Begin typing your search above and press return to search.

పారాహుషార్ : కరోనా తిరగదోడిదంటే చుక్కలే!

By:  Tupaki Desk   |   24 Sept 2020 9:15 AM IST
పారాహుషార్ : కరోనా తిరగదోడిదంటే చుక్కలే!
X
కరోనా సోకినా ఇబ్బందేమి లేదు. మంచి వైద్యం, ఆహారం తీసుకుంటే ఈ వ్యాధి నుంచి బయటపడొచ్చు. దేశ వ్యాప్తంగా దాదాపు 90 శాతం మంది ఈ వ్యాధినుంచి ఈజీగా కోలుకుంటాన్నారు’ అనేది ఇప్పడు మెజార్టీ ప్రజల అభిప్రాయం. వైద్యులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. అయితే కరోనా మొదటిసారి సోకితే మనం బయటపడొచ్చు.. కానీ రెండోసారి సోకితే మాత్రం చాలా తీవ్రస్థాయిలో ఉంటుందని పలువురు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. కరోనా వైరస్‌పై తాజాగా జరిగిన ఓ అధ్యయనం లో ఈ విషయం తేలింది. మొదటి సారి వచ్చిన వాళ్లకంటే.. రెండోసారి కరోనా బారినపడ్డవాళ్లలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు పరిశోధన లో తేలింది. అయితే ఈ అంశాలు ప్రపంచ ప్రఖ్యాత ‘ది లాన్సెట్​ జర్నల్​’ హెల్త్​ మ్యాగజైన్​ లో ప్రచురితమయ్యాయి. ముంబైకి చెందిన నలుగురు వైద్య సిబ్బందికి రెండోసారి కరోనా సోకింది. కాగా వీరి జన్యుపరిణామ క్రమాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలకు షాకింగ్​ నిజాలు తెలిశాయి.


బీఎంసీకి చెందిన నాయర్‌ ఆసుపత్రిలోని ముగ్గురు వైద్యులు, హిందుజా ఆసుపత్రిలో ఓ ఆరోగ్య కార్యకర్త రెండోసారి కరోనా బారినపడ్డారు. వీరి జన్యుపరిణామ క్రమాన్ని నాయర్, హిందూ ఆస్పత్రులు, ఇనిస్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్‌ అండ్ ఇంటిగ్రేటివ్ బయోలజీ, ఢిల్లీకి చెందిన ది ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనిటిక్స్ ఇంజనీరింగ్ అండ్ బయోలజీ సంయుక్తంగా అధ్యయనం నిర్వహించాయి. అయితే వారిలో వైరస్​ జీనోమ్స్​ 39 సార్లు ఉత్పరివర్తనం చెందినట్టు గుర్తించారు. మరోవైపు రెండోసారి కరోనా సోకిన వారికి వైరస్​ లక్షణాలు కూడా ఎక్కవగా కనిపించాయట. రెండోసారి వచ్చినవారు మొదటిసారికంటే ఎక్కువ రోజులు కరోనా లక్షణాలతో బాధపడ్డారట. ఆర్‌టీపీసీఆర్ పరీక్ష రీఇన్ఫెక్షన్‌ను నిర్ధారించదు. జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా మాత్రమే ఈ విషయం వెల్లడవుతుంది’ పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ జయంత్ శాస్త్రి, ఐసీజీఈబీకి చెందిన డాక్టర్ సుజాత సునీల్ వెల్లడించారు. అయితే ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువసంఖ్యలోనే కరోనా వైరస్​ రెండోసారి అటాక్​ చేస్తుంది. తొలిసారిగా హాంకాంగ్​కు చెందిన ఓ వ్యక్తికి కరోనా రెండోసారి సోకింది. తర్వాత అమెరికాలో నెవాడా, బెల్జియం, ఈక్వెడార్‌లలో ఈ తరహా కేసులు నమోదయ్యాయి,