Begin typing your search above and press return to search.

తాత అంత్యక్రియలకు వచ్చి.. నలుగురు మనమళ్లు మృతి

By:  Tupaki Desk   |   21 Nov 2020 11:00 AM IST
తాత అంత్యక్రియలకు వచ్చి.. నలుగురు మనమళ్లు మృతి
X
ఈ విషాదం వినలేనిది. అందరి నోట అయ్యో అనిపించే ఈ ఉదంతం తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లాలో చోటు చేసుకుంది. తాత అంత్యక్రియలకు వచ్చిన మనవళ్లలో నలుగురు మృత్యువాత పడిన వైనం జీర్ణించుకోలేనిది. ఊహించని రీతిలో విరుచుకుపడిన ఈ విషాదానికి ఆ తల్లుల రోదిస్తున్న వైనం కళ్లు చెమ్మగిల్లేలా చేస్తోంది. ఇంతకూ ఏం జరిగిందంటే?

నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలంలోని నంద్యా నాయక్ తండా అనే శివారు ప్రాంతం ఉంది. ఈ తండాకు చెందిన రాములు అనారోగ్యంతో హైదరాబాద్ లో మరణించారు. ఆయన అంత్యక్రియల్ని గ్రామంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆయన ముగ్గురు కుమారులు.. కుమార్తెలు తమ పిల్లల్ని తీసుకొని ఊరికి వచ్చారు.

అంత్యక్రియల కోసం వచ్చిన వారు.. ఆ కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. గ్రామంలో విద్యుత్ సరఫరా సరిగా లేకపోవటంతో స్నానం చేయటానికి రాములు మనమళ్లు అంతా కలిసి సమీపంలోని చెరువు వద్దకు స్నానానికి వెళ్లారు. ఒకరి చేయి మరొకరు పట్టుకొని జాగ్రత్తగా చెరువులో స్నానానికి వెళ్లినప్పటికీ.. అదుపు తప్పి అందరూ మునిగిపోయారు. ఇందులో రాములు మొదటి కొడుకు కొడుకు తొమ్మిదేళ్ల విశాల్ పెద్దగా కేకలు వేశాడు.

దీంతో.. అటువైపు వెళుతున్న తండా వాసులతోపాటు.. రాములు చిన్న కొడుకు వెంటనే రియాక్ట్ అయ్యారు. విశాల్ ను బయటకు లాగారు. అప్పటికే నలుగురు చిన్నారులు చెరువులో మునిగిపోయారు. ఇందులో రాములు రెండో కొడుకు కొడుకు.. మూడో కొడుకు కొడుకు.. కుమార్తె కొడుకు.. మొదటి కుమారుడు కొడుకు ఉన్నారు. మిగిలిన వారి కోసం వెతికిన స్థానికులు..నిర్జీవంగా ఉన్న పిల్లల్ని చెరువులో నుంచి బయటకు తీశారు. విషాదం ఏమంటే.. అన్న కొడుకు విశాల్ ను కాపాడిన మోహన్.. తన సొంత కొడుకును మాత్రం కాపాడుకోలేకపోయారు. తండ్రి అంత్యక్రియల కోసం వచ్చి.. తమ పిల్లల్ని పోగొట్టుకున్న వైనం ఆ కుటుంబానికి భారీ శరాఘాతంగా మారింది. వారి రోదనలు అక్కడి వారిని కదిలించేశాయి.