Begin typing your search above and press return to search.

ప‌వ‌న్‌ కు ఫైనల్ మాట చెప్పిన బీజేపీ

By:  Tupaki Desk   |   10 Sep 2016 5:39 PM GMT
ప‌వ‌న్‌ కు ఫైనల్ మాట చెప్పిన బీజేపీ
X
జ‌న‌సేన పార్టీ అధినేత‌ - సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాకినాడ‌లో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భపై బీజేపీ జాతీయ అధిష్టానం స్పందించింది. బీజేపీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జ్‌ సిద్ధార్థనాథ్ ప‌వ‌న్‌కు అల్టిమేటం జారీచేశారు. ఢిల్లీలో పవన్‌ వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. రాజకీయ పార్టీతో పవన్‌ ముందు ఆయన భవిష్యత్‌ ఏంటో చూసుకోవాలని ఎద్దేవా చేశారు. జనసేన ఎన్డీఏలో ఉందో లేదో పవన్‌ కల్యాణ్‌ తేల్చుకోవాలని అంత‌కంటే ముందు జనసేనను రాజకీయ పార్టీగా చేసుకోమనండంటూ సూచించారు. రాజకీయ విమర్శలు చేసే ముందు అధ్యయనం చేయాలని ప‌వ‌న్‌ కు సిద్ద‌ర్థానాథ్ చుర‌క‌లంటించారు.

పవన్‌ కల్యాణ్‌ తెలియక ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని సిద్ధార్థనాథ్‌ విమర్శించారు. డ‌బ్బులెప్పుడూ పాచిపోవని - మాటలూ భావోద్వేగాలే పాచిపోతాయని ఆయ‌న అన్నారు. ప్యాకేజీని పవన్‌ కల్యాణ్‌ పరిశీలించినట్లు లేదన్నారు. రాజకీయ లబ్ధి కోసం కొందరు ఆయ‌న్ను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. విభజన సమయంలో గుజరాత్‌ వెనకబడి వనరులు లేకుండా ఉందని - ఇప్పుడు గుజరాత్‌ అగ్రస్థానంలో ఉందని మోడీ అన్నారని గుర్తు చేశారు. ఏపీకి ప్రకృతి వనరులతో పాటు కేంద్రం మద్దతు ఉందనే విష‌యం గుర్తుంచుకోవాల‌ని సిద్దార్థ‌నాథ్ సింగ్ తెలిపారు.

ఇదిలాఉండ‌గా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను ఆ పార్టీ రాష్ట్ర నేత‌లు క‌లిశారు. రాష్ట్ర బీజేపీ వ్యవహారాల బాధ్యుడు సిద్దార్థనాథ్‌ సింగ్‌ - మంత్రి మాణిక్యాలరావు - ఎంపీ కంభంపాటి హరిబాబులు అమిత్‌ షా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ ప్యాకేజీ వల్ల కలిగే లాభాలను ప్రజలకు వివరించాలని వారికి సూచించారు. ప్యాకేజీపై బీజేపీ - టీడీపీ నేతలు ఏపీలో ప్రచారం చేయాలని ఈ సంద‌ర్భంగా షా సూచించారు.