Begin typing your search above and press return to search.

బ‌హుమ‌తులంటే బెదిరిపోతున్న సీఎం

By:  Tupaki Desk   |   19 Oct 2016 6:51 AM GMT
బ‌హుమ‌తులంటే బెదిరిపోతున్న సీఎం
X
కానుక‌లు ఇస్తే కొంద‌రు మురిసిపోతారు. మ‌రికొంద‌రు వ‌ద్ద‌వ‌ద్దంటూనే అందుకుంటారు.. కొంద‌రు మొహ‌మాట‌ప‌డ‌తారు.. కానీ, కర్ణాట‌క సీఎం సిద్ధ‌రామ‌య్య మాత్రం గిఫ్టు అన‌గానే బాంబును చూసిన‌ట్లు బెదిరిపోతున్నారు. గతంలో హోబ్లేట్‌ వాచ్‌ వ్యవహారంలో పీకల్లోతు కూరుకుపోయి...అనంతరం ఏసీబీ క్లీన్‌ చిట్‌ తో బయటపడిన ఆయన కానుకలు అంటే చాలు కంగారుప‌డిపోతున్నారు. తాజాగా తన మంత్రివర్గ సహచరుడు అభిమానంతో గిఫ్టు ఇవ్వ‌గా ఆయ‌న నిర్ద్వంద్వంగా తిర‌స్క‌రించారు. అందులో ఏమున్నాయ‌ని అడిగి... అవి త‌న‌కు వ‌ద్ద‌ని చెప్పేశారట‌.

క‌ర్ణాట‌క రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి మంజు సీఎం సిద్ధరామయ్యకు అసెంబ్లీలోనే ఓ గిఫ్ట్‌ ప్యాక్‌ ను అందజేశారట‌. ముఖ్యమంత్రి ఏమాత్రం ఆలోచించకుండా ఆ గిఫ్ట్‌ ను తీసుకోడానికి నిరాకరించారు. మంజు కాస్త బ‌తిమ‌లాడ‌డంతో అందులో ఏమున్నాయని సిద్ధరామయ్య ప్రశ్నించారు. కేవలం సిల్క్ చొక్కాలు మాత్ర‌మే ఉన్నాయని.. స్వీకరించాలని ఆయ‌న‌ కోరారు. దీంతో సీఎం అలాంటివి తాను ధరించనని సున్నితంగా తిరస్కరించారు.

కాగా గతంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ధరించిన రూ.70 లక్షల రూపాయల ఖరీదు చేసే లగ్జరీ వాచ్ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే రేపింది. సాధారణ జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడతానని చెప్పుకునే ఆయన ఇంత ఖరీదు చేసే వాచ్‌ ను ఎలా కొన్నారు? ఒక వేళ సిద్ధరామయ్య కొనకపోతే ఎవరైనా బహుమతిగా ఇచ్చారా? బహుమతిగా అందుకొని ఉంటే అందుకు ప్రతిఫలంగా సిద్దరామయ్య ఏం చేశారు? అంటూ మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి సంధించిన ప్రశ్నలు అప్పట్లో కలకలాన్ని రేపాయి. ఇక ఈ వాచ్ వ్యవహారం ఏకంగా కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి కూడా వెళ్లిన విషయం తెలిసిందే. దీనిపై ఏసీబీ విచారణ కూడా చేపట్టింది. అప్ప‌టినుంచి బ‌హుమ‌తి అన‌గానే బెదిరిపోతున్నారు ఆ సీఎం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/