Begin typing your search above and press return to search.

పరిటాల చిన్న కొడుకు అంత పని చేశాడా?

By:  Tupaki Desk   |   20 Aug 2021 4:48 AM GMT
పరిటాల చిన్న కొడుకు అంత పని చేశాడా?
X
ఊహించని రీతిలో వివాదాన్ని నెత్తిన మీదేసుకున్నాడు దివంగత టీడీపీ నేత పరిటాల రవీంద్ర చిన్న కుమారుడు సిద్ధార్థ. పరిటాల రవీంద్ర సునీతలకు ఇద్దరు కొడుకులు కాగా..పెద్దవాడైన పరిటాల శ్రీరామ్ రాజకీయాల్లో చురుగ్గా ఉండటం తెలిసిందే. చిన్నకొడుకు సిద్ధార్థ్ మాత్రం అంతగా బయటకు రాకుండా ఉంటారు. తాజాగా అతగాడుకశ్శీర్ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఇక్కడే ఊహించని ట్విస్టు చోటు చేసుకుంది.

శ్రీనగర్ వెళుతున్న పరిటాల సిద్ధార్థ్ బ్యాగులో బుల్లెట్ ఉండటం కలకలాన్ని రేపింది. సిద్ధార్థ్ బ్యాగులో 5 ఎంఎం బుల్లెట్ ఉన్నట్లుగా ఎయిర్ పోర్టు భద్రత సిబ్బంది గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో.. అతడ్ని శంషాబాద్ సీఐఎస్ఎస్ అధికారులు విచారిస్తున్నట్లు చెబుతున్నారు. విమానాశ్రయంలో ప్రయాణికుల బ్యాగుల్ని క్షుణ్ణంగా తనిఖీ చేయటం తెలిసిందే.

ఇందుకోసం సీఐఎస్ఎస్ సిబ్బందిని ప్రత్యేకంగా నియమిస్తారు. వీరు డేగ కన్నుతో ప్రయాణికులు బ్యాగుల్లోని వస్తువుల్ని తనిఖీ చేస్తుంటారు. గురువారం రాత్రి శ్రీనగర్ కు వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకు వచ్చిన సిద్దార్థ్ బ్యాగులో నిషేధిత బుల్లెట్ ఉండటంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. అతడ్ని ప్రశ్నించారు. వాస్తవానికి శంషాబాద్ ఎయిర్ పోర్టులోని ఒక యువకుడి బ్యాగులో బుల్లెట్ దొరికినట్లుగా బ్రేకింగ్ న్యూస్ లు ప్రసారమయ్యాయి. కాసేపటి తర్వాత కానీ అదంతా పరిటాల రవీంద్ర చిన్న కొడుకు బ్యాగ్ అన్న విషయం బయటకు వచ్చింది.

అయితే..బ్యాగులోకి బుల్లెట్ ఎలా వచ్చిందో తనకు తెలీదని.. దానికి అవసరమైన పత్రాలు తన వద్ద ఏమీ లేవని పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో.. ఆ బుల్లెట్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అతడిపై కేసు నమోదు చేసి.. వివరణ కోరినట్లుగా తెలుస్తోంది. అయితే.. ఇదే విషయాన్ని శంషాబాద్ పోలీసుల్ని అడిగినప్పుడు మాత్రం తమకేమీ తెలీదని తప్పించుకోవటంతో పాటు.. వివారాల్ని వెల్లడించటం లేదన్న మాట మీడియాలో రిపోర్టు కావటం గమనార్హం.