Begin typing your search above and press return to search.

అమరీందర్ కు సిద్ధూ షాక్

By:  Tupaki Desk   |   22 July 2021 7:04 AM GMT
అమరీందర్ కు సిద్ధూ షాక్
X
కొత్తగా పంజాబ్ పీసీసీ అధ్యక్షునిగా నియమితుడైన నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ ముఖ్యమంత్రి అమరీందర్ కు పెద్ద షాకే ఇచ్చారు. శుక్రవారం బాధ్యతలు తీసుకోబోతున్న సిద్ధూ తన ఇంట్లో మద్దతుదారులతో సమావేశం నిర్వహించారు. ఆశ్చర్యకరంగా ఈ సమావేశానికి 62 మంది ఎంఎల్ఏలు హాజరయ్యారు. నిన్నటివరకు సిద్ధూ పీసీసీ అధ్యక్షుడు కాకుండా అమరీందతర్ శతవిధాల ప్రయత్నాలు చేసిన విషయం అందరికీ తెలిసిందే.

తనతో పాటు తన మద్దతుదారులందరు సిద్ధూని వ్యతిరేకించేట్లుగా అమరీందర్ అనేక వ్యూహాలు పన్నారు. అయితే వీటన్నింటినీ అధిష్టానం పక్కనపెట్టేసి సిద్ధూని ప్రకటించేసింది. అధిష్టానం మనసులో ఏముందో అమరీందర్ మద్దతుదారులు కూడా గ్రహించినట్లున్నారు. అందుకనే అమరీందర్ ను వదిలిపెట్టేసి సిద్దూ క్యాంపులోకి దూకేశారు. సిద్ధూ నిర్వహించిన సమావేశానికి వచ్చిన వారిలో మంత్రులు కూడా ఉన్నారు.

ఇక్కడ ప్రధానమైన సమస్య ఏమిటంటే వచ్చే ఏడాది మార్చిలో జరగబోయే షెడ్యూల్ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు. ఇటు అమరీందర్ అటు సిద్ధూ వర్గాల్లో టికెట్ల కేటాయింపులపై ఎవరిది పై చెయ్యి అవుతుందనేదే ప్రధాన సమస్య. అందరి అభ్యంతరాలను పక్కనపెట్టేసి సిద్ధూకి పార్టీ పగ్గాలు అప్పగించేయటంతోనే అధిష్టానం ఆలోచనలు ఏమిటో అర్ధమైపోతోంది. అందుకనే అమరీందర్ మద్దతుదారుల్లో చాలామంది సిద్ధూ క్యాంపులోకి దూకేశారు.

స్వర్ణదేవాలయం, దుర్గియానా మందిర్, రాం తీర్ధ యాత్రలో మద్దతుదారులతో కలిసి సిద్ధూ పూజలు చేశారు. అమరీందర్ వర్గంలోనే ఉంటే టికెట్లు వచ్చేది అనుమానమే అనుకుని చాలామంది సిద్ధూవర్గంలో చేరిపోయినట్లు అర్ధమవుతోంది. మరి వీరందరికీ సిద్ధూ టికెట్లు ఇప్పించుకోగలరా ? అన్నదే సందేహంగా మారింది. ఏదేమైనా పార్టీలో ఎన్నికలకు ముందే అమరీందర్ మైనారిటిలో పడిపోయారన్నది వాస్తవం.

సిద్ధూ కి పరిమితులు

కాంగ్రెస్ సిద్ధూ ను ఎంచుకోవడానికి ఆప్‌కు ఎదురునిలవగలిగిన వ్యక్తి అని భావించడమే. కెప్టెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అధికార వ్యతిరేక వర్గాన్ని తగ్గించడంలో సిద్ధు విజయం సాధిస్తాడనే ఆశ కూడా ఉంది. సిద్దూ క్లీన్ ఇమేజ్ ఉంది. రాజకీయ నాయకుడిగా, అమరీందర్ సింగ్ చాలా ఆరోపణలు ఎదుర్కొన్నాడు.

ప్రఖ్యాత క్రికెటర్, మీడియాకి బాగా తెలిసిన వ్యక్తిగా, శక్తివంతమైన వక్తగా అతనికి ప్రజల్లో ఇమేజ్ ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో క్రౌడ్ పుల్లర్‌ అవసరం కూడా ఉంది. పంజాబ్ కాంగ్రెస్ లో అందులో కింగ్ సిద్ధుయే.

అయితే, ఇక్కడో విషయం గమనించాలి. సిద్ధుకు కొన్ని పరిమితులున్నాయి. పరిపాలన విషయాలలో సిద్ధుకు ఎటువంటి అనుభవం లేదు. కేడర్ తోకనెక్షన్ లేదు. అభిమానుల్లో ఓటర్లు ఉంటారు. కానీ కేడర్ తో ఎలా ఉండాలన్న చతురత సిద్ధకు కత్తిమీద సాము.

రాబోయే నెలల్లో, ఇద్దరు నాయకులు ఒకరినొకరు అణగదొక్కడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు, ముఖ్యంగా టికెట్ పంపిణీ సమయంలో గాంధీ కుటుంబం సిద్దూతో కలిసి ఉండటం సిద్ధు బలం. రాజకీయ వ్యూహ అనుభవం అమరీందర్ బలం. ఏది ఏమైనా కాంగ్రెస్ అమరీందర్ ను అంత సలువుగా కాదనుకోలేదు.