Begin typing your search above and press return to search.

'టీ' సర్కారు మీటింగ్‌కు కూడా రావటం లేదంట

By:  Tupaki Desk   |   11 April 2015 2:30 PM GMT
టీ సర్కారు మీటింగ్‌కు కూడా రావటం లేదంట
X
ఉప్పు.. నిప్పులా ఉంటూ నిత్యం ఏదో ఒక వివాదంతో సహవాసం చేసే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎంట్రీటాక్స్‌ కొత్త రగడను రేపిన విషయం తెలిసిందే. అయితే.. ఈ వ్యవహారంలో తెలంగాణ సర్కారు క్లారిటీతో ఉండటం.. ఈ విషయంలో వెనక్కి తగ్గే విషయంలో ససేమిరా అంటున్న కేసీఆర్‌ సర్కారు.. ఏపీ సర్కారుకు చుక్కలు చూపిస్తోంది.

మిగిలిన వ్యవహారాల సంగతిని పక్కన పెడితే.. ఎంట్రీ టాక్స్‌ కారణంగా అధికంగా నష్టపోయేది ఏపీ ప్రజలనే చెబుతున్నారు. వారి మీద పడే భారం అధికమన్న వాదన వినిపిస్తోంది. అయితే.. ఎంపీ కేశినేని నాని మాత్రం.. ఎంట్రీ టాక్స్‌ కారణంగా తెలంగాణ సర్కారుకే నష్టమని చెప్పుకున్నారు.

కానీ.. ప్రాధమికంగా లభిస్తున్న సమాచారం ప్రకారం.. ఎంట్రీ టాక్స్‌ కారణంగా ఏడాదికి టీ సర్కారుకు రూ.100 నుంచి రూ.120 కోట్లు వస్తే.. ఏపీ సర్కారుకు మాత్రం రూ.60కోట్లు మించదని చెబుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ఏపీ సర్కారు..సీమాంధ్రుల మీద పడే భారంతో ఏపీ సర్కారుపై ప్రజల్లో నెగిటివ్‌ అయ్యే అవకాశం ఉందన్న విషయాన్ని గుర్తించి ఏపీ సర్కారు.. తెలంగాణ సర్కారుతో రాజీ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఎంట్రీ టాక్స్‌ విషయంలో తమదే పైచేయి అన్న విషయాన్ని గుర్తించి తెలంగాణ సర్కారు బెట్టు చేస్తోంది. ఎంతలా అంటే.. ఏపీ మంత్రి శిద్దా రాఘవరావు.. ఈ అంశంపై తెలంగాణ మంత్రికి సమాచారం ఇచ్చి మీటింగ్‌ పెట్టుకోవాలని భావించారు.

అదే విధంగా తెలంగాణ మంత్రిని మీటింగ్‌కు పిలిస్తే కనీసం రాలేదని చెప్పుకొచ్చారు. తమ పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉందన్న విషయాన్ని బయటపెట్టుకునేందుకు శిద్దా ఎలాంటి మొహమాట పడటం లేదు. ఎంట్రీ టాక్స్‌ కారణంగా ఏపీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ ఉన్నందున నిత్యం పలు పనుల మీద హైదరాబాద్‌కు వస్తారని.. అలాంటి వారంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు.

ఏపీ ప్రజలకు భారంగా మారిన ఎంట్రీ టాక్స్‌ విషయంలో తెలంగాణ సర్కారు పునరాలోచించాలిగా కోరుతున్నారు. ఏపీ సర్కారును ఇబ్బంది పెట్టే బంపర్‌ ఆఫర్‌ను చూస్తూ.. చూస్తూ తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ వదులుకుంటారా చెప్పండి..? అంత పెద్ద మనసే ఉంటే రెండు రాష్ట్రాల మధ్య ఇన్ని వివాదాలు ఉండేవా ఏంటి..?