Begin typing your search above and press return to search.

రోటీన్ కు భిన్నంగా ఈ షాపింగ్ వేళా.. నచ్చింది తీసుకెళ్లిపోవచ్చు

By:  Tupaki Desk   |   31 Oct 2020 11:30 AM IST
రోటీన్ కు భిన్నంగా ఈ షాపింగ్ వేళా.. నచ్చింది తీసుకెళ్లిపోవచ్చు
X
మహానగరాల్లో షాపింగ్ మేళాలు నిర్వహించటం పెద్ద విషయమే కాదు. బోలెడన్ని కనిపిస్తుంటాయి. ఊరించే ఈ వస్తు సముదాయాన్ని సొంతం చేసుకోవాలంటే జేబులో నుంచి పర్సు బయటకు తీయాల్సిందే. అందుకు భిన్నం.. ఇప్పుడు చెప్పే షాపింగ్ మేళా. ఈ మేళాలో ఏర్పాటు చేసిన 170 వస్తువుల్లో నచ్చింది తీసుకెళ్లిపోవచ్చు. అది కూడా ఉచితంగా. కాకుంటే.. కండీషన్లు అప్లై అవుతాయి. అదెలానంటే..

హైదరాబాద్ ను ముంచెత్తిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన వారు లక్షల్లో ఉన్నారు. భారీగా నష్టపోయిన వారు వేలల్లో ఉండటం.. అలాంటి వారికి సహాయ చర్యలు చేపట్టేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. మూసీ.. దాని పరివాహక ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వేలాది ఇళ్లు వరద కారణంగా దెబ్బ తిన్నాయి. ఇంట్లోని వస్తువులు చాలానే వరద నీటికి కొట్టుకుపోయాయి. ఇలాంటివేళ.. బాధితుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం పరిహారాన్ని ప్రకటించటం తెలిసిందే.

వరద నీటి ప్రభావితమైన ప్రతి కుటుంబానికి రూ.10వేలు సాయాన్ని ఇవ్వటం.. ఆ సందర్భంగా నిర్వహించే సర్వేలో.. నష్టాన్ని లెక్కించి.. రూ.50వేలు.. రూ.లక్ష మొత్తాన్ని ఇవ్వాలన్నది అధికారులు నిర్ణయిస్తారు. అయితే.. మొదట ఇచ్చే రూ.10వేల పరిహారంపై స్థానిక నేతలు కన్నేయటం.. అధికారులు తీరుపై ఆరోపణలు చేస్తూ.. బాధితులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్న వైనం తెలిసిందే.

ప్రభుత్వ వ్యవహారం ఇలా ఉంటే.. కొన్ని స్వచ్ఛంద సంస్థలు వినూత్నంగా వ్యవహరిస్తున్నాయి. బాధితుల కష్టాలకు తాము అండగా నిలుస్తామనన విషయాన్ని వినూత్నంగా చెబుతున్నాయి. అలాంటి వాటిల్లో ఒకటి సఫా బైతుల్ మాల్. బాలాపూర్ లోని పెరల్స్ గార్డెన్ లో గడిచిన మూడు రోజులుగా వినూత్నమైన షాపింగ్ మేళాను నిర్వహించారు. ఇందులో వరద బాధితులకు అవసరమూన దాదాపు 170 వస్తువుల్ని ఏర్పాటు చేశారు.

బాధితులను ఆదుకునే ప్రయత్నంలో భాగంగా.. తాము సాయం చేయాలనుకున్న ప్రాంతంలో ఈ సంస్థ సమగ్ర సర్వేను నిర్వహించింది. ఒక్కో ఇంటికి కలిగిన నష్టాన్ని అంచనా వేసి.. రూ.5వేలు.. రూ.10 వేలు చొప్పున కూపన్లు ఇచ్చారు. ఆ కూపన్ల మొత్తానికి సరిపడే వస్తువుల్ని.. షాపింగ్ మేళాలోని వస్తువుల్ని తీసుకెళ్లేలా ఏర్పాటు చేశారు. దీంతో.. పరిహారం సొమ్ము పక్కదారి పట్టకుండా ఉండటం.. బాధితులు ఎవరికి వారు.. తమకు అవసరమైన వాటిని షాపింగ్ చేసుకొని వెళ్లేలా ప్లాన్ చేశారు.

మేళాలో.. వంట సామాన్లు మొదలు దుప్పట్ల వరకు అన్నింటిని ఈ మేళాలో ఏర్పాటు చేశారు. ఒక అంచనా ప్రకారం.. బాధితులకు సాయం చేసేందుకు దాదాపు రూ.50 లక్షల విలువైన వస్తువుల్నిఏర్పాటు చేసినట్లుగా చెబుతున్నారు. మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ మేళ తాజాగా ముగిసింది. రానున్న రోజుల్లో మరికొన్ని ప్రాంతాల్లో ఈ తరహా మేళాల్ని నిర్వహిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. విపత్తు వేళ.. బాధితులకు అందిస్తున్న అపన్న హస్తం వినూత్నంగా ఉంది కదూ?