Begin typing your search above and press return to search.

సిద్దిపేటలో షాకింగ్ సీన్.. రిజిస్ట్రార్ ఆఫీసు వద్ద కాల్పులతో దోచేశారు

By:  Tupaki Desk   |   1 Feb 2022 4:38 AM GMT
సిద్దిపేటలో షాకింగ్ సీన్.. రిజిస్ట్రార్ ఆఫీసు వద్ద కాల్పులతో దోచేశారు
X
షాకింగ్ సీన్ ఒకటి చోటు చేసుకుంది. ఇందుకు సిద్ధిపేట పట్టణం కేంద్రమైంది. రీల్ సీన్ ను తలపించేలా ఉన్న ఈ రియల్ సీన్ ఇప్పుడు సంచలనంగా మారటమే కాదు.. దోపిడీ దొంగల బరి తెగింపు ఏమాత్రం జీర్ణించుకోలేని పరిస్థితి. చుట్టూ వందలాది మంది ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పిస్టల్ పేల్చి.. రూ.43.5 లక్షల మొత్తాన్ని దోచేసిన వైనం అక్కడి వారందరికి దిమ్మ తిరిగిపోయేలా చేసింది. బైక్ మీద వచ్చిన దుండగులు వచ్చీ రావటంతోనే పిస్టల్ తో కాల్పులు జరిపి.. మిగిలిన వారు తేరుకునే లోపే.. దోచేసి వెళ్లిపోవటం గమనార్హం.అసలేం జరిగిందంటే..

సిద్దిపేట జిల్లా చేర్యాలకు చెందిన నర్సయ్యకు స్థానిక హౌసింగ్ బోర్డులో ఓపెన్ ప్లాట్ ఉంది. దీన్ని తొగుట మండలానికి చెందిన శ్రీధర్ రెడ్డికి అమ్మారు. ఇందులో భాగంగా సిద్దిపేట సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ పెట్టుకున్నారు. అడ్వాన్సుగా ఇచ్చిన మొత్తాన్ని మినహాయిస్తే.. మొత్తం రూ.43.5 లక్షల క్యాష్ ను రిజిస్ట్రేషన్ కు కాస్త ముందుగా నర్సయ్యకు అప్పజెప్పారు. ఈ మొత్తాన్ని ఆయన తన కారులో పెట్టి డ్రైవర్ పరశురామ్ కు జాగ్రత్తలు చెప్పి.. సంతకం పెట్టేందుకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులోకి వెళ్లారు.

డ్రైవర్ పరశురాం కారు లోపల కూర్చున్న వేళ.. బైక్ మీద ఇద్దరు ఆగంతకులు వచ్చారు. కారు అద్దాలు దించాలన్నారు. వారి తీరుతో అనుమానం వచ్చిన డ్రైవర్ తలుపు తీయలేదు. ముందుజాగ్రత్తలో భాగంగా కారును స్టార్ట్ చేసి కాస్త ముందుకు వెళ్లాడు. దీంతో.. బైక్ మీద ఆగంతకుల్లో ఒకడు పిస్టల్ తో డ్రూవర్ వైపున్న కారు అద్దాన్ని పగలగొట్టి.. డబ్బున్న బ్యాగ్ ను తీసుకేళ్లే ప్రయత్నం చేశాడు. దీంతో డ్రైవర్ తొడపైన పిస్టల్ తో కాల్పులు జరిపాడు. మరో దుండగుడు వెనుక వైపు డోర్ నుంచి డబ్బుసంచీ తీసుకున్నాడు. ఆ పై వారిద్దరు బైక్ మీద పారిపోయారు. గాయాల బారిన పడ్డ డ్రైవర్..రిజిస్ట్రార్ ఆఫీసులోపలకు వెళ్లి.. యజమానికి విషయాన్ని చెప్పాడు.

ఇదిలా ఉంటే.. ఈ ఉదంతంపై బోలెడన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద మొత్తంలో డబ్బుచేతులు మారిందన్న విషయాన్ని పక్కాగా తెలుసుకొనే ఈ దారుణానికి తెగబడి ఉంటారని భావిస్తున్నారు. దీనిపై అమ్మేవారు కొనే వారి మీదా.. కొనేవారు అమ్మేవారి మీద అనుమానాలు వ్యక్తం చేస్తుంటే.. పోలీసులు.. అనుమానం ఉన్న ప్రతి అంశాన్ని విచారిస్తున్నారు. దుండగుల్ని పట్టుకునేందుు 15 టీంలను నియమించామని.. నిందితుల్ని 24 గంటల్లో పట్టుకుంటామని సిద్దిపేట సీపీ శ్వేత వెల్లడించారు. ఈ ఉదంతంతో రూ.43 లక్షల క్యాష్ మీద ఐటీ అధికారులు ఫోకస్ చేశారు. ఇంత భారీ మొత్తంలో లావాదేవీలు ఎలా జరిగాయన్నది ప్రశ్నగా మారింది. రూ.2లక్షల కంటే ఎక్కువ మొత్తంలో నగదు లావాదేవీలు జరపటం నేరమైన నేపథ్యంలో.. ఈ భారీ క్యాష్ గురించి ఆరా తీస్తున్నారు.