‘నిద్రాహారాలు మాని కష్టపడ్డాం’ అని కొందరు చెబుతుంటారు. తాము ఎంత కష్టపడి పనిచేశామో చెప్పడానికి ఈ సామెత ఉపయోగపడుతుంది. ‘కంటినిండ నిద్ర.. కడుపు నిండా భోజనం’ ఇదే తమ ఆరోగ్యరహస్యమని మరికొందరు చెబుతుంటారు. అయితే కడుపునిండా భోజనం సంగతి తెలియదు కానీ.. ప్రతి మనిషి కంటి నిండా నిద్ర పోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. కుంభకర్ణుడిలా ఆరునెలలు నిద్రించాల్సిన అవసరం లేదుగానీ.. ప్రతిరోజు నిద్రకు కొంతసమయం మాత్రం తప్పకుండా కేటాయించాలి. నిద్ర మనిషి జీవితంలో ఎంతో ముఖ్యమని డాక్టర్లు అంటున్నారు.
ఉరుకులు, పరుగుల జీవితంలో చాలామంది నిద్రను అస్సలు పట్టించుకోవడం లేదు. చాలా మంది నైట్డ్యూటీల వల్ల నిద్ర పోవడం లేదు. అయితే ప్రతి మనిషికి సరైన నిద్ర ఎంతో అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నిద్రను అలక్ష్యం చేస్త భవిష్యత్లో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. జీవక్రియలు వేగవంతంగా, చురుగ్గా పనిచేయడానికి.. శరీరంలోని అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయడానికి నిద్ర ఎంతో ముఖ్యమని డాక్టర్లు అంటున్నారు.రోజులో ఎన్నిగంటలు నిద్రపోవాలి.. తక్కువ నిద్రపోతే కలిగే దుష్ప్రభావాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆరోగ్యంగా ఉండాలనుకొనే మనిషి ప్రతిరోజు ఎనిమిది గంటలు నిద్రపోవాలని డాక్టర్లు, మన పెద్దవాళ్లు కూడా చెబుతుంటారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా ఈ విషయాన్నే వెల్లడించింది. అయితే ఆరుగంటలకంటే తక్కువ సమయం నిద్రపోవడం.. పదిగంటల కంటే ఎక్కువ సేపు నిద్రపోవడం ఈ రెండు ఆరోగ్యానికి అంతమంచివి కావని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఏ వయసులో ఉన్నవాళ్లు ఎంతసేపు నిద్రపోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. అప్పుడే పుట్టిన పిల్లలు 18 గంటలు నిద్ర నిద్రపోతారు. చిన్న పిల్లలు 11 గంటలు నిద్రించాలి. టీనేజ్ పిల్లలు కచ్చితంగా 10 గంటలు నిద్రపోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
నిద్రలేమితో వచ్చే వ్యాధులివే..!
ప్రస్తుతం చాలా మంది నిద్రను అలక్ష్యం చేస్తున్నారు. వేళకు నిద్రపోకపోకపోతే మధుమేహం, రక్తపోటు, గుండెజబ్బు, గుండె సంబంధిత వ్యాధులు, ఊబకాయం వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. యుక్తవయసులో వరుసగా కొన్ని రాత్రులు నిద్రలేకుండా గడిపితే షుగర్ వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఏడు గంటల కన్నా ఎక్కువ నిద్ర పోయేవారికన్నా, తక్కువ నిద్రపోయేవారికి జలుబు త్వరగా వస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. నిద్రలేమితో ఆకలిని పుట్టించే హార్మోన్ గ్రెలిన్ ఎక్కువగా విడుదలయ్యి ఆకలి ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుందని, కడుపు నిండిందనే భావన కల్పించే హార్మోన్ లెప్టిన్ తక్కువగా విడుదలయ్యి మరింత ఆహారం తినేవిధంగా చేసి ఊబకాయానికి దారితీస్తుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది.
నిద్ర వల్లే కలిగే లాభాలివే..!
ప్రతిరోజూ మెదడులో కొన్ని వ్యర్ధ కణాలు పెరుగుతాయని, నిద్రపోయినప్పుడు అవి తొలగిపోతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. అందుకే సరిపడా నిద్రలేకపోతే ఆ వ్యర్థ కణాలు మెదడులో పేరుకుపోతాయని, ఆ పరిస్థితి అలానే కొనసాగితే మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు. ఎక్కువ నిద్ర దుష్ప్రభావాల గురించి చాలా మందికి తెలియదు. కానీ అతినిద్రతో జ్ఞాపకశక్తి క్షీణించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.