Begin typing your search above and press return to search.

షాకింగ్‌ నివేదిక.. భారతదేశ అప్పులపై బాంబు పేల్చిన ఐఎంఎఫ్‌!

By:  Tupaki Desk   |   11 Nov 2022 12:30 PM GMT
షాకింగ్‌ నివేదిక.. భారతదేశ అప్పులపై బాంబు పేల్చిన ఐఎంఎఫ్‌!
X
భారతదేశ అప్పులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా భారతదేశ రుణభారం 2022 చివరికల్లా జీడీపీలో 84 శాతానికి చేరుకొంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) బాంబుపేల్చింది. 2016లో ఇది 68.9 శాతమే కావడం గమనార్హం.

ప్రస్తుతం భారతదేశ విత్తలోటు జీడీపీలో 10 శాతంగా ఉందని నిపుణులు సైతం చెబుతున్నారు. అందులో 6.5 శాతానికి కేంద్ర ప్రభుత్వం, మిగిలిన 3.5 శాతానికి రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యులని ఆర్థిక నిపుణులు వివరిస్తున్నారు. రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఆర్థిక స్తోమతను బట్టి వ్యవహరించకపోతే భావి తరాల నెత్తిన అప్పుల కొండ మోపినట్టేనని హెచ్చరిస్తున్నారు.

విత్తలోటు జీడీపీలో మూడు శాతానికి మించకుండా ఉంటేనే భారత్‌ ఆర్థిక సుస్థిరతను సాధించగలుగుతుందని అంటున్నారు. వివిధ రాష్ట్రాలు ఉచిత పథకాలు, సంక్షేమ పథకాల పేరుతో లెక్కకు మిక్కిలి అప్పులు చేస్తున్నాయని ఇప్పటికే ఆర్‌బీఐ పలుమార్లు హెచ్చరించింది.

ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌ను మించి అప్పులు చేస్తున్నాయని, కరెంటు బకాయిలూ పెరిగిపోతున్నాయని కేంద్ర ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

ఈ నేపథ్యంలో ప్రతి ఆర్థిక సంవత్సరారంభంలో కేంద్రం నిర్దేశించే రాష్ట్రాల నికర రుణసేకరణ పరిమితికి లోబడే రుణాలు సేకరిస్తున్నారా లేదా అన్నది తెలపాలని ఆయా రాష్ట్రాలను కోరింది. 2022 మార్చికి ముందు రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ ప్రదేశ్‌లు తమకు రాబోయే ఆదాయాన్ని హామీగా చూపి రూ.47,316 కోట్ల మేరకు అప్పులు తెచ్చినట్లు ఈ ఏడాది జూన్‌లో ధర్మశాలలో జరిగిన ఓ సమావేశంలో కేంద్ర ఆర్థిక కార్యదర్శి బాంబు పేల్చారు.

రాష్ట ప్రభుత్వాల అజమాయిషీలోని సంస్థలకు సొంత ఆదాయ వనరులు లేకున్నా అప్పులు తెస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ రుణాలకు వివిధ కార్పొరేషన్లను, ప్రభుత్వ సంస్థలను తనఖా పెడుతున్నాయి. తెలంగాణ మొత్తం రూ.1.35 లక్షల కోట్ల రుణాలకు హామీదారుగా ఉంది. అది 2022–23లో తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 11 శాతానికి సమానమని చెబుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్‌ భారీ రుణాలకు హమీదారులుగా ఉంటున్నాయంటున్నారు. విద్యుదుత్పత్తి సంస్థలకు రాష్ట్రాల డిస్కమ్‌లు రూ.1.10 లక్షల కోట్ల మేరకు బకాయిలు పడ్డాయని ధర్మశాల సమావేశంలో వెల్లడైంది. దీన్ని బట్టి రాష్ట్రాల ఆర్థిక స్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చని చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులు 2022–23కల్లా రూ.4,39,394 కోట్లకు చేరతాయని అంచనా వేస్తున్నారు. 2021–22 సవరించిన అంచనాల ప్రకారం రాష్ట్ర రుణభారం సుమారు నాలుగు లక్షల కోట్ల రూపాయలుగా ఉందని తెలుస్తోంది. ఇది కాకుండా వివిధ ప్రభుత్వ సంస్థలు చేసిన రుణాలు అదనం.

ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం భారీగా అప్పులు తెచ్చి రాజ్యాంగ విరుద్ధమైన రీతిలో ఖర్చు చేస్తోందని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) 2020–21 నివేదిక ఆక్షేపించడం గమనార్హం. దీనివల్ల ఆర్థిక క్రమశిక్షణ లోపించి ప్రజాధనం దుర్వినియోగమవుతుందని కాగ్‌ హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో చూపని రుణాలు 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.86,260 కోట్లకు చేరుకున్నాయని కాగ్‌ నివేదిక వెల్లడించింది.

భారత పొరుగు దేశం శ్రీలంక నెత్తిన ఆరు లక్షల కోట్ల రూపాయల రుణభారం ఉందని చెబుతున్నారు. అయితే శ్రీలంకను మించి మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌లు అంతకన్నా ఎక్కువగా రూ.6.50 లక్షల కోట్ల చొప్పున రుణభారాన్ని మోస్తున్నాయి.

అదేవిధంగా పశ్చిమ్‌ బెంగాల్‌పై రూ.5.60 లక్షల కోట్లు, గుజరాత్‌పై నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పుల భారం ఉందని నిపుణలు చెబుతున్నారు. ఈ 2022 మార్చి నెలాఖరుకు అన్నిరకాల అప్పులనూ కలిపి చూస్తే ఆంధ్రప్రదేశ్‌పై మొత్తం చెల్లింపుల భారం రూ.7.76 లక్షల కోట్లకు చేరినట్లు అంచనా.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.