Begin typing your search above and press return to search.

సిద్దార్థ్ మాటలన్నీ బాబుకు షాక్ ఇచ్చేందుకేనా?

By:  Tupaki Desk   |   14 May 2016 6:40 AM GMT
సిద్దార్థ్ మాటలన్నీ బాబుకు షాక్ ఇచ్చేందుకేనా?
X
మిత్రుడైన మోడీతో గొడవ పెట్టుకోవటానికి ఏపీ ముఖ్యంత్రి చంద్రబాబు సిద్ధంగా లేరన్న సంగతి తెలిసిందే. అలా అని.. రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని చూస్తూ నోరు మూసుకోలేని పరిస్థితి. నోరు మూసుకుంటే మిత్రుడి మనసు దోచుకోవచ్చు. కానీ.. ఏపీ ప్రజలు ఛీదరించుకోవటం ఖాయం. అందుకే ఆయన రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ.. ఏపీ ప్రజల కోసం తానెంత ఆరాటపడుతున్నట్లుగా వ్యవహరిస్తూనే.. మోడీ ఇగోను హర్ట్ చేయకుండా ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు ప్రధాని మోడీని దూరం చేసుకునే ఛాన్సే లేదు. దేశంలో తిరుగులేని నేతగా అవతరించి.. 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్న మోడీతో పెట్టుకుంటే ఏపీకి జరిగే నష్టం గురించి తెలీనంత అమాయకుడేమీ కాదు చంద్రబాబు. అందుకే.. తనకు కలిసి వచ్చే కాలం కోసం ఆయన ఓపిగ్గా వెయిట్ చేస్తున్నారు. అలా అని కలిసి వచ్చే కాలం కోసం వెయిట్ చేస్తే జరిగే నష్టం ఏమిటో కూడా బాబుకు తెలుసు. అందుకే.. రెండు మాటలు అనటం.. ఆ వెంటనే ఒక అడుగు వెనక్కి వేయటం లాంటివి చేస్తూ బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

చంద్రబాబు ప్లానింగ్ ను గుర్తించిన కమలనాథులు రివర్స్ గేమ్ మొదలెట్టారని చెప్పాలి. స్నేహంగా ఉంటూనే.. మోడీ మీదా.. బీజేపీ మీద ఏపీ ప్రజల్లో వ్యతిరేకత పెరిగేలా చేస్తూ.. తన ఇమేజ్ ను కాపాడుకుంటున్న బాబు ఆలోచనల్ని గుర్తించిన కమలనాథులు.. బాబు గేమ్ ప్లాన్ కు చెక్ పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారు. దీనికి తగ్గట్లే వ్యూహాన్ని సిద్ధం చేసిన వారు.. దాన్ని అమలు చేయటం షురూ చేసినట్లుగా తాజాగా ఏపీ బీజేపీ వ్యవహారాల బాధ్యుడు సిద్దార్థ్ మాటలు స్పష్టం చేస్తున్నాయి.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమన్న నెగిటివ్ పాయింట్ ను పాజిటివ్ గా చెప్పుకునే అవకాశం లేని నేపథ్యంలో.. చంద్రబాబు సర్కారుకు నిధుల రూపంలో భారీగా ఇస్తున్నామని.. పెద్ద ఎత్తున ఆర్థిక సాయం అందిస్తున్నా..ఆ డబ్బులన్నీ చెత్త పథకాలకు ఖర్చు అవుతున్నట్లుగా వ్యాఖ్యలు చేయటం గమనార్హం. ఏపీ సర్కారుకు కేంద్రం అందించిన ఆర్థిక సాయంపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలంటూ డిమాండ్ ను తెర మీదకు తీసుకురావటం ఇందులో భాగంగా చెప్పొచ్చు.

తమను విమర్శిస్తూ.. తాను సేఫ్ గా ఉండాలనుకునే చంద్రబాబు ప్లాన్ తమకు అర్థమైందన్న విషయాన్ని తాజా వ్యాఖ్యలతో చెప్పటమే కాదు.. తాను కామ్ గా ఉండి తన తమ్ముళ్ల చేతి విమర్శలు చేయిస్తున్న వైఖరిపై కమలనాథులు ఎంత కోపంగా ఉన్నారన్న విషయాన్ని సిద్దార్థ్ చేసిన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయని చెప్పాలి. చంద్రబాబు సర్కారు మీద బీజేపీ ఏపీ ఇన్ ఛార్జ్ చేసిన విమర్శలు శాంపిల్ మాత్రమేనని.. ఇప్పటికి దారికి రాకుంటే ఈ విమర్శల జోరు మరింత పెరగటం ఖాయమని చెబుతున్నారు. మరి.. కమలనాథుల రివర్స్ గేమ్ ను బాబు ఎలా ఎదుర్కొంటారన్నది ఇప్పుడు ఆసక్తికర అంశంగా చెప్పాలి.