Begin typing your search above and press return to search.

సిద్దిపేట అడ్డా.. ప‌ద‌వుల అడ్డా..!

By:  Tupaki Desk   |   22 Dec 2021 10:33 AM GMT
సిద్దిపేట అడ్డా.. ప‌ద‌వుల అడ్డా..!
X
ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న సిద్దిపేట జిల్లా మ‌రో అరుదైన ఖ్యాతిని ద‌క్కించుకుంది. ఈ జిల్లా నుంచి ప‌లువురు ఆయా ప‌ద‌వుల్లో కొన‌సాగుతుండ‌గా.. తాజాగా మ‌రో ముగ్గురికి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టారు గులాబీ పార్టీ అధినేత‌. దీంతో పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాల‌తో సంబ‌రాలు చేసుకుంటున్నారు. ఒకే జిల్లాకు ఇన్ని ప‌ద‌వులు ద‌క్క‌డంపై పార్టీలో కూడా ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంద‌ట‌.

తెలంగాణ ఉద్య‌మంలో ముందున్న సిద్దిపేట జిల్లా ప‌ద‌వుల ప‌రంగా కూడా పైచేయి సాధించ‌డం పై ప్ర‌జ‌లు హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం చేస్తున్నారు. సిద్దిపేట రూర‌ల్ మండ‌లం చింత‌మ‌డ‌క గ్రామానికి చెందిన కేసీఆర్ గ‌జ్వేల్ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్య‌మంత్రి హోదాలో కొన‌సాగుతున్నారు.

సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న హ‌రీశ్‌ రావు ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ ప‌ద‌వులు నిర్వ‌ర్తిస్తున్నారు. సిద్దిపేట రూర‌ల్ మండ‌లం రావురూకుల‌కు చెందిన ర‌స‌మ‌యి బాల‌కిష‌న్ మాన‌కొండూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ చైర్మ‌న్‌ గా కూడా కొన‌సాగుతున్నారు.

అలాగే.. ముగ్గ‌రు ఎమ్మెల్సీలు ఈ జిల్లా నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. సిద్దిపేట ప‌ట్ట‌ణానికి చెందిన ఫారూఖ్ హుస్సేన్ గ‌వ‌ర్న‌ర్ కోటాలో రెండోసారి ఎమ్మెల్సీగా కొన‌సాగుతున్నారు.

చిన‌కోడూరు మండ‌లం గోనెప‌ల్లికి చెందిన కూర ర‌ఘోత్తంరెడ్డి ఉపాధ్యాయుల కోటాలో ఎమ్మెల్సీగా ఉన్నారు. సిద్దిపేట ప‌ట్ట‌ణానికి చెందిన మురంశెట్టి రాములు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థాన బోర్డు స‌భ్యుడిగా ఉన్నారు. క‌వి, గాయ‌కుడు దేశ‌ప‌తి శ్రీ‌నివాస్ ముఖ్య‌మంత్రి ఓఎస్డీగా కొన‌సాగుతున్నారు.

సిద్దిపేట రూర‌ల్ మండ‌లం ఇర్కోడుకు చెందిన మారెడ్డి శ్రీ‌నివాస్ రెడ్డి సివిల్ స‌ప్ల‌య్ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌ గా ప‌ని చేస్తున్నారు. సిద్దిపేట ప‌ట్ట‌ణానికి చెందిన గ్యాద‌రి బాల‌మ‌ల్లు ఇండ‌స్ట్రియ‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌ గా ఉన్నారు.

నారాయ‌ణ‌రావుపేట మండ‌లం ల‌క్ష్మీదేవిప‌ల్లికి చెందిన ఉప్ప‌ల శ్రీనివాస గుప్తా టూరిజం కార్పొరేష‌న్ చైర్మ‌న్‌ గా కొన‌సాగుతున్నారు. కొండ‌పాకకు చెందిన చిట్టి దేవేంద‌ర్ రెడ్డి ఉమ్మ‌డి మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మ‌న్‌ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు వీరంతా ఆయా ప‌ద‌వుల్లో కొన‌సాగుతుండ‌గా.. తాజాగా ఈ జాబితాలో మ‌రో ముగ్గురు వ‌చ్చి చేరారు. గ‌జ్వేల్ ప‌ట్ట‌ణానికి చెందిన వంటేరు యాద‌వ‌రెడ్డి స్థానిక సంస్థ‌ల కోటాలో ఎమ్మెల్సీగా గెలిచారు. అలాగే గ‌జ్వేల్ మండ‌లానికే చెందిన వంటేరు ప్ర‌తాప‌రెడ్డి అట‌వీ శాఖ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌ గా కొన‌సాగుతున్నారు. ఈ ప‌ద‌వీ కాలాన్ని మ‌రో రెండేళ్లు పొడిగించారు.

చిన‌కోడూరుకు చెందిన ఎర్రోళ్ల శ్రీ‌నివాస్‌ ను ఈ ద‌ఫా రాష్ట్ర మెడిక‌ల్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌ గా నియ‌మించారు. గ‌తంలో ఎస్సీ ఎస్టీ క‌మిష‌న్ చైర్మ‌న్‌ గా ప‌నిచేశారు. ఇలా ఆయా ప‌ద‌వుల్లో ఎక్కువ మంది ఉన్న జిల్లాగా రాష్ట్రంలో సిద్దిపేట ముందంజ‌లో నిలిచింది.