Begin typing your search above and press return to search.

ఈ సీఎం కాన్వాయ్ ఒకరిని చంపేసింది

By:  Tupaki Desk   |   30 Jun 2016 9:24 AM GMT
ఈ సీఎం కాన్వాయ్ ఒకరిని చంపేసింది
X
చూస్తుంటే.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య టైం ఏ మాత్రం బాగున్నట్లుగా కనిపించట్లేదు. వరుస వివాదాలతో తరచూ మీడియాలోకి ఎక్కుతున్న ఆయన తాజాగా మరోసారి పతాక శీర్షికల్లో నిలిచారు. ఆయన కాన్వాయ్ కారణంగా ఒకరు చనిపోవటం ఇప్పుడాయనకు ఇబ్బందికరంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హడావుడి చేస్తోంది.

ఖరీదైన వాచీతో ఒకసారి బుక్ అయిన ఆయన.. తర్వాతి కాలంలో కాకి తన కారు మీద వాలిందన్న కారణంగా దాన్ని తీసేసి కొత్త కారును వాడటం(ఈ ఆరోపణను తర్వాతి కాలంలో సిద్ధరామయ్య ఖండించారు) వార్తల్లోకి తీసుకొచ్చింది. ఆదివారం ఒక మహిళా ప్రజాప్రతినిధి ఆయన్ను బహిరంగ వేదిక మీద ముద్దుపెట్టుకోవటంతో వార్తల్లోకి వచ్చిన ఆయన.. తాజాగా ఆయన కాన్వాయ్ ఒకరి ప్రాణాల్ని తీసిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నెల 25న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కాన్వాయ్ వస్తుందన్న కారణంగా చిక్కబల్లాపూర్ – చింతామణి హైవే మీద దాదాపు 25 నిమిషాల పాటు ట్రాఫిక్ ను నిలిపివేశారు.దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఆగిపోయింది. ఈ ట్రాఫిక్ లో ఒక అంబులెన్స్ కూడా నిలిచిపోయింది. అంబులెన్స్ లో తన తల్లి ప్రాణాపాయ స్థితిలో ఉందని.. వాహనం వెళ్లేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా అక్కడి పోలీసు అధికారుల్ని అడిగినా.. అతడి వాదనను పట్టించుకోలేదు.

సీఎం కాన్వాయ్ వెళ్లిపోయిన తర్వాతే అంబులెన్స్ కు దారిచ్చారు. దీంతో.. ఆ పేషంట్ ను ఆసుపత్రికి తీసుకెళ్లటం ఆలస్యమైంది. దీంతో.. సదరు పేషంట్ చనిపోయారు. ఈ ఘటనను ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయటంతో ఇదో వివాదంగా మారింది. అయితే.. ఈ వీడియోలో చెబుతున్నట్లుగా అంతసేపు అంబులెన్స్ ఆపలేదని.. కేవలం రెండు మూడు నిమిషాలు మాత్రమే ఆపినట్లుగా అధికారులు చెబుతున్నారు. తాము ట్రాఫిక్ ఆపినప్పుడు ఆమె ఆరోగ్యం బానే ఉన్నట్లుగా కవర్ చేస్తున్నారు. నిజంగా ఆరోగ్యం బాగుంటే అంబులెన్స్ లో ఎందుకు తీసుకెళతారు..? జనాలకు లాజిక్ గా ఆలోచించటం చేత కాదని అధికారులు అనుకుంటారా ఏంటి..?