Begin typing your search above and press return to search.

బండి సంజయ్ మీద దాడిపై స్పందించిన పోలీస్ కమిషనర్

By:  Tupaki Desk   |   27 Oct 2020 10:30 AM GMT
బండి సంజయ్ మీద దాడిపై స్పందించిన పోలీస్ కమిషనర్
X
దుబ్బాక ఉప ఎన్నికల వేడి రాజుకుంది. టీఆర్ఎస్ , బీజేపీ పోరులో నిన్న సిద్ధిపేటలో రణరంగమే జరిగింది. ఈ క్రమంలోనే దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బంధువుల ఇళ్లలో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించడం ఉద్రిక్తతకు దారి తీసింది.

సిద్దిపేటలో బీజేపీ అభ్యర్థి ఇళ్లపై దాడుల వార్త తెలియగానే కరీంనగర్ లో ఉన్న తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సిద్దిపేటకు బయలు దేరారు. అయితే పోలీసులు మార్గమధ్యలోనే అడ్డుకోవడంతో బీజేపీ కార్యకర్తలు వారితో వాగ్వాదానికి దిగారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఈ క్రమంలోనే బండి సంజయ్ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని.. ఆయనపై చేయి చేసుకున్నారన్న వార్తలు మీడియాలో వచ్చాయి. దీనిపై బండి సంజయ్ దీక్షకు దిగారు. సీపీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రచారంపై సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ స్పందించారు.

బండి సంజయ్ పట్ల తాము మర్యాదపూర్వకంగానే వ్యవహరించామని సీపీ వివరించారు. తాను సిద్దిపేటకు రావడం లేదని బండి సంజయ్ మాకు సమాచారం ఇచ్చారని.. కానీ ఆయన చెప్పకుండా సిద్దిపేటకు రావడం వల్ల శాంతి భద్రతల విషయంలో సమస్య ఏర్పడుతుందన్నారు. అందుకే ఆయనను అదుపులోకి తీసుకోవాల్సి వచ్చిందని సీపీ మీడియాకు తెలిపారు.

దుబ్బాక ఉప ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడం కోసం అవసరమైన ఏర్పాట్లు చేశామని.. ఎన్నికల నియమావళి ప్రకారం పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారని సీపీ తెలిపారు. దీనికి అన్ని పార్టీల వారు సహకరించాలని సీపీ విన్నవించారు.