Begin typing your search above and press return to search.

బహిరంగ సభలో జీవో కాపీ చించేసిన పవన్ జైలుకు వెళతారా?

By:  Tupaki Desk   |   21 Feb 2022 6:33 AM GMT
బహిరంగ సభలో జీవో కాపీ చించేసిన పవన్ జైలుకు వెళతారా?
X
జగన్ ప్రభుత్వానికి సవాలు విసిరేలా వ్యవహరించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ప్రత్యర్థుల విషయంలో జగన్ సర్కారు ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో తెలిసిందే. తాము అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో (సుమారు) ప్రత్యర్థి పార్టీలకు చెందిన అధినేత మొదలు నేతల వరకు ఏ చిన్న తప్పు చేసినా ఇట్టే కేసులు నమోదు చేయటమేకాదు.. అరెస్టు చేసిన ఘన చరిత్రను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అలాంటి జగన్ సర్కారుకు సవాలు విసిరేలా వ్యవహరించారు పవన్ కల్యాణ్.

నరసాపురంలో జరిగిన మత్స్యకార అభ్యున్నతి సభలో మాట్లాడిన సందర్భంలో.. మత్య్సకారుల ప్రయోజనాలకు దెబ్బ పడేలా రూపొందించిన జీవో 217ను ఆయన తీవ్రంగా వ్యతిరేకంచారు. ప్రజా సమస్యలు తీర్చేందుకు వైసీపీకి అధికారం ఇచ్చారే తప్పించి వారిని మరిన్ని సమస్యల్లోకి నెట్టటానికి కాదంటూ విరుచుకుపడ్డారు.

చేపలు.. మటన్.. చికెన్ షాపులు నడపటానికి అధికారం ఇవ్వరని మండిపడ్డారు. ఇందుకోసమే పాదయాత్ర చేశారా? అని నిలదీసిన పవన్ కల్యాణ్.. లేని సమస్యల్ని క్రియేట్ చేయటంలో వైసీపీ నేతలు మహా ఉద్దండులని.. దాన్ని వారే పరిష్కరించినట్లు చేస్తామన్నారు.

లక్షలాది మత్స్యకారుల పొట్టకొట్టేలా.. కష్టాన్ని దోచుకునేలా రూపొందించిన జీవో 217కు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. చెరువులు.. కుంటలు ఆన్ లైన్ లో నమోదు చేసి 25 శాతం మందస్తు చెల్లింపులు చేయాలన్న పవన్.. మత్స్యకారులకు అంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ప్రతిని చించివేశారు.

జీవో కాపీని చింపేయటాన్ని చూపిస్తూ కేసు నమోదు చేయొచ్చని.. దానికి తాను సిద్ధంగా ఉన్నారన్నారు. చట్టాల్ని పాటించటం ఎంత ముఖ్యమో.. కష్టాన్ని దోచుకునేలా ఉండే చట్టాలపై ఎదురుతిరగటం కూడా అంతే అవసరమన్నారు. వాటిని ఉల్లంఘించటంలో ఎలాంటి తప్పు లేదన్నారు.

ఒకవేళ తాను జీవోను చించివేయటంపై ప్రభుత్వం కేసులు పెట్టి.. తనను అరెస్టు చేస్తే జైలుకు వెళ్లటానికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పారు. జీవోను వెనక్కి తీసుకునేందుకు తాను పోరాటం చేస్తానన్నారు.

ఒకవేళ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే.. 2024లో జనసేన ప్రభుత్వం ఏర్పడిన వారం రోజుల్లోనే 217 జీవోను రద్దు చేస్తామన్నారు. జనసేనకు పది మంది ఎమ్మెల్యేలు ఉండి ఉంటే.. ఈ జవోను తెచ్చేందుకు ప్రభుత్వం ధైర్యం చేసేది కాదన్న పవన్.. జీవో రద్దుకు అవసరమైన ప్లాన్ ను చెప్పాలని కోరారు.

తాను ఆందోళన చేయటానికి రోడ్ల మీదకు రావటానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేసిన పవన్.. ‘‘నేను రోడ్డు మీదకు వస్తా. మహా అయితే కేసులు పెడతారు. ఒకరికి గుండె ధైర్యం వస్తే.. ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇక్కడ తప్ప దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇలాంటి జీవో లేదు. మటన్ దుకాణాలు పెట్టుకోవటానికి.. చేపలు అమ్ముకోవటానికి ప్రభుత్వం ఉందా?’’ అటూ ఫైర్ అయ్యారు.

జీవో చించివేత చర్యతో కేసు పెట్టొచ్చని పవనే స్వయంగా వెల్లడించిన నేపథ్యంలో.. జగన్ సర్కారు ‘చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది’ అన్న విధానాన్ని పాటిస్తారా? వ్యూహాత్మక మౌనంతో వ్యవహరిస్తారా? అన్నది చూడాలి.