Begin typing your search above and press return to search.

పోలీసుల నిర్ల‌క్ష్య‌మే.. ఆమెను 35 ముక్క‌లు చేసింది?

By:  Tupaki Desk   |   23 Nov 2022 2:50 PM GMT
పోలీసుల నిర్ల‌క్ష్య‌మే.. ఆమెను 35 ముక్క‌లు చేసింది?
X
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న శ్రద్ధా వాకర్ హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. నిందితుడు అఫ్తాబ్‌... ఆమెను చంపేసి ముక్కలుగా నరికి ఢిల్లీలో విసిరిసేనట్లు విచారణలో వెల్లడైంది. తనను చంపేస్తాడని రెండేళ్ల క్రితమే శ్రద్ధ చెప్పిన‌ట్టు వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు మహారాష్ట్ర పోలీసులకు ఆమె రాసిన లేఖ బయటకు వచ్చింది. అయితే, ఆమెరాసిన లేఖ‌ను పోలీసులు లైట్ తీసుకున్నారు. ఏమాత్రం ప‌ట్టించుకోలేదు. క‌నీసం.. దీనిని ఎందుకు రాయాల్సి వ‌చ్చింది? ఎవ‌రు ఈ శ్ర‌ద్ధ‌? అనే కోణంలోనూ వారు దృష్టి పెట్ట‌లేదు. ఫ‌లితంగా ఆమె 35 ముక్క‌లైంది!!

ఢిల్లీలోని మెహ్రోలీ శ్రద్ధా వాకర్‌ను హత్యచేసిన నిందితుడు అఫ్తాబ్‌ క్రూరత్వంపై 2020లో మహారాష్ట్ర పోలీసులకు.. శ్రద్ధా వాకర్ లేఖ రాసినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు ఆమె పేరిట ఉన్న ఒక లేఖ బయటకు వచ్చింది. అఫ్తాబ్‌ అమిన్ పునావాలా పాల్ఘర్‌ జిల్లాలోని వాసాయి పట్టణానికి చెందినవాడు కాగా.. అక్కడి జిల్లా పోలీసులకు శ్రద్ధా వాకర్ లేఖ రాసింది. పోలీసులు చర్యలు తీసుకోకుంటే తనకు హాని జరిగే అవకాశముందని లేఖలో తెలిపింది. 2020 నవంబరు 23 తేదీ ఉన్న లేఖలో గత 6 నెలలుగా తనను అఫ్తాబ్‌ కొడుతున్నాడని పేర్కొంది.

"అఫ్తాబ్ నన్ను కొడుతున్నాడు. నన్ను కట్టేసి ఊపిరాడకుండా చేశాడు. చంపేసి ముక్కలుగా నరికేసి పారేస్తానని బెదిరించాడు. ఒకవేళ నాకు ఏదైనా జరిగితే దానికి కారణం అతడే. నన్ను చంపుతాడన్న భయంతోనే పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెనకాడాల్సి వస్తోంది. నన్ను అఫ్తాబ్ కొడుతున్నట్లు, చంపడానికి ప్రయత్నాలు చేసినట్లు నా తల్లిదండ్రులకు కూడా తెలుసు.

వారంతంలో అఫ్తాబ్‌ తలిదండ్రులు మా వద్దకు వచ్చేవారు. పెళ్లి చేసుకుందామనే ఉద్దేశంతోనే అతడితో కలిసి ఉంటున్నా. కానీ ఇకపై అతడితో జీవించాలని లేదు.`` అని ఆ లేఖ‌లో శ్ర‌ద్ధా వివ‌రించింది. అయితే, దీనిపై పోలీసులు క‌నీస విచార‌ణ కూడా జ‌ర‌ప‌లేదు.

తాజాగా మాత్రం.. శ్రద్ధా వాకర్ ఈ లేఖ రాసిన విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు. ఆమె పొరుగు వ్యక్తి ద్వారా తమకు లేఖ అందిందని తెలిపారు. మరోవైపు, ఢిల్లీ కోర్టు అఫ్తాబ్‌ పాలిగ్రాఫ్ పరీక్షకు అనుమతించింది. మంగళవారమే పరీక్షలను నిర్వహించినట్లు.. రోహిణిలోని ఫోరెన్సిక్ సైన్స్‌ ల్యాబరేటరీలోని సహాయ డైరెక్టర్‌ ధ్రువీకరించారు. పాలిగ్రాఫ్‌ పరీక్ష ఫలితాలు రావడానికి వారం రోజులు పడుతుందని చెప్పారు. రక్తపోటు, నాడి కొట్టుకునే వేగం, ఊపిరి తీసుకునే పరిణామాల ఆధారంగా అడిగే ప్రశ్నలకు నిందితుడు సరైన సమాధానం చెప్పాడో లేదో పాలిగ్రాఫ్‌ టెస్ట్ వెల్లడిస్తుంది.

మే 18న శ్రద్ధను హత్యచేసి ఆమె మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో పెట్టినట్లు పోలీసుల విచారణలో అఫ్తాబ్ అంగీకరించాడు. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఢిల్లీలోని వేర్వేరు ప్రాంతాల్లో అర్ధరాత్రి తర్వాత ఆమె శరీర భాగాలను పారేసినట్లు చెప్పాడు. శ్రద్ధావాకర్‌ శరీర భాగాల కోసం గాలిస్తున్న పోలీసు అధికారులు ఇప్పటికే కొన్ని ఆనవాళ్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని నిర్ధరించుకునేందుకు డీఎన్ఏ పరీక్షలకు పంపారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.