Begin typing your search above and press return to search.

ప్రమాదంలో మరణించిన జూనియర్ ఆర్టిస్టు ఫ్యామిలీ గురించి తెలిస్తే షాకే

By:  Tupaki Desk   |   20 Dec 2021 9:11 AM IST
ప్రమాదంలో మరణించిన జూనియర్ ఆర్టిస్టు ఫ్యామిలీ గురించి తెలిస్తే షాకే
X
కన్న కలల్ని సాకారం చేసుకోవటానికి.. ఆశల్ని సొంతం చేసుకోవటానికి తెలుగు వారికి ఉన్న ఒక అవకాశాల గనిగా హైదరాబాద్ ను అభివర్ణిస్తారు. చేతిలో చిల్లిగవ్వ లేకుండా.. భాగ్యనగరికి వచ్చి.. భాగ్యవంతులుగా మారిన వారెందరో. ఆశల ప్రపంచంగా చెప్పే ఈ మహానగరంలో కొందరు విజేతలుగా నిలిస్తే.. మరికొందరు పరాజితులు అవుతుంటారు. తాము వచ్చిన లక్ష్యాన్ని మరచిపోకుండా ఉన్న వారందరిని విజేతలుగా నిలపటం హైదరాబాద్ ప్రత్యేకతగాచెప్పాలి. అందరిని ఆశ్చర్యానికి.. ఆ మాటకు వస్తే షాక్ కు గురి చేసిన గచ్చిబౌలి యాక్సిడెంట్ లో మరణించిన జడ్చర్లకు చెందిన మానస గురించిన వివరాలు తెలిస్తే నోట మాట రాదంతే.

బుల్లితెర మీద వెలిగిపోవాలని కోటి ఆశలతో నగరానికి వచ్చిన ఆమె.. చేతులారా చేసుకున్న తప్పునకు ప్రాణాలు పోగొట్టుకున్నారు. స్నేహితులతో మద్యం తాగి.. అర్థరాత్రి వేళ లాంగ్ డ్రైవ్.. టీ తాగాలన్న కోరికతో బయటకు వచ్చిన మానస.. ఆమె స్నేహితులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన మహబూబ్ నగర్ జిల్లా బాదేపల్లిలోని పాతబజార్ కు చెందిన 21 ఏళ్ల మానస.. ఆమె కుటుంబం గురించి తెలిసిన వారంతా అవాక్కు అవుతున్నారు.

ప్రమాదంలో మరణించిన మానస వాళ్లది నిరుపేత కుటుంబమని స్థానికులు చెబుతున్నారు. ఆరేళ్ల క్రితం ఆమె తల్లి బాలమణి నేషనల్ హైవే మీద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. తండ్రి రవీందర్ స్థానికంగా ఉన్న ఒక పెట్రోల్ బంకులో పని చేసే వారు. ఆమె అక్క వైష్ణవి కొరియర్ ఆఫీసులో చిరుద్యోగిగా పని చేస్తుంటారు. ఈ క్రమంలో పదో తరగతి వరకు చదివిన మానస.. బుల్లితెర మీద వెలిగిపోవాలని బలంగా కోరుకున్నారు. దీంతో.. హైదరాబాద్ కు వచ్చిన ఆమె.. పలు షార్ట్ ఫిలింస్ లో నటించారని.. షూటింగ్ లు లేనప్పుడు ఇంటికి వచ్చేదని ఆమె గురించి తెలిసిన వారు చెబుతున్నారు.

మొన్నీమధ్యనే ఇంటికి వచ్చి నాలుగు రోజులు ఉన్న ఆమె.. శుక్రవారం మధ్యాహ్నమే ఇంటి నుంచి బయలుదేరి హైదరాబాద్ కు వెళ్లారని చెబుతున్నారు. ఈ మధ్యనే వారున్న చిన్న రేకుల ఇంటికి రిపేర్లు చేయించి.. రంగులు వేయించినట్లు చెబుతున్నారు. ఇంటికి వచ్చిన సందర్భంగా ఆమె తండ్రి చేతికి గాయమైతే.. తానే దగ్గరుండి చేతికి కట్టు కట్టి వైద్యం చేసినట్లుగా ఆమె తండ్రి రోదిస్తూ చెబుతున్నారు. శుక్రవారం రాత్రికి హైదరాబాద్ కు చేరుకున్న ఆమె.. ఒక రోజు తేడాతో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిన వైనం గురించి తెలిసి భోరుమని విలపిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే రోడ్డు ప్రమాదంలో మరణించిన మానస ఇంటి ఆర్థిక దుస్థితి గురించి తెలిస్తే.. అయ్యో అనుకోకుండా ఉండలేం. ఎందుకంటే.. ఆమె అంత్యక్రియలకు అవసరమైన డబ్బులు కూడా లేవన్న విషయాన్ని ఆమె తండ్రి చెప్పలేక చెప్పుకోవటం చూస్తే.. అయ్యో అనిపించకమానదు.