Begin typing your search above and press return to search.

ఏపీలో నేరాలపై షాకింగ్ రిపోర్టు.. అందులో ఏముందంటే?

By:  Tupaki Desk   |   1 Oct 2020 10:00 AM IST
ఏపీలో నేరాలపై షాకింగ్ రిపోర్టు.. అందులో ఏముందంటే?
X
ప్రతి ఏడాది జాతీయ స్థాయిలో జరిగే నేరాలు.. ఆయా రాష్ట్రాల వాటా ఏమిటన్న విషయాన్ని తెలియజేసే జాతీయ నేర గణాంక సంస్థ తాజాగా వార్షిక నివేదికను విడుదల చేసింది. 2019 సంవత్సరానికి చెందిన ఈ నివేదికలోని అంశాలు ఏమేం ఉన్నాయి? నేరాల్లో ఏపీ వాటా ఏమిటి? ఏ తరహా నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయన్న విషయాన్ని వివరించే ఈ నివేదికలోని అంశాలు షాకింగ్ గా ఉన్నాయని చెప్పక తప్పదు.

ఏపీలో ఎస్సీలపై నేరాలు పెద్ద ఎత్తున పెరిగిన వైనాన్ని తాజా రిపోర్టు స్పష్టం చేస్తోంది. ఎస్సీలపై నేరాలు జాతీయ సగటు కంటే ఏపీలోనే అధికంగా ఉండటం గమనార్హం. అంతేకాదు.. దేశ వ్యాప్తంగా ఎస్సీలపై జరిగిన నేరాల్లో 4.5 శాతం కేవలం ఏపీలోనే చోటు చేసుకున్నట్లుగా తేలింది. ఎస్సీలపై జరిగిన దాడుల్లో దేశ వ్యాప్తంగా ఏపీ ఆరోస్థానంలో నిలిచింది.

ఈ ఒక్క నేరాలే కాదు.. సైబర్ నేరాలు.. ఆర్థిక నేరాలు.. పెద్ద వయస్కులు.. మహిళలపై జరుగుతున్న నేరాలు గత ఏడాది కంటే ఎక్కువగా నమోదైన విషయం బయటకు వచ్చింది. కొంతలో కొంత ఊరటనిచ్చే అంశం ఏమంటే.. చిన్నారులపై నేరాలు తగ్గుముఖం పట్టినట్లుగా తేల్చారు. మానవ అక్రమ రవాణా విషయంలో మహారాష్ట్ర తర్వాత స్థానం ఏపీనేనని తేల్చారు. 2018తో పోలిస్తే 2019లో 1.16 శాతం నేరాల సంఖ్య పెరిగినట్లుగా తాజా నివేదిక స్పష్టం చేసింది.

మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే సంఘటనలు ఎక్కువగా ఏపీలోనే చోటు చేసుకున్నాయి. దేశ వ్యాప్తంగా ఈ తరహా ఘటనలు 6454 చోటు చేసుకుంటే.. ఒక్క ఏపీలోనే 1892 ఘటనలు ఉన్నాయి. ప్రతి లక్ష మంది మహిళలకు 7.2 నేరాలు జరుగుతున్నాయి. పని ప్రదేశాల్లోనూ.. ప్రజా రవాణాలోనూ నేరాలు పెరుగుతున్నాయి. 2019లో ఏపీలో 1086 అత్యాచార ఘటనలు జరగ్గా.. అందులో 1044 ఘటనల్లో నిందితులు బాధితులకు పరిచయస్తులే కావటం గమనార్హం. 89 ఘటనల్లో బాధితుల కుటుంబ సభ్యులే నిందితులు. హత్యలు.. అత్యాచారాలు..కిడ్నాప్ లాంటి హింసాత్మక నేరాల్లో స్వల్పంగా తగ్గుదల కనిపించింది. గత ఏడాదిలో ఏపీలో 870 హత్యలు జరిగితే.. అందులో 369 హత్యలకు కారణం వివాదాలేనని తేల్చారు.