Begin typing your search above and press return to search.

ప్రకాశం జిల్లాలో అలా జరిగింది.. పొదుపు ఖాతాల్లో డబ్బుల్ని నొక్కేశారు

By:  Tupaki Desk   |   5 Oct 2020 3:40 PM IST
ప్రకాశం జిల్లాలో అలా జరిగింది.. పొదుపు ఖాతాల్లో డబ్బుల్ని నొక్కేశారు
X
నమ్మినోడే నట్టేట ముంచాడన్న మాట తరచూ వింటాం. నిజానికి నమ్మినోడినే కదా మోసం చేయగలిగింది. నమ్మనోడ్ని ఏమీ చేయలేక.. నమ్మకంగా నొక్కేసిన ఘరానా మోసం ఒకటి తాజాగా ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. పొదుపు సంఘాలకు చెందిన రుణాల్ని పక్కదారి పట్టించటమే కాదు.. పత్తా లేకుండా పోవటం సంచలనంగా మారింది. రుణాలిచ్చిన బ్యాంకు మేనేజర్.. పొదుపు సంఘాల వారికి ఫోన్ చేసి.. తీసుకున్న రుణాలకు చెల్లింపులు జరపటం లేదంటూ ఆరా తీసిన ఫోన్ కాల్ కొత్త దందాను బయట పడేలా చేసింది.

అదేంది సారూ.. మేం అసలు రుణాలే తీసుకోలేదు.. చెల్లింపులు చేసేదెలా? అంటూ పొదుపు మహిళలు బిత్తరపోతూ అడిగిన ప్రశ్న.. గుట్టుగా సాగిన మోసాన్ని రట్టు చేసింది. ప్రకాశం జిల్లాలకు చెందిన యర్రగొడపాలెం మండలంలోని వీరభద్రాపురం.. గురిజేపల్లి.. బోయిలపల్లి.. గోళ్లవిడిపి.. వీరభద్రాపురం.. పుల్లల చెరువు మండలంలోని మల్లాపాలెం గ్రామాల్లోని పొదుపు సంఘాల వారు పొదుపు రుణాల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద రుణాలు తీసుకుంటూ ఉంటారు.

కరోనా వేళ.. లాక్ డౌన్ టైంలో రుణాలు పొందేందుకు స్వయం సహాయక సంఘాల లీడర్లు డాక్యుమెంటేషన్ కోసం బ్యాంకు వెళ్లారు. కోవిడ్ నిబంధనల కారణంగా ఫీల్డ్ ఆఫీసర్ సారు ఉన్న గదిలోకి ఎవరిని రానివ్వమంటూ రానివ్వలేదు. డాక్యుమెంట్లను అక్కడున్న ఫీల్డ్ ఆఫీసర్ సహాయకురాలికి అనధికారికంగా అప్పజెప్పి వచ్చారు. మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఈ ఉదంతంలో ఐదు గ్రామాలకు చెందిన స్వయం సహాయక సంఘాల వారు ఇదే తీరులో వ్యవహరించారు.

రుణాలు తీసుకున్న తర్వాత తిరిగి సమయానికి చెల్లించకపోవటంతో.. కొత్తగా వచ్చిన బ్యాంకు మేనేజర్ ఖాతాలోని వారికి ఫోన్లు చేశారు. అప్పు తీసుకున్నారు..తిరిగి చెల్లించటం లేదంటూ ఆరా తీశారు. అప్పు కోసం డాక్యుమెంటేషన్ చేశామే తప్పించి.. బ్యాంకు తమకు ఇంతవరకు రుణమే ఇవ్వలేదని చెప్పారు. వారి మాటలతో.. తప్పు ఎక్కడో జరిగిందన్న విషయాన్ని గుర్తించిన మేనేజర్ ఆరా తీయగా మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది.

గ్రామాలకు చెందిన పొదుపు సంఘాల వారి పేరుతో తీసుకున్న లక్షలాది రూపాయిల మొత్తాలు ఎక్కడికి వెళ్లాయి? ఎవరు తీసుకున్నారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారాయి. సుమారు రూ.12 లక్షల మేర పక్కదారి పట్టినట్లుగా అంచనా వేస్తున్నారు. అయితే.. ఇదంతా బదిలీపై వెళ్లిన ఫీల్డ్ ఆఫీసర్ వారి పుణ్యమని చెబుతున్నారు. అయితే.. ఆయన మాత్రం.. పొరపాటున ఒకరి ఖాతాలో వేయాల్సిన డబ్బులు వేరే వారి ఖాతాలో వేశామని.. తప్పును సరిదిద్దుకుంటామని.. 20 రోజులు టైమిస్తే.. మొత్తం డబ్బుల్ని తిరిగి చెల్లిస్తామని చెప్పటం గమనార్హం.

జరిగిన యవ్వారమంతా.. బదిలీపై వెళ్లిన ఫీల్డ్ అధికారి.. ఆయనకు సహాయకురాలిగా వ్యవహరించిన మహిళే ఇదంతా చేసి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ వాదనకు బలం చేకూరేలా.. తాజాగా ఫీల్డ్ ఆఫీసర్ కు సహాయకురాలిగా వ్యవహరించే మహిళ కూడా కనిపించకుండా పోవటంతో సందేహాలు మరింత పెరిగాయి. ఏమైనా.. ఒకరి పేరు మీద రుణం తీసుకొని.. వారికి ఆ డబ్బులు ఇవ్వకుండా ఉన్న వైనం సంచలనం మారింది. ఈ విషయాన్ని గుట్టుచప్పుడు కాకుండా సెట్ చేసేందుకు బదిలీ మీద వెళ్లిన బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ శతవిధాలుగా ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు.