Begin typing your search above and press return to search.

బట్టలు విప్పదీసి.. కళ్లలో కారం కొట్టి కర్రలతో కొడుతూ ఊర్లో తిప్పారు

By:  Tupaki Desk   |   30 Aug 2021 9:00 AM IST
బట్టలు విప్పదీసి.. కళ్లలో కారం కొట్టి కర్రలతో కొడుతూ ఊర్లో తిప్పారు
X
అమానుషం చోటు చేసుకుంది. విన్నంతనే ఉలిక్కిపడే దారుణం సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. హత్య కేసులో నిందితురాలిగా ఉంటూ ఇటీవల బెయిల్ మీద విడుదలైన ఒక మహిళ పట్ల ప్రతీకారంతో.. మృతుడి బంధువులు చేసిన దౌర్జన్యం సభ్య సమాజం తల దించుకునేలా ఉంది. కళ్లల్లో కారం కొట్టి ఆమె బట్టలు ఊడదీసి.. కర్రలతో కొడుతూ.. గంట పాటు ఊరంతా రోడ్డు మీద తిప్పిన వైనం షాకింగ్ గామారింది. ఇంతటి అమానుషంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇంత జరుగుతున్నా.. ఎవరూ అడ్డుకోని వైనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగిందంటే..

సూర్యాపేట మండలం రాజునాయక్ తండాకు చెందిన శంకర్ నాయక్ జూన్ 13న హత్యకు గురయ్యారు. దీనికి బాధ్యురాలిగా ఊరికి చెందిన ఒక మహిళను నిందితురాలిగా అరెస్టు చేసి.. జైలుకు పంపారు. హత్యకు గురైన శంకర్ నాయక్ కుటుంబంతో ఆమెకు పాత కక్షలు ఉన్నాయి. ఇటీవల బెయిల్ మీద బయటకు వచ్చిన సదరు మహిళ.. తన సోదరి ఇంట్లో ఉంటున్నారు. ఇదిలా ఉండగా.. ఆదివారం ఊళ్లో బంధువు ఒకరుమరణించారు. దీంతో.. వారింటికి పరామర్శకు వెళ్లిన ఆమెను చూసిన మృతుడి కుటుంబీకులు ఆగ్రహంతో ఊగిపోయారు.

ఆమెపై దాడికి పాల్పడి.. బలవంతంగా ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చారు. ఆమెను వివస్త్రను చేసి కళ్లల్లోకారం పోశారు. కర్రలతో కొడుతూ గంట పాటు ఊరు మొత్తం తిప్పారు. ఇంత జరుగుతున్నా ఎవరూ ఈ ఉదంతాన్ని అడ్డుకోలేదు. చివరకు వారి అమానుషకాండ నుంచి తప్పించుకున్న మహిళ.. ఎంపీటీసీ సభ్యురాలు శాంతాబాయి ఇంటికి పరుగు తీసింది. ఆమెకు వస్త్రాలు ఇచ్చి రక్షణ ఇచ్చారు.

ఈ ఉదంతం గురించి తెలుసుకున్న పోలీసులు ఊరికి వచ్చి విచారణ జరుపుతున్నారు.బాధితురాలిని సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు. పలువురు తనపై దాడికి పాల్పడ్డారని పేర్కొంటూ వారి పేర్లను బాధితురాలు తెలియజేసింది. జరుగుతున్న దారుణాన్ని చూసినప్పటికీ సర్పంచ్.. గ్రామ పెద్దలు అడ్డుకోలేదని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఉదంతం షాకింగ్ గా మారింది.