Begin typing your search above and press return to search.

మోడీతో ముఖాముఖి తేల్చుకునేందుకు రెఢీ!

By:  Tupaki Desk   |   29 March 2019 5:31 AM GMT
మోడీతో ముఖాముఖి తేల్చుకునేందుకు రెఢీ!
X
సినిమా కానీ రాజ‌కీయం కానీ ఎంట్రీ అదిరిపోయేలా ఉండాలి. అంద‌రి నోట నానాలి. అంత‌కు మించి హాట్ టాపిక్ గా మారాలి. కాంగ్రెస్ పార్టీ.. శ్రేణులు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న ప్రియాంకా వాద్రా పొలిటిక‌ల్ ఎంట్రీ అంత ఆస‌క్తి చూపేలా.. హైప్ క్రియేట్ అయ్యేలా లేద‌న్న మాట వినిపిస్తున్న‌దే. మొన్న‌టి వ‌ర‌కూ ప్రియాంక మీద కాంగ్రెస్ శ్రేణులు చాలానే అంచ‌నాలు పెట్టుకున్నాయి. ఆమె ఎంట్రీ ఇవ్వ‌టంతోనే.. యావ‌త్ దేశం ఆమె గాలి వీస్తుంద‌ని.. అంద‌రి మ‌న‌సుల్ని దోచేస్తార‌న్న వాద‌న‌లు వినిపించాయి.

కానీ.. అలాంటిదేమీ లేద‌న్న విష‌యం ఆమె ఎంట్రీ ఇచ్చిన తొలి వారంలోనే తేలిపోయింది. ప్రియాంక నోటి వెంట మాట వ‌స్తే చాలు.. చెల‌రేగిపోయి క‌వ‌రేజ్ ఇచ్చే మీడియా.. తాజాగా ఆమెకు ఇస్తున్న ప్రాధాన్య‌త ఎంత‌న్న విష‌యం తెలిసిందే. అయితే.. ఇలాంటివేమీ ప‌ట్టించుకోన‌ట్లుగా వెళుతున్న ప్రియాంక తాజాగా చేసిన వ్యాఖ్య ఒక‌టి ఆమెను హెడ్ లైన్స్ లోకి తెచ్చేలా చేసింది.

కొండ‌ను ఢీ కొనేందుకు రెఢీ అన్న విష‌యాన్ని స్ప‌ష్టం చేయ‌ట‌మే కాదు..మిగిలిన వారి మాదిరి ప్రియాంక కాద‌న్న విష‌యం తాజా వ్యాఖ్య‌తో అర్థ‌మ‌య్యేలా చేశార‌ని చెప్పాలి. తాజాగా త‌న కార్య‌క‌ర్త‌ల‌తో ప్రియాంక చేసిన వ్యాఖ్య‌లు దేశ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు.. అంద‌రి దృష్టి ఆమె ప‌డేలా చేసుకున్నార‌ని చెప్పాలి. పార్టీ అదేశిస్తే తాను పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని చెప్పిన మర్నాడే.. మోడీ మీద వార‌ణాసిలో పోటీ చేసేందుకు తాను రెఢీ అంటూ చెప్పిన మాట సంచ‌ల‌నంగా మారింది.

లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు తాను సిద్ద‌మ‌న్న ప్రియాంక.. పార్టీ ఆదేశిస్తే ఎన్నిక‌ల్లో పోటీకి రెఢీ అన్న ఆమె.. ఎక్క‌డి నుంచి పోటీ చేస్తార‌న్న ప్ర‌శ్న‌కు వార‌ణాసి ఎందుకు కాకూడ‌ద‌ని ప్ర‌శ్నించ‌టం ద్వారా ఆశ్చ‌ర్యానికి గురి చేశారు. రాయ‌బ‌రేలిలో నిర్వ‌హించిన కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో మాట్లాడిన ఆమె ఈ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

రాయ్ బ‌రేలీలో ప‌నుల‌కు ఆటంకం క‌లగ‌కుండా చూసుకుంటాన‌ని త‌న త‌ల్లి సోనియాకు మాట ఇచ్చాన‌ని.. ప్ర‌ధాని మోడీ వార‌ణాసి నుంచి పోటీ చేస్తున్న నేప‌థ్యంలో అదే స్థానం నుంచి తాను ఎందుకు బ‌రిలోకి దిగ‌కూడ‌ద‌ని ఆమె ప్ర‌శ్నించ‌టం గ‌మ‌నార్హం.

ప్రియాంక చెప్పిన‌ట్లుగా ఆమె కానీ వార‌ణాసి బ‌రిలో నుంచి మోడీకి పోటీగా దిగితే.. దేశం మొత్తంలోనే అత్యంత పెద్ద ఎన్నిక ఇదే అవుతుంది. బిగ్ ఫైట్ అనే ప‌దానికి అస‌లుసిస‌లు అర్థంగా నిల‌వ‌టం ఖాయం. మాట చెప్పినంత సింఫుల్ గానే.. మోడీ మీద పోటీకి ప్రియాంక రెఢీ అవుతారా? అన్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా నిలిచింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.