిస్తున్నది సింగపూర్ లో కాదు... ఆంధ్రప్రదేశ్ లో. అదే... ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతీ నగరం. అమరావతిని సింగపూర్ నిర్మిస్తున్న విషయం అందరికీ తెలిసిందే కానీ సింగపూర్ కంటే అమరావతి ఎంత గొప్పది కానుందన్నదే ఇప్పుడు అందరికీ ఆసక్తికరంగా మారింది. అంతేకాదు... తన కంటే పదిరెట్ల పెద్దదైన నగరాన్ని నిర్మించడానికి సింగపూర్ ఎందుకు సాహసిస్తోందన్నదీ ప్రశ్నే.. భారత్ లో పరిస్థితులు... అవినీతి... రాజకీయ సమస్యలు వంటివన్నీ తెలిసికూడా సింగపూర్ ఇందులోకి ఎందుకు దిగిందన్నది చర్చనీయాంశమవుతోంది. వీటన్నిటికీ సమాధానం ఒక్కటే... అమరావతి నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చంద్రబాబుల సత్తాయే కాదు సింగపూర్ సత్తా కూడా ప్రపంచానికి తెలుస్తుంది. ప్రతిష్ఠాత్మకమైన అమరావతి నిర్మాణంతో సింగపూర్ కూడా ప్రపంచవ్యాప్తంగా తన పరిధి విస్తరించాలనుకుంటోంది.

సింగపూర్ చాలా చిన్నదేశం... దాని విస్తీర్ణం 716 చదరపు కిలోమీటర్లు.. కానీ ఆ సింగపూర్ నిర్మిస్తున్న అమరావతి దానికంటే పది రెట్లు పెద్దది. 7235 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అమరావతిది. ఇంతభారీ ప్రాజెక్టు కావడం.. ఏపీలో రాజకీయాలంటే అవినీతిమయం అన్న ముద్ర ఉండడం... ఇక్కడి గత పాలకుల అవినీతి... రాజకీయ కుట్రలు, కువిమర్శల నేపథ్యంలో రాజధాని నిర్మాణం ఇంకా మొదలుకాకముందే విమర్శలు మొదలైపోయాయి. సింగపూర్ కు సొమ్మంతా దోచిపెడుతున్నారంటూ ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే.. ఇక్కడ ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. సింగపూర్ అభివృద్ధి చెందిన దేశంగా ఎంత ఉన్నత స్థాయిలో ఉందో... అవినీతి రహిత దేశంగానూ ప్రపంచంలో అంతేగుర్తింపు పొందింది. ప్రపంచంలో అవినీతి రహిత దేశాల్లో సింగపూర్ ది 7వ స్థానం. అక్కడ అవినీతి చాలా తక్కువ. అదేసమయంలో భారత్ స్థానం 85... ఈ లెక్కన అంతర్జాతీయంగా తనకు ఎంతో పేరు తేనున్న ఈ ప్రాజెక్టు విషయంలో సింగపూర్ అవినీతికి పాల్పడి తనకున్న క్లీన్ ఇమేజ్ పోగొట్టుకునే అవకాశమే కనిపించడం లేదు. అంతేకాదు.. ఇండియాలో అవినీతిని ఎదుర్కొని ఈ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తిచేయాలన్న లక్ష్యం సింగపూర్ లో కనిపిస్తోంది.

భారత్ , ఆంధ్రప్రదేశ్ ల్లో కాంట్రాక్టు పనులంటే అవినీతికి చిరునామాలు... అధికారులకు, నాయకులకు ముడుపులు చెల్లించి తాము కొంత మిగుల్చుకుని కాంట్రాక్టర్లు తూతూమంత్రంగా పనులు చేస్తారు.. అవి కొద్ది రోజులకే పాడయిపోతాయి. రోడ్లు, డ్యామ్ లు, ఇలా ప్రతి ప్రాజెక్టుల్లోనూ అవినీతి సర్వ సాధారణం. సింగపూర్ ఇప్పుడు ఏపీలో ఇలాంటి ఉచ్చులో పడకుండా.. ఈ మకిలి అంటించుకోకుండా నాణ్యమైన అమరావతిని నిర్మించడం సవాలే అంటున్నారు. అయితే... ఇండియాలో ఎదురయ్యే ఇన్నిసవాళ్లను ఎదుర్కొని అమరావతిని నిర్మించి ఇచ్చి ప్రపంచంలో తన బ్రాండ్ ఇమేజ్, అంతర్జాతీయంగా తన వ్యాపార విస్తృతిని పెంచుకోవడం సింగపూర్ లక్ష్యమని... అందుకే అది ఇంత రిస్కు చేస్తోందని 'ది గార్డియన్' వంటి పత్రికలు కథనాలు రాశాయి.

సింగపూర్ ప్రణాళికలు, ఆలోచనలు, వ్యూహాలు, అనుభవం, అవినీతి రాహిత్యం అన్నీ కలగలిసి అమరావతిని కూడా తనలా ప్రపంచంలోనే ప్రముఖ నగరంగా మార్చుతుందనడంలో సందేహంలేదు. ఒక అమరావతిని పది సింగపూర్లకు సమానంగా నిలుపుతుందన్న నమ్మకం చాలామందిలో వ్యక్తమవుతోంది.