అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అక్కడి ఐటీ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఏడు దేశాల నుంచి అమెరికాకు వచ్చే వారిని ‘తీవ్రమైన వడపోత’కు గురిచెయ్యాలని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చారు. ఉత్తర్వులు ఇలా ఇచ్చారో లేదో, అలా అమలులోకి వచ్చేసింది. అమెరికాకు బయిలుదేరిన వారి మీదా, మార్గ మధ్యమంలో వున్న వారి మీద కూడా ఈ వేటు పడిపోయింది. ట్రంప్ దెబ్బకు విలవిలలాడివారు 375 మంది వరకూ వున్నారు. అందులో 81 మందిని అనేక రకాలుగా ప్రశ్నించి, పరీక్షించి వదలిపెట్టారు. మిగిలిన వారినయితే దారిలో ఎక్కడ ఎక్కడ ఏయే విమానాశ్రాయాల్లో వున్నారో అక్కడ నుంచి తమ స్వదేశాలకు పొమ్మన్నారు. అయితే అమెరికా పౌరహక్కుల సంఘం(ఎసిఎల్ యూ) ఫెడరల్ కోర్టు నాశ్రయించింది. ఇలా వెనక్కి తరలించే కార్యక్రమాన్ని వెంటనే నిలిపి వేస్తూ తీర్పు చెప్పింది. అయితే ఈ ‘స్టే’ కేవలం ఎక్కడికక్కడ నిలిచిపోయిన వారు గమ్యస్థానం (అమెరికా) చేరటం వరకూ అనుమ తించటానికి మాత్రమే పరిమిత మవుతుంది.
ముస్లింలు మెజారిటీగా వున్న ఏడు దేశాల ( సిరియా - యెమెన్ - సుడాన్ - సోమాలియా - ఇరాక్ - ఇరాన్ - లిబియా) నుంచి వలస వచ్చి అమెరికాలో ఉద్యోగాలు చేసే వారి మీద ట్రంప్ వేటు వేశారు. దీంతో ఐటీ పరిశ్రమకు చెందిన సీఈవోలూ - ఇతర స్వంత దేశపు పారిశ్రామిక వేత్తలు అప్పుడే గగ్గోలు పెట్టటం మొదలు పెట్టారు. గూగుల్ సీయీవో సుందర్ పిచాయ్ తన ఆందోళనను వ్యక్తం చేశారు. తన ముఖ్య సిబ్బందిలో 187 మంది ఈ ఏడు దేశాలకు చెందిన వారున్నారు. వారికి జరిగే వ్యక్తిగత నష్టం గురించి ఆయన మనస్తాపం చెందారు. సిలికాన్ వ్యాలీలో పనిచేసే వారిలో అత్యధికులు ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారే. పిచాయ్ ఇండియాలో జన్మించి ప్రతిష్టాత్మకమైన గూగుల్ సీఈవో కాగలిగారు. భవిష్యతులో ఈప్రభావం అమెరికాకు వచ్చే భారతీయుల మీద కూడా పడే అవకాశం వుందని ఆందోళన వ్యక్తం చేశారు కూడా.
ఇంత కన్నా తీవ్ర స్థాయిలో ఫేస్ బుక్ సీఈవో - మార్క్ జుకర్ బెర్గ్ తన ఆందోళనను వ్యక్తం చేశారు. తన తాతలు అమ్మమ్మలూ జర్మనీ - ఆస్ట్రియా - పోలండ్ నుంచి వచ్చిన వారేనని, అలాగే తన జీవిత భాగస్వామి పూర్వికులు కూడా ఇతర దేశాలనుంచి వచ్చిన వారే నని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇలా ఇతర దేశాలవారిని రానివ్వకపోతే భవిష్యత్తులో అమెరిక నష్టపోతుందని ఆయన హెచ్చరిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/