Begin typing your search above and press return to search.

సూర్యాపేటలో దారుణం : తల్లిదండ్రుల ఫొటోలకు చెప్పుల దండ .. దేనికోసమంటే ?

By:  Tupaki Desk   |   16 Dec 2020 3:10 PM IST
సూర్యాపేటలో దారుణం : తల్లిదండ్రుల ఫొటోలకు చెప్పుల దండ .. దేనికోసమంటే ?
X
తల్లిదండ్రులకి కుమారులు ఇచ్చే గౌరవం రోజురోజుకి తగ్గిపోతుంది. కొందరు బతికుండగానే వారికి నరకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తున్నారు. కొందరు కన్నవారిని రోడ్డున పడేస్తున్నారు. మరికొందరు అనాధలుగా వదిలివేస్తున్నారు. ఆస్తుల కోసం తల్లిదండ్రులను నానా చిత్ర హింసలకు గురి చేస్తున్నారు. ఆస్తి కోసం కన్నతండ్రిని కుమారులే కిడ్నాప్ చేసిన ఘటన తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. సూర్యాపేటలోని భగత్ సింగ్ నగర్‌లో చోటుచేసుకుంది.

వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను కంటికిరెప్పలా కాపాడుకోవాల్సిన కుమారులు కనీసం వారిని పట్టించుకోకపోవడమే కాకుండా, వారిని వేధిస్తూ, మరింత రెచ్చిపోయి ఘోరంగా అవమానించారు. తల్లిదండ్రుల చిత్రపటానికి చెప్పులదండ వేశారు. ఆ ఫొటోను కుటుంబ వాట్సాప్‌ గ్రూప్‌ లో షేర్ చేశారు. ఈ ఘటన పై పూర్తి వివరాల్లోకి వెళ్తే .. రిటైర్డ్ తహసీల్దార్ సంజీవరావుకు ముగ్గురు కుమారులు. ముగ్గురు కొడుకుల్లో ఇద్దరు స్థిరపడ్డారు. రవీందర్‌ ఎల్‌ ఐసీ ఆఫీసులో పనిచేస్తుంటే, దయాకర్‌ గవర్నమెంటు టీచర్‌ గా చేస్తున్నారు. మరో కుమారుడు ఎలక్ట్రీషియన్ పనులతో కుటుంబాన్ని పోషిస్తుండడంతో.. తండ్రి అప్పుడప్పుడు డబ్బు సాయం చేస్తున్నాడు.

ఇది మిగతా ఇద్దరు సోదరులకు నచ్చలేదు. భవిష్యత్‌ లో ఉన్న ఐదెకరాల పొలం కూడా తమ్ముడికే ఇచ్చేస్తారన్న అనుమానంతో తండ్రితో గొడవకు దిగారు. దీంతో తండ్రి పేరు మీద ఉన్న ఐదు ఎకరాల భూమి కోసం గత కొన్నిరోజులుగా నానారకాలుగా ప్రయత్నిస్తున్నారు. అయితే తమ ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో.. మంగళవారం ఉదయం తండ్రి ఇంటికి వచ్చారు. ఇద్దరు కొడుకులు తండ్రితో ఆస్తి కోసం గొడవకు దిగారు. ఆస్తి రాస్తావా చస్తావా అన్నంతగా ఆయనను హింసించారు.

అడ్డు వచ్చిన తల్లిని సైతం పక్కకు నెట్టేశారు. ఈ ఘటనతో ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఎంతకూ సంజీవరావు తన పట్టువిడవకపోవడంతో... ఆయన్ను తమ వాహనాల్లో ఎక్కించుకుని అక్కడ్నుంచి వెళ్లిపోయారు. తండ్రి పేరుపై రామన్నపేట మండలం పల్లివాడలో ఉన్న భూమి కోసమే కొడుకులిద్దరూ ఈ కిడ్నాప్ చేశారు. తల్లి సరోజపై దాడి చేసి.. బలవంతంగా తండ్రిని కారులో ఎక్కించుకెళ్లారు. భర్త ఆచూకీ కోసం తల్లి సరోజ కన్నీరుపెడుతోంది. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితులు తాము చేసిన నేరాన్ని అంగీకరించారు. అయితే, తనను కుమారులు కిడ్నాప్ చేయలేదని తండ్రి చెప్పడం గమనార్హం. నిందితులను పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.