Begin typing your search above and press return to search.

సినిమాల్లోనూ చూపించని ఘోరమిది.. తెలిస్తే వణికిపోతారు

By:  Tupaki Desk   |   2 March 2021 9:30 AM GMT
సినిమాల్లోనూ చూపించని ఘోరమిది.. తెలిస్తే వణికిపోతారు
X
నేరాలు.. ఘోరాలు ఇప్పటివరకు చాలానే విని ఉంటాం. టీవీల్లో చూసి ఉంటాం. కానీ.. ఇప్పటివరకు ఎప్పుడూ బయటకు రాని సరికొత్త ఘోరం తాజాగా బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఒక ప్రముఖ మీడియా సంస్థ కవర్ చేసిన ఈ నేర కథనం మూలాల్లోకి వెళితే.. డబ్బుల కోసం మరీ ఇంత దారుణానికి పాల్పడతారా? అన్న సందేహం కలుగక మానదు. బీమా సొమ్ము కోసం ఇప్పటివరకు ఐదుగురిని హత్య చేసిన గుట్టు రట్టైంది. పోలీసు అధికారులు సైతం షాకిచ్చిన ఈ దారుణ నేరంలోకి వెళితే..

నల్గొండ జిల్లాలోని దామరచర్ల మండలం కొండ్రపోల్ కు చెందిన కోటిరెడ్డి వారం క్రితం అనుమానాస్పదంగా నార్కట్ పల్లి - అద్దంకి రహదారి పక్కన మరణించాడు. ఆయన్ను ట్రాక్టర్ ఢీ కొట్టి చనిపోయారని అతడి భార్య కుటుంబ సభ్యుల్ని నమ్మించింది. అంత్యక్రియల సమయంలో అతడి డెడ్ బాడీ మీద ఉన్న పెద్ద గాయాల్ని చూసిన కోటిరెడ్డి తల్లిదండ్రులు అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో.. పోలీసులు కోటిరెడ్డి భార్య ను గట్టిగా ప్రశ్నించారు.

దీంతో.. ఒళ్లు జలదరించే దారుణ నిజం బయటకు వచ్చింది. పక్క గ్రామానికి చెందిన ప్రియుడితో కలిసి బీమా డబ్బుల కోసం తామే కోటిరెడ్డిని హత్య చేసి.. ట్రాక్టర్ తో తొక్కించినట్లుగా ఒప్పుకుంది. దీంతో.. బీమా ఎజెంట్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తే.. ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే దారుణ హత్యల పరంపర బయటకు వచ్చింది. గడిచిన మూడేళ్లలో ముఠా కట్టిన ఒకటీం.. బీమా డబ్బుల కోసం అమాయకుల్ని చంపేసే దారుణాల గురించి చెప్పుకొచ్చారు.

మారుమూల గ్రామాల్లో అనారోగ్యంతో బాధ పడుతున్న వ్యక్తుల వివరాలు సేకరిస్తామని.. తర్వాత కుటుంబ సభ్యులను ఒప్పించి వారి పేరుతో పెద్ద మొత్తాల్లో బీమా చేయిస్తారు. ఒకట్రెండు వాయిదాల మొత్తాల్ని తాము కట్టేస్తారు. అనంతరం కుటుం సభ్యులతో ఒప్పందం కుదుర్చుకుంటారు. బీమా ఎంత మొత్తానికి చేశారు? ఏమిటన్న వివరాలు తెలీకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.

ఆ తర్వాత వారిని హత్య చేసి రోడ్డు మీదకు తీసుకొచ్చి పడేస్తారు. ఏ కారుతోనో ఢీ కొట్టించి.. ప్రమాదంలో చనిపోయినట్లుగా సీన్ సెట్ చేస్తారు. పోలీసుల నుంచి ఎఫ్ఐఆర్ తీసుకొని.. బీమా పాలసీని క్లెయిమ్ చేస్తారు. విచారణకు వచ్చిన థర్డ్ పార్టీ సభ్యుల్ని.. డబ్బుల పంపిణీలో కీలకంగా వ్యవహరించే బ్యాంకు అధికారుల్ని మేనేజ్ చేస్తారు. వచ్చిన బీమా మొత్తంలో 20 శాతం తాము చంపేసిన కుటుంబానికి ఇచ్చి.. మిగిలిన మొత్తాన్ని వీరు నొక్కేస్తారు. ఇలా బీమా డబ్బుల కోసం ఇప్పటివరకు ఐదుగురిని చంపేసినట్లు వెల్లడించారు. వీరి ఆరాచకాలకు సహకరిస్తున్నది పదిహేడు మంది అన్న విషయాన్ని గుర్తించారు. ఇప్పటికే ఈ దందాలో కీలకంగా వ్యవహరించిన ఏజెంట్ పోలీసుల అదుపులో ఉండగా.. మిగిలినవారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.