Begin typing your search above and press return to search.

ఇష్టం లేని పెళ్లి చేసుకున్న ‘కుమార్తె’ కు అంత్యక్రియలు

By:  Tupaki Desk   |   1 April 2021 11:30 PM GMT
ఇష్టం లేని పెళ్లి చేసుకున్న ‘కుమార్తె’ కు అంత్యక్రియలు
X
తాము చెప్పినట్లు వినని.. తాము చూపించిన కుర్రాడ్ని పెళ్లాడని ఒక యువతి తల్లిదండ్రులు దారుణంగా వ్యవహరించారు. తమ మాట కాదని వేరే కుర్రాడ్ని పెళ్లాడిందన్న కోపంతో.. కూతురు బొమ్మకు అంత్యక్రియులు నిర్వహించిన ఉదంతం సంచలనంగా మారింది. ఈ అమానుష ఘటన ఝూర్ఖండ్ లో చోటు చేసుకుంది.

తమ సమీప బంధువుతో తమ కుమార్తె చనువుగా ఉండటాన్ని వారు భరించలేకపోయారు. అతనితో కాకుండా తాము చూపించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలంటూ ఒక సంబంధాన్ని తీసుకొచ్చారు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకొంది. దీంతో.. తీవ్ర ఆగ్రహానికి గురైన సదరు తల్లిదండ్రులు.. ఆమె బతికి ఉండగానే అంతిమ సంస్కారాల్ని నిర్వహించారు.

ఛత్రా జిల్లా తాండవ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే పాతికేళ్ల సబితా నాలుగు నెలల క్రితం తనకు నచ్చిన రాజ్ దీప్ ను ప్రేమించి పెళ్లాడింది. దీన్ని కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. వారు మేజర్లు కావటంతో తామేమీ చేయలేమని పోలీసులు చెప్పారు.

ఇదే సమయంలో కుమార్తె తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లాడటంతో రగిలిపోయిన తల్లిదండ్రులు కుమార్తె బొమ్మను తయారు చేయించి..అంతిమ సంస్కారాలు నిర్వహించారు. వారి ఆచారాల ప్రకారం దహన సంస్కారాలు కూడా పూర్తి చేయటం గమనార్హం. మంచి అబ్బాయిని ఎంపిక చేసి పెళ్లి చేస్తామని చెబితే.. తమ కుమార్తె ఒప్పుకోకుండా తనకు ఇష్టం వచ్చిన వ్యక్తిని పెళ్లాడిందని.. అందుకే తామీ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా వారు చెబుతున్నారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.