Begin typing your search above and press return to search.

బాబు.. జగన్ లకు ఢిల్లీ ఫోన్లు రావా... ?

By:  Tupaki Desk   |   15 Feb 2022 8:33 AM GMT
బాబు.. జగన్ లకు ఢిల్లీ ఫోన్లు రావా... ?
X
రెండు తెలుగు రాష్ట్రాలలో రెండు రకాల రాజకీయం సాగుతోంది. తెలంగాణాలో చూస్తే బీజేపీ మీద ఒక్క లెక్కన మండిపోతున్నారు కేసీయార్ మండిపడుతున్నారు. దేశంలో మోడీ లేని రాజ్యం తెస్తామని గట్టిగా చెబుతున్నారు. 2024 నాటికి మోడీని మాజీ ప్రధానిగా చేస్తామని కూడా కేసీయార్ ఢంకా భజాయిస్తున్నారు.

దాంతో కేసీయార్ తో దేశంలోని ఇతర ప్రాంతీయ పార్టీల నేతలు తెగ ఫోన్లు చేస్తున్నారు. కేసీయార్ తానుగానే దీని మీడియా ముందుకు వచ్చి మరీ తమిళనాడు నుంచి సీఎం స్టాలిన్ ఫోన్ చేశారని, ఇక మమతా బెనర్జీ కూడా ఫోన్లో మాట్లాడుతున్నారని, మహారాష్ట్రా సీఎం ఉద్ధవ్ థాకరే తో పాటు కేజ్రీ వాల్ వంటి సీఎంల నుంచి ఫోన్లు వస్తున్నాయని చెబుతున్నారు.

కేసీయార్ ఒక్కసారిగా దేశ రాజకీయాల్లో హైలెట్ అవుతున్నారు. దానికి కారణం అందరూ మోడీని విమర్శిస్తున్నారు కానీ పాయింట్ టూ పాయింట్ గా అన్నీ విడమరచి చెప్పి విమర్శించడంతో కేసీయార్ దిట్ట. దాంతో కేసీయార్ వైపు అందరూ చూస్తున్నారు. త్వరలో ఆయన ఢిల్లీ వెళ్లి అందరితో ముఖస్థంగా కూడా మాట్లాడేందుకు రెడీ అవుతున్నారు.

మరి ఈ టైమ్ లో మరో తెలుగు రాష్ట్రంలో తీరు చూస్తే కంప్లీట్ భిన్నంగా ఉంది. అక్కడ రాజకీయ ఉద్ధండుడు చంద్రబాబు ఉన్నారు. ఆయనకు జాతీయ స్థాయిలో ఎందరో నేతలతో మంచి పరిచయాలు ఉన్నాయి. కానీ ఇపుడు అంతా కేసీయార్ కి ఫోన్ చేస్తున్నారు. మరి చంద్రబాబుకు ఫోన్లు రావడం లేదా అంటే ఆలోచించాలి.

బాబు లాంటి సీనియర్ మోస్ట్ లీడర్ ను తెలుగు రాష్ట్రాల్లో ఉంచుకుని కూడా కేసీయార్ కి ఫోన్లు వెళ్తున్నాయి అంటే అది ఆసక్తిని రేపే విషయమే మరి. బాబు ఇపుడు ఏపీలో విపక్ష నేతగా ఉన్నారు. ఆయన అధికారంలో లేరు. దానికి తోడు బీజేపీని పల్లెత్తు మాట అనడంలేదు. ఇక ఆయన ఫస్ట్ టార్గెట్ జగన్ కానీ మోడీ కాదు, ముందు కుర్చీ దింపాల్సి వస్తే అది జగన్ దే తప్ప కేంద్రంలోని పీఎం పోస్టుది కాదు.

అందుకే బాబు వైపు ఎవరూ తొంగి చూడడంలేదని ప్రచారం సాగుతోంది. పోనీ జగన్ అధికారంలో ఉన్నారు కదా. ఆయనకు ఏమైనా ఫోన్లు వస్తున్నాయా అంటే ఆ మధ్య దాకా స్టాలిన్, మమతా బెనర్జీ వంటి వారు లేఖలు రాసేవారు. కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం చేయమని కోరేవారు. మరి వైసీపీ నుంచి పెద్దగా రెస్పాన్స్ రాకపోయేసరికి అవన్నీ ఆగిపోయాయని అంటున్నారు. అలాగే చూసుకుంటే రాజ్యసభలో మోడీ సర్కర్ పెట్టిన అన్ని బిల్లులకూ బే షరతుగా వైసీపీ మద్దతు ఇస్తోంది.

ఆ సంగతికి కేంద్ర మంత్రి రామ్ దాస్ ఈ మధ్య విజయవాడలోనే చెప్పేశారు. మాకు మంచి మిత్రుడు జగన్ అని కూడా అన్నారు. మరి ఇలా చెప్పేశాక వైసీపీకి ఢిల్లీ లోని అపోజిషన్ లీడర్స్ నుంచి ఫోన్లు వస్తాయా అంటే రావు కాక రావు. మొత్తానికి చూస్తే జాతీయ స్థాయిలో మోడీకి వ్యతిరేకంగా కూటమి కట్టాలీ అన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది. మోడీని దించేయాలీ అన్న పెద్ద టాస్క్ ని నేతలు అంతా భుజాలకు ఎత్తుకుంటున్నారు. ఈ అద్భుతమైన రాజకీయ ప్రయోగంలో ఏపీకి చోటు లేదా లేక దూరం పెట్టారా అంటే దానికి రాజకీయ పరిస్థితులే కారణం అనుకోవాలి.