Begin typing your search above and press return to search.

వియన్నాలో ఉగ్రదాడి ... పలుచోట్ల కాల్పులు !

By:  Tupaki Desk   |   3 Nov 2020 6:30 AM GMT
వియన్నాలో ఉగ్రదాడి ... పలుచోట్ల కాల్పులు !
X
ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఆరు చోట్ల దుండగులు తుపాకులతో కాల్పులకు ఎగబడ్డారు. ఈ కాల్పులలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారని, మరికొందరు గాయపడ్డారని వియన్నా పోలీసులు తెలిపారు. దుండగులు ఒకేసారి ఏకకాలంలో పలు ప్రాంతాల్లో కాల్పులు జరిపారు. దీనితో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఈ కాల్పుల్లో 15 మంది గాయపడ్డారని, వారిలో ఏడుగురు ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు నగర మేయర్ తెలిపారు. గాయపడినవారిలో ఒక పోలీస్ అధికారి కూడా ఉన్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి. వియన్నాలోని యూదుల ప్రధాన ప్రార్థనా స్థలం సమీపంలో ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. దుండగులు ఈ ప్రార్థన మందిరాన్నే లక్ష్యంగా చేసుకున్నారా లేదా అనేది స్పష్టంగా తెలియలేదు.

హిల్టన్ హోటల్‌లో టూరిస్టులను బందీలుగా చేసుకున్న టెర్రరిస్ట్‌లు.. మరికొన్ని ప్రాంతాల్లోనూ కాల్పులకు తెగబడినట్టు సమాచారం. విషయం తెలుసుకున్న ఆస్ట్రియా ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆర్మీని రంగంలోకి దించింది. వియన్నా నగరం అంతటా హై అలర్ట్ కొనసాగుతోంది. ప్రజా రవాణా వ్యవస్థను నిలిపివేసి రాజధానిని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.పెరుగుతున్న కరోనాకేసులను కట్టడి చెయ్యడానికి ఆస్ట్రియాలో దేశవ్యాప్తంగా విధించిన కొత్త ఆంక్షలు అమలు కావడానికి కొన్ని గంటలముందు ఈ కాల్పులు జరిగాయి. బార్లు, రెస్టారెంట్లు నవంబర్ చివరివరకూ మూసివెయ్యాలని కొత్త నిబంధనలు విధించారు.

ఆస్ట్రియాకు పొరుగు దేశమైన చెక్ రిపబ్లిక్ సరిహద్దుల్లో కూడా రక్షణ సిబ్బంది అప్రమత్తమైనట్లు, అనుమానాస్పద ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పలువురు ఐరోపా నాయకులు ఈ దాడిని ఖండించారు. బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఈ దాడి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ స్పందిస్తూ..ఫ్రాన్స్‌లో దాడుల తరువాత మరొక ఐరోపా దేశమైన ఆస్ట్రియాలో దాడులు జరగడం విచారకరం. ఈ దాడులను ఐరోపా సంఘాలు సంఘటితంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. యూకే హోం సెక్రటరీ ప్రీతి పటేల్ ఎలాంటి సహయానికైనా మేము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.