Begin typing your search above and press return to search.

టెన్షన్ లో సిద్దిపేట.. థాయ్ లాండ్ లో లింకేమిటి? అసలేం జరిగింది?

By:  Tupaki Desk   |   19 March 2020 5:00 AM GMT
టెన్షన్ లో సిద్దిపేట.. థాయ్ లాండ్ లో లింకేమిటి? అసలేం జరిగింది?
X
కరోనా వైరస్ మన దగ్గర పుట్టలేదు. అక్కడెక్కడో చైనాలోని వూహాన్ అనే మహా నగరం లో వెలుగు చూసింది. అదెక్కడ? మన సిద్దిపేట ఎక్కడ? సరిహద్దులే కాదు.. రెండు ప్రాంతాల మధ్య భౌతిక దూరం వేలాది కిలోమీటర్లు. కానీ.. డిజిటల్ యుగంలో ప్రపంచం కుగ్రామంగా మారటమే కాదు.. ఒక ప్రాంతానికి చెందిన వారుమరో దేశానికి పర్యటించటం కామన్ గా మారిన వేళ.. కరోనా వ్యాప్తి ప్రపంచాన్ని చుట్టేస్తోంది. తాజాగా ఇదే అంశం సిద్దిపేట పట్టణానికి కొత్త కలవరాన్ని తీసుకొచ్చిందని చెప్పాలి.

ఇటీవల సిద్ధిపేట.. కరీంనగర్.. మంచిర్యాల.. కుమ్రం భీం అసిఫాబాద్ లకు చెందిన 22 మంది థాయ్ లాండ్ కు వెళ్లారు. హైదరాబాద్ లోని రవి ట్రావెల్స్ ద్వారా ఫిబ్రవరి 29న వారు థాయ్ లాండ్ లోని పలు ప్రాంతాల్లో పర్యటించి వచ్చారు. వారంతా ఈ నెల మూడున తిరిగి వచ్చారు. ఎవరికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఇదిలా ఉండగా.. తాజాగా థాయ్ లాండ్ నుంచి టూర్ ఆపరేటర్ కు ఒక ఫోన్ కాల్ కొత్త టెన్షన్ కు కారణమైంది.

సిద్దిపేట తదితర ప్రాంతాల వారు థాయ్ టూర్ కు వెళ్లిన సమయంలో.. వారికి గైడ్ గా చుంగ్ అనే వ్యక్తి వ్యవహరించాడు. అతడికి తాజాగా కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ సమాచారం థాయ్ లాండ్ నుంచి హైదరాబాద్ కు చెందిన ట్రావెల్ ఏజెంట్ రవి కి అందటం తో సదరు యజమాని.. ఆ విషయాన్ని ఒక ప్రముఖ మీడియా సంస్థకు తెలియజేశారు. దీంతో.. ఈ విషయాన్ని వార్తతో పాటు.. మంత్రి హరీశ్ రావుకు తెలియజేయటం తో.. రంగంలోకి దిగిన వారు.. థాయ్ నుంచి వచ్చిన ఆ 22 మందిని గుర్తించే పనిలో పడ్డారు. ఈ ఉదంతం బయటకు రావటం తో సిద్దిపేట వాసులు టెన్షన్ లో పడ్డారు. థాయ్ కు వెళ్లిన టీం లో సిద్ధిపేటకు చెందిన వారు ఎంతమంది? వారిలో అనారోగ్య లక్షణాలు ఏమైనా ఉన్నాయా? వారెంతమందిని కలిశారు? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.