Begin typing your search above and press return to search.

విపక్షాలలో కంఫ్యూజనే జగన్ కి శ్రీ రామరక్ష

By:  Tupaki Desk   |   20 Jun 2023 9:00 AM GMT
విపక్షాలలో కంఫ్యూజనే జగన్ కి శ్రీ రామరక్ష
X
ఏపీలో ప్రతిపక్ష రాజకీయం చూస్తే రాను రానూ పూర్తిగా గందరగోళంలో అయోమయంలోకి వెళ్ళిపోతోంది. ఏపీలో విపక్ష శిబిరంలో పార్టీలు ఎక్కువయ్యాయి. అలాగే అధికారంలోకి రాకుండానే కీచులాటలు ఎక్కువ అయ్యాయి. రెండేళ్ల ముందు జగన్ గద్దె దిగితే చాలు అని భావించిన వారు అంతా ఇపుడు ఎవరికి వారే అధికారంలో వాటా అంటున్నారు.

ఏపీలో బీజేపీకి బలం ఎంత అన్నది అందరికీ తెలిసిందే. నోటా కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్న బీజేపీ తమకు ఇరవై ఎంపీ సీట్లు ఇవ్వాలని జనాలకు డైరెక్ట్ గా అప్పీల్ చేస్తోంది అంటే అది బీజేపీ అతి విశ్వాసమా లేక ఏపీలో పొలిటికల్ కామెడీయా అన్నది తెలియడంలేదు. బీజేపీకి ఈ లెక్కన అసెంబ్లీ 140 నియోజకవర్గాలలో బలం ఉందని అనుకోవాలా అన్న చర్చ వస్తోంది.

ఏపీలో 2014 పొత్తుని రిపీట్ చేయాలని చంద్రబాబు అనుకుంటే దాన్ని ఆసరాగా తీసుకుని పెద్ద వాటా కోరడానికే బీజేపీ ఇరవై ఎంపీ సీట్లు అంటోందని అంటున్నారు. అంటే ఈ పొత్తు తెగదు, తెగిదే మునుగుతుంది అని ముందే తేలిపోతోంది అన్న మాట. అది బీజేపీ మ్యాటర్. తమకు జనసేనతో పొత్తు అని ఒకసారి అంటున్న బీజేపీ నేతలు మరోసారి జనంతోనే పొత్తు అంటున్నారు.

ఈ మధ్య చంద్రబాబుకు అమిత్ షా ఇంటర్వ్యూ ఇచ్చారు. దాంతో పొత్తులు ఉంటాయనుకుంటే మరింత గందరగోళంగా మ్యాటర్ వెళ్లిపోయింది. ఇక జనసేన తీరు చూస్తే వైసీపీ లేని ఏపీ అని ఒకసారి అంటున్న పవన్ కళ్యాణ్ మరోసారి తానే ఏపీకి సీఎం అని అంటున్నారు. ఆయన ఒకసారి తనకు పదవులు అక్కరలేదు, ఏపీ బాగుండే చాలు అంటూనే మరోసారి తానే ఏపీని బాగుచేస్తాను అంటున్నారు. అందువల్ల తనకు సీఎం పదవి ఇవ్వాలని కోరుతున్నారు.

పవన్ వారాహి యాత్రతో ఈ కంఫ్యూజన్ పీక్స్ కి వెళ్తోంది. అసలు ఏపీలో పొత్తులు ఉంటాయా లేక ఎవరి దారి వారిదేనా అన్న చర్చ సాగుతోంది. ఇక టీడీపీని ఒంటరిగా గెలిపించకుండా పెద్ద నంబర్ సీట్లు తమకు కావాలని జనసేన పట్టుబట్టేందుకే వారాహి యాత్ర అని అంటున్నారు. ఇలా వత్తిడి రాజకీయం జనసేన స్టార్ట్ చేయడంతో టీడీపీలో ఆందోళన వేరే లెవెల్ కి వెళ్ళిపోతోంది.

టీడీపీ విషయానికి వస్తే ఈ రోజుకీ సింగిల్ గా వస్తామని చెప్పలేకపోతోంది. అలాగని పొత్తులతోనే అని గట్టిగా అనలేకపోతోంది. ఈ రకంగా టీడీపీలో ఉన్న కంఫ్యూజన్ ని పొత్తు పార్టీలు ఆసరాగా తీసుకోవాలని చూస్తూంటే అది ఏపీలో విపక్ష రాజకీయాన్ని పూర్తిగా గందరగోళంలోని నెట్టేలా కనిపిస్తోంది. ఎన్నికలు చాలా దగ్గరగా వచ్చేశాయి.

ఏపీలో అధికార పార్టీ తన దారి రహదారి అంటోంది. మేమే 175 సీట్లు గెలుస్తామని చెబుతోంది. మాకు పొత్తులు అవసరం లేదు అని ఫుల్ క్లారిటీ ఇస్తోంది. మేము చేసిన పనులే మమ్మల్ని గెలిపిస్తాయని బిగ్ సౌండ్ చేస్తోంది. ఆ ధీమా అయితే విపక్ష శిబిరంలో కనిపించడంలేదు. అంతే కాదు విపక్షాలు ఒంటరిగా వచ్చినా విడిగా వచ్చినా ఓడించి పంపుతామని వైసీపీ అంటోంది.

విపక్షాలు ఈ రోజుకీ ఒక మాట మీదకు రాకపోవడం చూస్తూంటే ఏపీలో ఈ గందరగోళం కాస్తా వైసీపీకే మరోమారు రాజకీయంగా గరిష్ట లాభాన్ని కలిగించేలా ఉందని అంటున్నారు. ఇప్పటికే పొత్తులు అంటూ విపక్ష పార్టీలు తమ బలహీనతను ప్రజల ముందు పెట్టుకున్నాయని అంటున్నారు. తీరా ఎన్నికలు దగ్గర పడ్డాక ఆ పొత్తులు సరిగ్గా కుదరక ఎవరి మటుకు వారు జనంలోకి వస్తున్నారు.

ఇలా విడివిడిగా కనుక వచ్చినా లేక చివరి నిముషంలో పొత్తులు పెట్టుకుని వచ్చినా కూడా అది అంతిమంగా వైసీపీకే లాభిస్తుంది అని అంటున్నారు. ఎందుకంటే ఆశావహులు అన్ని పార్టీలలోనూ ఉన్నారు. పొత్తులు ఫలించాలి అంటే ఒక నిర్దిష్ట కార్యాచరణ ఉండాలి. అంతా ఒక్కటిగా ఉన్నట్లుగా జనాలకు కనిపించాలి.

అలా కాకుండా నేనే సీఎం అని ఎవరికి వారు చెప్పుకుంటూ పోతే ఎలా అన్న చర్చ ఉంది. బీజేపీ నుంచే సీఎం అభ్యర్ధి అని ఆ పార్టీ అంటోంది. ఎటూ టీడీపీకి చంద్రబాబు ఉన్నారు. ఇపుడు పవన్ కూడా సీఎం క్యాండిడేట్ గా కనిపిస్తున్నారు. ఇవన్నీ చూసిన వారికి ఇంతటి గందరగోళమా అని అనిపించకమానదు.

సరిగ్గా ఇక్కడే వైసీపీ ధీమాగా కనిపిస్తోంది. ఈ పొత్తులు కుదిరేవి కావు, కుదిరినా హిట్ అయ్యేవి కావు అన్నదే జగన్ మార్క్ ప్లాన్ అని అంటున్నారు. సో ఏపీ పాలిటిక్స్ లో విపక్షాల మధ్య ఉన్న కంఫ్యూజనే ఇపుడు వైసీపీకి వరంగా మారబోతోందా అంటే ప్రస్తుతానికి అదే నిజం అనిపిస్తోంది.