Begin typing your search above and press return to search.

జనసేన ‘గాజు గ్లాస్’కు ఓటేయాలా? వద్దా?

By:  Tupaki Desk   |   28 April 2021 3:00 PM IST
జనసేన ‘గాజు గ్లాస్’కు ఓటేయాలా? వద్దా?
X
జనసేన చేతిలోంచి ‘గాజు గ్లాస్’ చేజారిపోయింది.. పగిలిపోయింది కూడా. అటు తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీకి దూరమైన జనసేన పార్టీ మొదటి సారి గాజు గ్లాస్ కోల్పోయింది.

ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ పెట్టాక ఎన్నికల్లో పోటీచేయాలి.. పోటీచేశాక కనీసం ఈసీ నిర్ధేశించినన్నీ ఓట్లు, సీట్లు గెలవాలి. అప్పుడే ఎన్నికల కమిషన్ ఆ పార్టీ దరఖాస్తుచేసుకున్నప్పుడు కేటాయించిన గుర్తును దానికే ఇస్తుంది. మరో పార్టీకి ఇవ్వదు.

కానీ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన జనసేన కేవలం 1 అసెంబ్లీ స్థానం మాత్రమే గెలిచింది. ఈసీ నిర్ధేశించిన ఓట్ల శాతాన్ని పొందలేదు. ఇక తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీచేయకుండా బీజేపీకి మద్దతు ఇచ్చింది. దీంతో జనసేన నుంచి గాజు గ్లాసు గల్లంతైంది. తిరుపతి ఉప ఎన్నికల్లో మరో అభ్యర్థిగా ఈ గుర్తును కేటాయించింది.

ఇక తెలంగాణలోనూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీచేయకుండా బీజేపీకి మద్దతు ఇచ్చి జనసేన వైదొలగడం ఆ పార్టీకి శరాఘాతమైంది. దీంతో తెలంగాణ ఎన్నికల సంఘం కూడా జనసేన గాజు గ్లాస్ గుర్తును రద్దు చేసింది.

తాజాగా గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ బీజేపీతో కలిసి పోటీచేస్తోంది. అయితే యథాలాపంగా జనసేన పార్టీ ఓ ట్వీట్ చేసింది. ‘తొలిసారిగా పోటీచేస్తున్న జనసేన పార్టీ అభ్యర్థులను ‘గాజు గ్లాసు’ గుర్తుపై ఓటేసి గెలిపించాలని.. తెలంగాణ ప్రజల కోసం పనిచేసే జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించాలని’ పిలుపునిచ్చింది.

ట్విస్ట్ ఏంటంటే తెలంగాణలో అసలు జనసేన గుర్తింపు పొందిన పార్టీ కాదు.. ఎందుకంటే సరియైన ఓట్లు, సీట్లు ఇంతవరకు ఆ పార్టీ తెచ్చుకోలేదు. దీంతో కామన్ గుర్తు అయిన గాజు గ్లాస్ ఆ పార్టీకి దక్కదు.

గత ఏడాది జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం స్థానాల్లో కనీసం 10శాతం సీట్లకు పోటీచేయని కారణంగా జనసేనతోపాటు పలు పార్టీలు గుర్తులను కోల్పోయినట్టు తెలంగాణ ఎస్ఈసీ ప్రకటించారు. 2025 నవంబర్ వరకు ఆ పార్టీలు కామన్ సింబల్ కోసం దరఖాస్తు చేసుకునే అర్హత లేదు.

జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు ఇప్పుడు లేదు. ఆ పార్టీకి ఈ ఎన్నికల్లో అదే గుర్తు వస్తుందన్న గ్యారెంటీ లేదు. అందరు స్వతంత్రులకు వచ్చినట్టే ఏదైనా గుర్తు ఇస్తారు. గాజు గ్లాసు ఇవ్వొచ్చు. మరి ఇలాంటి వేళ ‘గాజు గ్లాసు’కే ఓటేయాలని జనసేన పిలుపు ఇవ్వడం వ్యర్థం. ఎందుకంటే ఆ గుర్తు రాకపోతే జనసేనకే భారీ నష్టం. వేరే వారికి ఓట్లు పడుతాయి. గుర్తు కేటాయించాక జనసేన పార్టీ ప్రచారం చేసుకుంటే బెటర్ అని సూచిస్తున్నారు.