Begin typing your search above and press return to search.

పిల్లల్ని క‌న‌డంలో పొదుపు పాటిస్తున్నార‌ట‌‌.. ఏపీలో మ‌రీ!

By:  Tupaki Desk   |   26 March 2021 9:00 AM IST
పిల్లల్ని క‌న‌డంలో పొదుపు పాటిస్తున్నార‌ట‌‌.. ఏపీలో మ‌రీ!
X
పెరుగుతున్న జీవ‌న వ్య‌వ‌యం ఓ వైపు.. త‌రుగుతున్న ఉపాధి అవ‌కాశాలు ఇంకో వైపు.. ఆల‌స్యంగా జ‌రుగుతున్న పెళ్లిళ్లు మ‌రోవైపు.. వీటితోపాటు ఇంకా ఏవేవో ప‌రిస్థితులు.. మొత్తానికి కార‌ణాలు ఏవైనా పిల్ల‌ల‌ను క‌నే విష‌యంలో జ‌నం పొదుపు పాటిస్తున్నారు. దేశంలో దక్షిణాదిన సంతానోత్ప‌త్తిరేటు త‌క్కువ‌గా ఉంటే.. సౌత్ లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మ‌రింత త‌క్కువ‌గా ఉంద‌ట‌. కేంద్ర రిజిస్ట్రార్ జ‌న‌ర‌ల్ నిర్వ‌హించిన స‌ర్వేలో ఈ వివ‌రాలు వెల్ల‌డ‌య్యాయి.

ఉత్త‌ర భార‌తంలో ఒక మ‌హిళ స‌గ‌ట‌ను 2.9 మందికి జ‌న్మ‌నిస్తుండ‌గా.. ద‌క్షిణాదిన త‌క్కువ‌గా ప్రాణంపోస్తున్నార‌ట‌. ముఖ్యంగా ఏపీలో సంతానోత్ప‌త్తి రేటు మ‌రింత త‌క్కువగా న‌మోద‌వుతోంద‌ట‌. జాతీయ స‌గ‌టు రేటు 2.2గా ఉంటే.. ఏపీలో కేవ‌లం 1.6గా న‌మోదైంద‌ని స‌ర్వే తెలిపింది.

ఇందులోనూ గ్రామీణ ప్రాంతాల్లో కాస్త ఎక్కువ‌గా 1.7 స‌గ‌టు ఉండ‌గా.. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ఇంకా త‌క్కువ‌గా 1.5 పున‌రుత్ప‌త్తి రేటు న‌మోదైంది. 2006-08 మ‌ధ్య‌కాలంలో న‌మోదైన రేటు క‌న్నా ఇది త‌క్కువ కావ‌డం గ‌మ‌నార్హం. అప్పుడు 1.9గా ఉన్న స‌గ‌టు.. ఇప్పుడు 1.6కు ప‌డిపోయింది.

దేశంలో 70 సంవ‌త్స‌రాల క్రితం ఒక్కో మ‌హిళ స‌గ‌టున ఆరుగ‌రికి జ‌న్మ‌నిచ్చేవార‌ని, ఇప్పుడు ఆ స‌గ‌టు 2.2కు ప‌డిపోయింద‌ని స‌ర్వే తేల్చి చెప్పింది. దీనికి సామాజిక‌, ఆర్థిక‌, వ్య‌క్తిగ‌త కార‌ణాలు చాలా ఉన్నాయ‌ని తెలిపింది. అయితే.. కార‌ణాలు ఏవైనా ఇలా.. సంతాన ఉత్ప‌త్తి రేటు త‌గ్గిపోతే ప‌లు స‌మ‌స్యలే వ‌స్తాయ‌ని ప్ర‌క‌టించింది.

ప‌నిచేసే యువ‌కుల సంఖ్య త‌గ్గిపోవ‌డం.. వృద్ధుల సంఖ్య త‌గ్గిపోవ‌డంతో స‌మ‌తుల్య‌త దెబ్బ‌తింటుందని నిపుణులు అభిప్రాయ ప‌డుతున్నారు. ఇది దేశ‌, రాష్ట్ర వృద్ధిరేటుపైనా ప్ర‌భావం చూపుతుంద‌ని చెబుతున్నారు.