Begin typing your search above and press return to search.

అన్ని ఛానళ్ల లైసెస్సులు రద్దు చేశారట

By:  Tupaki Desk   |   3 Aug 2021 3:54 AM GMT
అన్ని ఛానళ్ల లైసెస్సులు రద్దు చేశారట
X
వేళ్ల మీద లెక్క పెట్టే టీవీ ఛానళ్లు ఉండటం ఒకప్పటి మాట. ఇప్పుడు కాలం మారిపోయింది. అందుకు తగ్గట్లే ఛానళ్ల జోరు పెరిగిపోయింది. గతానికి భిన్నంగా ఇప్పుడు టీవీ ఓపెన్ చేస్తేచాలు.. చానళ్ల వరద పారుతుంది. ఒక్కో భాషలోనే పదుల సంఖ్యలో ఛానళ్లు దర్శనమిస్తున్నాయి. తెలుగు విషయానికి వస్తే.. ఎంటర్ టైన్ మెంట్ ఛానళ్లను తక్కువే ఉన్నా.. న్యూస్ ఛానళ్ల విషయానికి వస్తే రెండు డజన్లకు దగ్గర దగ్గర ఉన్న పరిస్థితి. ఇక.. వీటికి అదనంగా ఉన్న యూట్యూబ్ చానళ్లను అయితే లెక్క పెట్టలేనన్ని అన్నట్లుగా ఉంది.

దేశ వ్యాప్తంగా ప్రైవేట్ శాటిలైట్ ఛానళ్లు ఇప్పుడు 916 ఉన్నాయి. అయితే.. గడిచిన నాలుగేళ్ల కాలంలో నిబంధనల్ని ఉల్లంఘించిన ఛానళ్ల లైసెన్సుల్ని రద్దు చేస్తూ కఠినంగా వ్యవహరించింది కేంద్ర ప్రభుత్వం. తాజాగా అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు. 2016-20 మధ్య కాలంలో దేశంలోని 204 ప్రైవేటు ఛానళ్ల లైసెన్సుల్ని రద్దు చేసినట్లుగా ప్రకటించింది. మరో 128 కేసులకు సంబంధించి ఛానళ్లకు వార్నింగ్ లు జారీ చేసింది.

నిబంధనల్ని పాటించని కారణంగానే 204 ఛానళ్ల అనుమతుల్ని తొలగించినట్లు చెప్పారు. అదే సమయంలో ఏ ఏడాదికి ఆ ఏడాది కొత్త ఛానళ్లకు ఇస్తున్న అనుమతుల గురించి వెల్లడించారు. ఆసక్తికరంగా 2016-17 లో అత్యధికంగా 60 ఛానళ్లకు అనుమతిని ఇస్తే.. 2017-18లో మాత్రం 34 ఛానళ్లకు మాత్రమే అనుమతులు వచ్చాయి. ఆ తర్వాతి ఏడాది 2018-19లో మాత్రం 56 ఛానళ్లకు అనుమతులు లభించాయి. 2020-21లో 22 ఛానళ్లకు అనుమతులు వచ్చినట్లు వెల్లడించారు.

ఇదిలా ఉంటే.. సక్రమమైన అనుమతులు లేకుండా నడుస్తున్న 24 ఫేక్ యూనివర్సిటీలను యూజీసీ గుర్తించినట్లు కేంద్ర విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. విద్యార్థులు.. తల్లిదండ్రులు.. ప్రజల ద్వారా తమ వరకు వచ్చిన ఫేక్ వర్సిటీలను చెల్లవని చెప్పినట్లు పేర్కొన్నారు. ఫేక్ వర్సిటీల్లో ఉత్తరప్రదేశ్ కు చెందిన ఎనిమిది.. ఢిల్లీకి సంబంధించి ఏడు.. పశ్చిమ బెంగాల్ కు సంబంధించి రెండు.. ఒడిశాకు చెందిన రెండు వర్సిటీలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఏపీలోని క్రైస్ట్‌ న్యూ టెస్టమెంట్‌ డీమ్డ్‌ యూనివర్సిటీని ఫేక్ వర్సిటీగా తేల్చారు. సో.. ప్రైవేటు వర్సిటీల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్న విషయాన్ని తాజా ఉదంతం స్పష్టంచేస్తుందని చెప్పాలి.