Begin typing your search above and press return to search.

ఫైజర్ వ్యాక్సిన్ తో అదిరే సైడ్ ఎఫెక్ట్?

By:  Tupaki Desk   |   12 Nov 2020 6:29 PM GMT
ఫైజర్ వ్యాక్సిన్ తో అదిరే సైడ్ ఎఫెక్ట్?
X
ఒకఅడుగు ముందుకు పడితే రెండు అడుగులు వెనక్కి పడుతున్న చందంగా ఉంది కరోనా వ్యాక్సిన్ తయారీ వ్యవహారం. ఊరించే వార్తలు వచ్చిన రెండు..మూడు రోజులకే సదరు వ్యాక్సిన్ కు సంబంధించి ఊసురుమనిపించే నిజాలు బయటకు వస్తున్నాయి. తాజాగా అలాంటి పరిస్థితే ప్రఖ్యాత ఫైజర్ - బయోఎన్ టెక్ ప్రకటన లో ఉంది. మూడు రోజుల క్రితం ఈ కంపెనీ తమ వ్యాక్సిన్ పరిశోధన ఒక కొలిక్కి వచ్చిందని.. 90 వాతం విజయం సాధించినట్లుగా పేర్కొన్నారు.

ఈ ప్రకటన వచ్చినంతనే ప్రపంచం కాస్త ఊపిరిపీల్చుకుంది. వ్యాక్సిన్ వచ్చేసే మంచి రోజు దగ్గరకు వచ్చినట్లేనని అందరూ భావించారు. అయితే.. తాజాగా ఈ వ్యాక్సిన్ కు సంబంధించి దిమ్మ తిరిగే వాస్తవం ఒకటి బయటకు వచ్చింది. సాధారణంగా ఏదైనా వ్యాక్సిన్ వేసుకున్నంతనే జ్వరం.. నొప్పులు రావటం మామూలే. ఫైజర్ రూపొందించిన వ్యాక్సిన్ తీసుకున్న వారికి నొప్పితోపాటు తలనొప్పి.. తీవ్రమైన హ్యాంగోవర్ గా అనిపించిందని.. వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్లు చెప్పినట్లుగా ది ఇండిపెండెంట్ పత్రిక వెల్లడించింది.

ఫైజర్ తయారు చేసిన వ్యాక్సిన్ ను దాదాపు 43 వేలకు పైగా వాలంటీరలకు మూడు దశల్లో వేశారు. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో చాలామంది.. తమకు తలనొప్పి.. జ్వరం..కండరాలనొప్పిలాంటి లక్షణాలు ఎదురైనట్లు చెప్పుకొచ్చారు. తొలి డోస్ తో పోలిస్తే.. రెండో డోస్ లో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపించాయని చెప్పారు. అయితే.. హ్యాంగోవర్ సమస్యను ఎదుర్కొన్న వారు.. కాసేపటికి మామూలు స్థితికి వచ్చేసినట్లుగా చెప్పటం గమనార్హం.

తాజాగా బయటకు వచ్చిన అంశాల మీద ఫైజర్ స్పందించాల్సి ఉంది. అయితే.. దీని ఉత్పత్తికి అనుమతి రావాలంటే.. తుది దశ ప్రయోగాల అనంతరం వాలంటీర్లకు సంబంధించి రెండునెలల పాటు పూర్తి విశ్లేషణ అవసరమవుతుంది. అప్పుడు మాత్రమే దీనికి అనుమతి ఇస్తారు. అయితే.. వాలంటీర్లు పలువురు తాము సైడ్ ఎఫెక్ట్స్ గురించి చెబుతున్న వేళ.. ఫైజర్ దీనిపై ఏం చెబుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.