Begin typing your search above and press return to search.

సంచ‌ల‌నంః ‘రాఫెల్’ అవినీతిపై షాకింగ్ న్యూస్!

By:  Tupaki Desk   |   9 April 2021 5:00 PM IST
సంచ‌ల‌నంః ‘రాఫెల్’ అవినీతిపై షాకింగ్ న్యూస్!
X
యూపీఏ ప్ర‌భుత్వం 126 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం ఫ్రాన్స్ తో చేసుకున్న ఒప్పందాన్ని.. మోడీ ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే ర‌ద్దు చేసింది. ఆ త‌ర్వాత విమానాల సంఖ్య‌ను 36కు త‌గ్గించి, కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. న‌రేంద్ర మోడీ స‌ర్కారు కుదుర్చుకున్న ఒప్పందంలో భారీ అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని ఆరోపించారు.

అయితే.. ఈ ఆరోప‌ణ‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం తోసిపుచ్చింది. ఎంతో నిజాయితీగా ఈ ఒప్పందం జ‌రిగింద‌ని ప్ర‌క‌టించింది. స్వ‌తంత్ర సంస్థ‌లూ ఇందులో త‌ప్పు లేద‌ని ప్ర‌కటించాయి. కానీ.. ‘మీడియా పార్ట్’ అనే ఫ్రెంచ్ న్యూస్ పోర్టల్ సంచలన కథనాన్ని ప్రచురించింది. రాఫెల్ విమానాల అమ్మకాల కోసం ఫ్రెంచ్ సంస్థ ‘దసో ఏవియేషన్’.. ఇండియాలోని ఓ మ‌ధ్య‌వ‌ర్తికి ప‌ది ల‌క్ష‌ల యూరోలు ఇచ్చింద‌ని రాసింది. అంటే.. భార‌త క‌రెన్సీలో సుమారు రూ.9 కోట్లు!

ఈ విష‌యాన్ని ఫ్రెంచ్ అవినీతి నిరోధ‌క శాఖ ప‌సిగ‌ట్టింద‌ని ‘మీడియా పార్ట్’ వెల్ల‌డించింది. ఈ డ‌బ్బులు మొత్తం.. అగ‌స్టా వెస్ట్ ల్యాండ్ హెలికాఫ్ట‌ర్ల కుంభ‌కోణంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న సుసేన్ గుప్తాకు చేరాయ‌ని చెప్ప‌డం గ‌మ‌నించాల్సిన అంశం. సుసేన్ గుప్తా కంపెనీ.. భార‌త్ లో ‘ద‌సో ఏవియేష‌న్’ కంపెనీకి స‌బ్ కాంట్రాక్ట‌ర్ గా ఉంది. అగస్టా కుంభకోణానికి సంబంధించి 2019లో ఈడీ అధికారులు ఆయ‌న‌ను అరెస్టు చేశారు.

కేవ‌లం అనిల్ అంబానీకి లాభం చేకూర్చేందుకే.. రాఫెల్ యుద్ధ‌విమానాల ఒప్పందాన్ని బీజేపీ స‌ర్కారు కుదుర్చుకుంద‌ని కాంగ్రెస్ విమ‌ర్శిస్తూ వ‌చ్చింది. ఇప్పుడు లంచాల బాగోతం న‌డిచింద‌ని ‘మీడియా పార్ట్’ క‌థ‌నం ప్ర‌చురించ‌డంతో కాంగ్రెస్ స్పందించింది. ఈ ఒప్పందంలో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని మొద‌టి నుంచీ రాహుల్ చెబుతున్నార‌ని, చివ‌ర‌కు అదే నిజ‌మైంద‌ని వ్యాఖ్యానించింది. స్వ‌తంత్ర సంస్థ‌తో ద‌ర్యాప్తు చేయిస్తే.. మొత్తం అవినీతి బాగోతం బ‌య‌ట‌ప‌డుతుంద‌ని వాదిస్తోంది.

మొద‌టి నుంచీ రాఫెల్ విమానాల కొనుగోలులో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని రాహుల్ వాదిస్తూ వ‌చ్చారు. ప్ర‌భుత్వం మాత్రం అదేం లేద‌న్న‌ది. ఫ్రాన్స్ ప్ర‌భుత్వానికి హామీ ఇచ్చామంటూ.. విమానాల ధ‌ర ఎంతో చెప్ప‌డానికి కూడా వీల్లేద‌ని ప్ర‌క‌టించింది. కానీ.. ఇప్పుడు ఫ్రాన్స్ కు చెందిన‌ మీడియా సంస్థ అవినీతి జ‌రిగింద‌ని క‌థ‌నం ప్ర‌చురించ‌డంతో.. మ‌రోసారి ఆ అంశం తెర‌పైకి వ‌చ్చింది.