Begin typing your search above and press return to search.

భర్త రోడ్డు ప్రమాదంలో షాకింగ్ ట్విస్ట్.. భార్యే ఘాతుకం?

By:  Tupaki Desk   |   31 Oct 2020 9:40 PM IST
భర్త రోడ్డు ప్రమాదంలో షాకింగ్ ట్విస్ట్.. భార్యే ఘాతుకం?
X
అతడి భార్య ఎఫైర్ పెట్టుకుంది. వివాహేతర సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది. యూపీ సుపారీ గ్యాంగ్ తో భర్తను తెలివిగా చంపించింది. డీసీఎం వ్యాన్ తో భర్తను ఢీకొట్టించి చంపించింది. దీన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. అయితే పోస్టుమార్టంలో అసలు విషయం తెలిసి ప్రియుడు, భార్య కటకటాల పాలయ్యారు.

మేలో జరిగిన ఈ క్రైంలో సుపారీ గ్యాంగ్ లో ఉండి ఇన్నాళ్లు పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను సైబరాబాద్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. బాలానగర్ డీసీపీ పద్మజ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.

జీడిమెట్లకు సమీపంలోని ‘దుండిగల్ తండా-2’కు చెందిన భార్యాభర్తలు అన్యోన్యంగా జీవిస్తున్నారు. స్థానికంగా ఉండే ఒక యువకుడితో భార్యకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన భర్త తన భార్యను తీవ్రంగా మందలించాడు. ప్రవర్తనలో అయినా మార్పులేని భార్య ప్రియుడితో కలిసి కుట్రపన్నింది. భర్త అడ్డు తొలిగించుకోవాలని చూసింది.

ప్రియుడికి పరిచయస్తులైన వ్యక్తుల ద్వారా ఉత్తరప్రదేశ్ కు చెందిన సుపారీ గ్యాంగ్ ను రంగంలోకి దింపారు. వారికి రూ. లక్ష సుపారీ కూడా ఇచ్చారు. మే 16న బైక్ పై వస్తున్న భర్తను హత్య చేయాలని భావించగా ప్లాన్ ఫెయిల్ అయ్యింది. మే 23న రెండోసారి రోడ్డంతా నిర్మానుష్యంగా ఉండగా.. బైక్ వస్తున్న భర్తను డీసీఎం వ్యాన్ తో సుపారీ గ్యాంగ్ ఢీకొట్టింది. తీవ్రగాయాలతో రోడ్డుపక్కన పొదల్లో పడిపోయిన భర్తను అప్పటికే అక్కడ కాపుకాసిన సుపారీ గ్యాంగ్ లోని ఇద్దరు కారులో ఆస్పత్రికి తరలించారు. ఆ మధ్యలోనే ముక్కు, నోరు మూసేసి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఆస్పత్రికి వెళ్లిన వైద్యులు పరీక్షించి మృతి చెందినట్టు తెలిపారు. మేడ్చల్ పోలీసులు మొదట యాక్సిడెంట్ కేసుగా నమోదు చేశారు.

అయితే పోస్టుమార్టం రిపోర్టులో ఊపిరాడకుండా చేయడంతో సురేష్ మృతి చెందినట్లు రావడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. భార్యతోపాటు కారులో తీసుకొచ్చిన వారిపై నిఘా పెట్టారు. భార్య ప్రవర్తనలో మార్పు చూసి విచారించగా సుపారీ గ్యాంగ్ తో హత్య చేయించినట్లు ఆమె ఒప్పుకుంది. ఈ హత్యలో మొత్తం 8మంది పాల్గొన్నట్లు నిర్ధారించింది. పారిపోయిన ఇద్దరినీ పట్టుకొచ్చి అరెస్ట్ చేశారు. ఇలా ప్రియుడి మోజులో పడి భార్తనే కడతేర్చింది భార్య.