Begin typing your search above and press return to search.

ట్రంప్ కు చివరకు మిగిలేది టవలే.. మోడీ ఆటలు సాగవంటూ చిలకజోస్యం

By:  Tupaki Desk   |   5 Nov 2020 6:50 AM GMT
ట్రంప్ కు చివరకు మిగిలేది టవలే.. మోడీ ఆటలు సాగవంటూ చిలకజోస్యం
X
ఎక్కడ అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ఎక్కడ ఇండియా? ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న అమెరికా ఎన్నికలు.. వాటి ఫలితాలపై దేశీయ నేతలు పలువురు స్పందిస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది. ట్రంప్ కచ్ఛితంగా ఓడిపోతారన్న మాటతో పాటు.. ఆయనకు జిగిరీ దోస్తు మోడీపైనా వారు విరుచుకుపడుతున్నారు. అమెరికా రాజకీయాల మీద పట్టు ఉన్న నిపుణులు సైతం.. ఎవరు గెలుస్తారు? తదుపరి అధ్యక్షుడు ఎవరు? అన్న ప్రశ్నకు వెంటనే కాదు.. కాస్త ఆలోచించుకొని ఒక్క వాక్యంలో సమాధానం చెప్పాలంటే చెప్పలేని పరిస్థితి.

అందుకు భిన్నంగా మన రాజకీయ నేతలు మాత్రం ఏం జరుగుతుందో తెలుసా? అంటూ వ్యాఖ్యలు చేస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది. ఎవరిదాకానో ఎందుకు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య చెబుతున్న తాజా మాటలే ఇందుకు నిదర్శనం. అమెరికాలో భారత ప్రధాని మోడీ ఆటలు ఇక సాగవని.. ట్రంప్ కచ్ఛితంగా ఓడిపోతారని.. ట్రంప్ నకు చివరకు మిగిలేది టవలేనని తేల్చారు.

తాను చెప్పిన అంచనాలు ఇప్పటివరకు తారుమారు కాలేదని.. మోడీ.. ట్రంప్ శకం ముగిసినట్లేనని పేర్కొన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ తన ప్రచార సమయంలో భారత ప్రధాని మోడీ పేరు.. ఫోటో వాడుకొని అమెరికాలో స్థిరపడ్డ భారతీయుల ఓట్లు సాధించాలని ప్రయత్నించారని ఆరోపించారు. మోడీ ఫోటో వాడుకొని ట్రంప్ చాలా పెద్ద తప్పు చేశారన్న ఆయన.. మోడీ ఫోటోలకు ఓట్లు రాలతాయా? అని ప్రశ్నించారు.

మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? అంటున్న ఆయన.. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా జనాభిప్రాయం అమెరికాలో ఇప్పుడే మొదలైందన్నారు. త్వరలోనే భారత్ లోనూ ఆయనకు వ్యతిరేక పవనాలు వీయనున్నట్లు చెప్పారు. భారత దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావటానికి మోడీ వైఖరే కారణమన్న సిద్దరామయ్య.. జీడీపీ పాతాళానికి పడిపోయిందన్నారు. బిహార్ ఎన్నికల ప్రచారంలో సీఎం నితీశ్ కు అక్కడి ప్రజలు ఉల్లిగడ్డలు రుచి చూపించటానికి (విసిరేసిన వైనాన్ని తనదైన శైలిలో ఇలా వ్యాఖ్యానించారు) కారణం.. మోడీ మీద ప్రజలకు ఉన్న వ్యతిరేకతేనని చెప్పారు. కర్ణాటకలోతమ గెలుపోటముల గురించి అంచనా వేయటంలో విఫలమైన సిద్ధరామయ్య.. అమెరికా అధ్యక్ష ఎన్నికలపై జోస్యం చెప్పటం గమనార్హం.